Agriculture

సంగారెడ్డిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు

Telugu Agricultural News | Sangareddy Doctor Farming Dragon Fruit

విలక్షణమైన వైద్యుడు డాక్టర్‌ మాధవరం శ్రీనివాసరావు. మనుషుల డాక్టర్‌ పట్టుదలతో మొక్కల డాక్టర్‌గా మారారు. ఉద్యాన శాస్త్రవేత్తగా అవతారం ఎత్తారు. ఖరీదైన, పోషక విలువలున్న పండు డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగుపై దృష్టి కేంద్రీకరించారు. వియత్నాం సహా 11 దేశాలు తిరిగి మెలకువలు నేర్చుకున్నారు. హైదరాబాద్‌కు సమీపంలోని తన క్షేత్రంలో డ్రాగన్‌ ఫ్రూట్‌ను అత్యంత లాభదాయకంగా సాగు చేయడంలోనే కాదు.. కొత్త హైబ్రిడ్స్‌ బ్రీడింగ్‌పైనా పట్టు సాధించాడు. సెలెక్టివ్‌ బ్రీడింగ్‌తోపాటు ‘డబుల్‌ గ్రాఫ్టింగ్‌’ పద్ధతిని అనుసరిస్తూ 8 నెలల్లోనే కాపుకొచ్చే ‘సియాన్‌ రెడ్‌’ అనే కొత్త హైబ్రిడ్‌ డ్రాగన్‌ ఫ్రూట్‌ రకాన్ని రూపొందించారు. అన్‌సీజన్‌లోనూ దీపపు కాంతిలో అధిక దిగుబడి సాధిస్తున్నారు. డ్రాగన్‌ ఫ్రూట్‌ పల్ప్, వైన్‌ తయారు చేసి వాణిజ్యవేత్తగా ఎదగాలని ఆశిస్తున్నారు. వైద్య వృత్తిని వదలిపెట్టకుండానే డ్రాగన్‌ ఫ్రూట్‌ సేద్యంపై పరిశోధనలు సాగిస్తుండటం విశేషం. ఈ పండుతో వైన్‌ తయారు చేయాలని, పల్ప్‌ పరిశ్రమ పెట్టాలని కలలు కంటున్నారు.

చేసేది తీరిక లేని వైద్యవృత్తి. ఒక కొత్త పండు ఆయనను అమితంగా ఆకర్షించి, దేశ దిమ్మరిని చేసింది. వ్యవసాయంలోకి దింపింది. ఉద్యాన శాస్త్రవేత్తగా మార్చింది. ఆ విలక్షణ వైద్యుడే డాక్టర్‌ మాధవరం శ్రీనివాస్‌రావు. ఎండీ జనరల్‌ చదివాడు. పెళ్లిచూపుల్లో ఎర్రని డ్రాగన్‌ ఫ్రూట్‌ను చూసి మనసు పారేసుకున్నారు. దానిపై లోతైన అధ్యయనం చేశాడు. డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగుపై రెండేళ్లలోనే పట్టు సాధించాడు. ఆయన అనుభవాలు ఆయన మాటల్లోనే..

సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలంలోని అలియాబాద్‌ గ్రామ శివారులో 11 ఎకరాల భూమిని కొనుగోలు చేశాను. ఇందులో 2.5 ఎకరాల్లో పరిశోధనలు సాగిస్తున్నా. మిగతా భూమిలో డ్రాగన్‌ ప్రూట్‌ను సాగు చేస్తున్నా. తొలుత గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు చేసే రైతుల వద్దకు వెళ్ళాను. ఆ పంటను సాగుచేస్తున్నప్పటికీ వారి నుండి ఆశించిన సమాచారం అందలేదు. సంతృప్తి కలగ లేదు. ఆ అన్వేషణలోనే వియత్నాం సహా 11 దేశాలు తిరిగాను. వియత్నాం రైతుల దగ్గరే ఉండి వ్యవసాయ పాఠాలు నేర్చుకున్నాను. మహారాష్ట్ర నుండి కొన్ని మొక్కలు తెచ్చి పంటను సాగు చేద్దామని 2015లో ప్రారంభించాను. కానీ మహారాష్ట్ర నుండి మా పొలానికి తెచ్చే సరికే 70 శాతం మొక్కలు చనిపోయాయి.

ఇక ఇలా కాదని.. ఇక్కడి వాతావరణానికి అనుకూలించే మొక్కలను సాగు చేద్దామనుకున్నాను. ఉద్యాన శాఖ అధికారులను సంప్రదిస్తే.. ‘ఈ పంటలను మనం సాగు చేయలేం. దాన్ని గురించి మర్చిపోండి డాక్టర్‌ గారూ’ అని సలహా ఇచ్చారే తప్ప ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అయినా వెనక్కి తగ్గలేదు. ఎలాగైనా డ్రాగన్‌ ప్రూట్‌ పండించడమే కాకుండా దాన్ని ఫలితాన్ని రైతులకు అందించాలనే పట్టుదల, కసి మరింత పెరిగింది.

ఫిలిప్పీన్స్, మలేషియా,ౖ తెవాన్, ఇజ్రాయిల్, థాయిలాండ్‌ దేశాలకు వెళ్ళి అక్కడ డ్రాగన్‌ ప్రూట్‌ పండించే వ్యవసాయ క్షేత్రాలు చూశాను. వియత్నాంలో డ్రాగన్‌ ప్రూట్‌ పండించే రైతు ఇంట్లో పెయిడ్‌ గెస్ట్‌గా వారం రోజులు ఉండి పంటలను ఎలా సాగు చేయాలో పూర్తిగా తెలుసుకున్నాను. మొక్కలను అంట్లు కట్టడం(గ్రాఫ్టింగ్‌) నేర్చుకున్నాను. అక్కడి నుండి మొక్కలు తీసుకువస్తే కలిగే ఇబ్బందులను దృష్టిలో వుంచుకొని పండ్లు తీసుకువచ్చాను. ఆ గింజలు నాటి మొక్కలు పెంచాను. ఒకటికి రెండు సార్లు అంటు కట్టడం(డబుల్‌ గ్రాఫ్టింగ్‌) ద్వారా డ్రాగన్‌ ప్రూట్‌లో సియాన్‌ రెడ్‌ అనే కొత్త హైబ్రిడ్‌ రకానికి రూపకల్పన చేసి, సాగు చేస్తున్నాను.

డ్రాగన్‌ ప్రూట్‌ మొక్కకు త్వరగా ఎత్తు పెరిగే గుణం వుంటుంది. ఇవి నిటారుగా ఎదగడానికి ఆధారం కావాలి. అందుకే సిమెంట్‌ కాంక్రీటు స్థంభాలను నాటాలి. వాటి పైన మొక్క అల్లుకునేందుకు వీలుగా గుండ్రటి, చతురస్త్రాకారంతో సిమెంట్‌ నిర్మాణాలు ఏర్పాటు చేసి.. గొడుగులాగా మొక్కలు పెరిగేలా చేయాలి. ఏడు అడుగుల సిమెంట్‌ స్థంభాలను తీసుకొని రెండు అడుగుల లోతు భూమిలో పాతాలి. ఒక ఎకరాకు 450 నుండి 500 స్థంభాలను నేలను బట్టి 8 నుండి 10 అడుగుల దూరంగా నాటాలి. ప్రతి స్తంభం వద్ద నాలుగు వైపులా నాలుగు మొక్కల చొప్పున.. ఒక ఎకరంలో సుమారు 2 వేల మొక్కలను నాటాలి.

ఒకసారి మొక్కలు నాటితే 20 సంవత్సరాల వరకు పంట వుంటుంది. స్తంభానికి నలు దిక్కులా 2 అడుగుల పొడవు, వెడల్పు, ఒక అడుగు లోతు గుంతలు తవ్వాలి. గుంతకు 25 కిలోల పశువుల ఎరువు, కిలో వేప పిండి వేసి మొక్కలు నాటాలి. నేలను బట్టి, సాగు చేసిన రకాలను బట్టి తడులివ్వాలి. నీరు ఎక్కువైతే మొక్కలు కుళ్ళిపోయే ప్రమాదం వుంటుంది. సంవత్సరంలో రెండు సార్లు (జూన్, జనవరిలో) పశువుల ఎరువు వేసి సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని పిచికారీ చేయాలి. దీంతో పాటు ప్రతీ రెండు, మూడు నెలలకొకసారి జీవన ఎరువులను సైతం చెట్లపై పిచికారీ చేయాలి. నేలలో సారం పెంచేందుకు వర్షాకాలంలో చెట్ల మధ్య జనుము, పచ్చిరొట్ట పైరును పెంచి నేలలో కలియదున్నాలి. ఈ పంటలో చీడపీడల సమస్య చాలా తక్కువ.

సాధారణంగా డ్రాగన్‌ మొక్కలు తొలి కాపు కాయడానికి రెండు నుండి మూడు సంవత్సరాల సమయం పడుతుంది. అయితే, డబుల్‌ గ్రాఫ్టింగ్‌ పద్ధతిని ఉపయోగించి 8 నెలల కాలంలోనే తొలి దిగుబడి తీసుకువచ్చాను. సహజంగా డ్రాగన్‌ ప్రూట్‌ దిగుబడి కాలం జూన్‌–అక్టోబర్‌ మధ్య కాలం. కానీ, నవంబర్‌–జనవరి మధ్య కాలంలో విద్యుత్‌ లైట్ల ద్వారా కాంతిని మొక్కలకు అందించడం ద్వారా జనవరి, ఫిబ్రవరి నెలలోనే మొక్కలు పూతకు వచ్చేలా చేశాం. ఇలా చేస్తే 30 శాతం అధిక దిగుబడి వస్తుంది. సీజన్‌లో ఈ పండ్ల «ధర కిలో రూ.150 నుండి రూ. 200 వుంటే. అ¯Œ సీజన్‌లో మాత్రం రూ. 300 నుండి రూ. 400 వరకు వుంటుంది.

డ్రాగన్‌ ఫ్రూట్‌తోపాటు అవకాడో (వెన్న పండు) పంటలపై పరిశోధనాలు చేస్తున్నా. దిగుబడి, గుజ్జు, తీపి, నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉండే వంగడాలపై పరిశోధనాలు చేస్తున్నా. వైద్యవృత్తిలో బిజీగా ఉంటూనే రోజుకు కొన్ని గంటలు కేటాయిస్తున్నా. రైతులను ప్రోత్సహించి ఈ పంటలను విస్తృతంగా సాగులోకి తేవాలి. ఎక్కువ పంట అందుబాటులోకి వచ్చాక వైన్‌ తయారు చేద్దామని, పల్ప్‌ పరిశ్రమ నెలకొల్పాలని ఆశిస్తున్నాను. మన దేశంలోనే చాలా పెద్ద మార్కెట్‌ ఉంది, దిగుల్లేదు.– డాక్టర్‌ మాధవరం శ్రీనివాస్‌రావు(97040 83000), ఎండీ (జనరల్‌), డ్రాగన్‌ ఫ్రూట్‌ రైతు, బ్రీడర్‌

ప్రస్తుతం మూడురకాలను మొక్కలను సాగు చేస్తున్నాను. దిగుబడి ఎకరాకు 8 టన్నుల వరకు వస్తుంది. మన వాతావరణానికి తట్టుకొని, రోగ నిరోధక శక్తి కలిగి, అధిక దిగుబడి, రుచి, నిల్వ సామర్థ్యం ఉండే ఐదు కొత్త రకాల అభివృద్ధి కోసం పరిశోధనలు చేపట్టాను. మూడు రకాలను అందుబాటులోకి తెచ్చాను.ఈ పండు సాగు విధానంపై రైతులకు అవగాహన కల్పించి సబ్సిడీ రుణాలు అందించాలి. ఈ పండు బ్లడ్‌ షుగర్‌ను తగ్గిస్తుంది. మలబద్దకం సమస్య వుండదు. ఎముకలను గట్టిపరుస్తుంది. గుండె సంబంధ వ్యాధులను సైతం నయం చేస్తుంది. రైతులకు పంటలలో మెలకువలు నేర్పించడంతో పాటు రైతులకు కావాల్సిన డ్రాగన్‌ ప్రూట్‌ మొక్కలను అందించేందుకు నర్సరీని ఏర్పాటు చేస్తున్నాను. ఇటీవల వియత్నాంలో జరిగిన అంతర్జాతీయ డ్రాగన్‌ ఫ్రూట్‌ నెట్‌వర్క్‌ కౌన్సిల్‌ సమావేశంలో నాకు సభ్యత్వం కూడా ఇచ్చారు అని డా. శ్రీనివరావు ఆనందంగా చెప్పారు.