DailyDose

ఆంగ్ల మాధ్యమ బోధనపై వెనక్కు తగ్గిన జగన్ సర్కారు-తాజావార్తలు-11/09

Telugu Breaking News Today - Jagan Administration To Make 1to6 Classes English Medium-11/09

* పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమ బోధనపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిమేర వెనక్కి తగ్గింది. తొలిదశలో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు మాత్రమే ఆంగ్ల మాధ్యమాన్ని వర్తింప జేయాలంటూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. .

* అయోధ్య అంశంపై సుప్రీంకోర్టు మహోన్నత తీర్పు వెలువరించిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. చరిత్రలో ఇవాళ కొత్త అధ్యాయం మొదలైందని చెప్పారు. అయోధ్య అంశంపై సర్వోన్నత న్యాయస్థానం తుది తీర్పు వెలువరించిన నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పును దేశమంతా స్వాగతించిందన్నారు. ‘‘దీర్ఘకాలిక సమస్యపై సుప్రీం కోర్టు మహోన్నత తీర్పు వెలువరించింది. ఇది కలిసికట్టుగా నడవాలని ఇస్తున్న సందేశం. ఐకమత్యంగా కలిసి ఉండే సమయం’’ అని మోదీ అన్నారు.

* ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నిర్వహించిన ‘సకల జనుల సామూహిక దీక్ష’లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత కార్మికులతో పాటు వారి కుటుంబసభ్యులు ఒక్కసారిగా ట్యాంక్‌బండ్‌ వైపు దూసుకొచ్చారు. దీంతో పలుచోట్ల పోలీసులు ఆందోళనకారులపై లాఠీఛార్జ్‌ చేయడంతో పాటు భాష్పవాయువును ప్రయోగించారు. కొన్ని చోట్ల ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో రోడ్డుకు అడ్డంగా ఉన్న బారికేడ్లు తగలడంతో కొంతమంది నిరసనకారులు గాయపడ్డారు.

* మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ భాజపాను ఆహ్వానించారు. సోమవారం నాడు తమ మెజారిటీని నిరూపించుకోవాలని సూచించారు. అత్యధిక సీట్లు గెల్చిన పార్టీగా అవతరించడంతో గవర్నర్‌కు భాజపాకు అవకాశమిచ్చారు. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ 145 మాత్రం భాజపాకు లేదు. గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా సొంతగా 105 సీట్లు గెల్చుకున్న సంగతి తెలిసిందే.

* దేశంలో ఉల్లి ధరలు ఆకాశాన్నంటిన తరుణంలో ఉపశమనం కలిగించే దిశగా కేంద్రం ముందడుగు వేసింది. సుమారు లక్ష టన్నుల ఉల్లిపాయలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. దిల్లీలో శనివారం నిర్వహించిన కార్యదర్శుల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి రామ్‌ విలాస్‌ పాసవాన్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

* ఆర్టీసీ సమ్మె, హైకోర్టు విచారణ తదితర అంశాలపై సీఎం కేసీఆర్‌ నిర్వహించిన సమీక్ష ముగిసింది. ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఈ సమీక్షకు మంత్రి పువ్వాడ అజయ్‌తో పాటు రవాణా, ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. శుక్ర, శనివారాల్లో హైకోర్టులో జరిగిన విచారణ అంశాలతో పాటు ప్రభుత్వం తరఫున సోమవారం ఇవ్వాల్సిన వివరణపైనా సీఎం చర్చించారు.

* కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్పీజీ) భద్రతా దళానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆ సంస్థ చీఫ్‌ అయిన అరుణ్‌ సిన్హాకు లేఖ రాశారు. అంకిత భావం, విచక్షణతో సుదీర్ఘ కాలం పాటు తమ కుటుంబ భద్రత కోసం సేవలందించినందుకు ప్రశంసించారు. ‘‘ఎస్పీజీని కేటాయించినప్పటి నుంచి మా కుటుంబం మొత్తం సురక్షితంగా ఉంది. వారి పర్యవేక్షణలో మాకు పూర్తి భద్రత భావం కలిగింది’’ అని సోనియా లేఖలో పేర్కొన్నారు.

* శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌ను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించడం.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. విజయనగరంలో నిర్వహించిన నరెడ్కో ప్రాపర్టీ షో-2019ను ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో వెల్లంపల్లి మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సీఎం జగన్‌ పాలన సాగిస్తున్నారన్నారు. జగన్‌ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు.

* అయోధ్యపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒకరి విజయం.. మరొకరి పరాజయంగా చూడకూడదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సుప్రీం తీర్పుపై ట్విటర్‌లో ఆయన స్పందించారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది భారతీయుల విజయమని ఆయన అభిప్రాయపడ్డారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పును ప్రజలంతా గౌరవించిన తీరే ఇందుకు నిదర్శమన్నారు. ఇది ఒక సామరస్య పూర్వక పరిష్కారమని..శతాబ్ధాల నుంచి అపరిష్కృతంగా ఉన్న వివాదానికి ఒక ముగింపు లభించిందని చెప్పారు.

* పశ్చిమబెంగాల్‌పై బుల్‌బుల్‌ తుపాను తీవ్రప్రభావం చూపుతోంది. ఈ తుపానుతో ఒడిశాను వర్షాలు ముంచెత్తుతున్న నేపథ్యంలో బెంగాల్‌లోనూ పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర హోంశాఖ కోల్‌కతాలో విమానాల రాకపోకల్ని నిలిపివేసింది. ఈ రోజు సాయంత్రం 6గంటల నుంచి ఆదివారం ఉదయం 6గంటల వరకు విమానాల రాకపోకలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

* ప్రముఖ మొబైల్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్‌ ఇటీవలే విడుదల చేసిన తన గెలాక్సీ ఆ50స్, ఆ30స్ ధరలను తగ్గించింది. ఆ50, ఆ30కి కొనసాగింపుగా తీసుకొచ్చిన ఈ రెండు ఫోన్ల ధరలను రూ.3వేల వరకు తగ్గించింది. తగ్గింపు ధరలతో అటు ఆన్‌లైన్‌తో పాటు ఇటు ఆఫ్‌లైన్‌లోనూ ఈ ఫోన్లు లభించనున్నాయి. ఆ30స్పై వెయ్యి రూపాయలు తగ్గించగా.. ఆ50స్ పై రూ.3వేలు కంపెనీ తగ్గించింది.

* అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీమసీదు భూవివాద స్థలంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ తీర్పు ఏ ఒక్కరికీ విజయంగానీ.. ఓటమిగానీ కాదని పునరుద్ఘాటించారు. ‘‘అయోధ్యపై సర్వోన్నత న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించింది. ఈ తీర్పుని ఏ ఒక్కరికీ విజయంగాగానీ, ఓటమిగాగానీ భావించరాదు. రామభక్తి అయినా.. రహీమ్‌భక్తి అయినా ఇకపై భారతభక్తిని బలోపేతం చేయాల్సిన సమయం ఇది’’ అని మోదీ అన్నారు. .

* ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన సకలజనుల సామూహిక దీక్ష ఉద్రిక్తంగా మారింది. ట్యాంక్‌బండ్‌ వద్దకు చేరుకునేందుకు యత్నించిన ఆర్టీసీ కార్మికులు, కుటుంబ సభ్యులు, ఓయూ విద్యార్థులు, ప్రజా సంఘాలు, విపక్ష నేతలను నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దీంతో పదుల సంఖ్యలో ఆందోళనకారులు గాయపడ్డారు. పోలీసులకు, కార్మికులకు మధ్య జరిగిన తోపులాటలో ఓ ఆర్టీసీ కార్మికుడు అస్వస్థతకు గురికావడంతో పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు. .

* అయోధ్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ వేయకూడదని సున్నీ వక్ఫ్ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎంతోకాలంగా వివాదాస్పదంగా ఉన్న అయోధ్య సమస్యపై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. వివాదస్పదమైన భూమి హిందూవులకే చెందుతుందని పేర్కొంది. అలాగే అయోధ్యలో ఐదు ఎకరాల స్థలాన్ని వక్ఫ్‌ బోర్డుకు ఇవ్వాలని సూచించింది. అయితే దీనిపై రివ్యూ పిటిషన్‌ వేయాలని మొదట్లో భావించినా బోర్డు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

* అయోధ్యలోని వివాదాస్పద భూమిపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన వేళ సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ దేశంలోని అన్ని వార్తా ఛానెళ్లు, కేబుల్‌ టీవీ ఆపరేటర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. రిపోర్టర్లు అయోధ్యకు సంబంధించిన వార్తను రిపోర్టు చేసేటప్పుడు లేదా లైవ్‌ డిబేట్లు నడిపేటప్పుడు సంయమనం పాటించాలని ఆదేశించింది. ఈ సమయంలో వర్గ భేదాలు తలెత్తకుండా, ప్రోగ్రాం కోడ్‌ తప్పనిసరిగా అనుసరించాలని నిర్దేశించింది. .

* తెలంగాణ ఆర్టీసీ ఐకాస, విపక్షాలు ట్యాంక్‌బండ్‌పై సకల జనుల సామూహిక దీక్షకు పిలుపు నిచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు పటిష్ఠ చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలను అరెస్టు చేసిన పోలీసులు తాజాగా.. ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డిని నిర్బంధంలోకి తీసుకున్నారు. హిమయత్‌ నగర్‌లోని లిబర్టీ వద్ద ఆయన్ను అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. .

* ప్రధాని నరేంద్ర మోదీ కర్తార్‌పూర్‌ నడవాను ప్రారంభించారు. దీంతో శనివారం 500 మంది భారత యాత్రికులతో కూడిన మొదటి బ్యాచ్‌ కర్తార్‌పూర్‌ వెళ్లింది. గురునానక్‌ 550వ జయంతిని పురస్కరించుకుని కర్తార్‌పూర్‌ నడవాను ఈరోజు ప్రారంభించారు.‘కర్తార్‌పూర్‌ నడవాను, ఇంటిగ్రేటెడ్‌ చెక్‌ పోస్టును నా చేతులతో ప్రారంభించినందుకు నా ఆనందం రెట్టింపైంది. నడవాను సమయానికి పూర్తి చేసినందుకు అందరికీ అభినందనలు. ఇందుకు సహకరించినందుకు పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు కూడా ధన్యవాదాలు’ అని మోదీ చెప్పారు. .

* శతాబ్దం క్రితంనాటి అయోధ్య కేసు పరిష్కారం కావడంపై రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ అధినేత మోహన్‌ భగవత్‌ ఆనందం వ్యక్తం చేశారు. రామ జన్మభూమి-బాబ్రీ మసీద్‌ వివాదంపై సుప్రీం కోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన విస్పష్ట తీర్పును ఆయన స్వాగతించారు. ఈ వివాదం ముగిసిపోవాలని తాము కోరుకున్నామని తెలిపారు. ఇప్పుడది జరిగిందని పేర్కొన్నారు. ఇప్పుడిక ఈ వివాదం గురించి మర్చిపోయి అందరూ కలిసి రామ మందిరం నిర్మాణంలో పాలుపంచుకోవాలని భగవత్‌ పిలుపునిచ్చారు. .

* అయోధ్యపై సుప్రీం కోర్టు తీర్పుని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వాగతించారు. ‘‘రామజన్మభూమి వివాదాస్పద స్థలంపై సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పుని స్వాగతిస్తున్నాం. అన్ని వర్గాల ప్రజలు కోర్టు తీర్పుని అంగీకరించాలి. ‘ఏక్‌ భారత్‌-శ్రేష్ఠ భారత్‌’కి ప్రతిఒక్కరూ కట్టుబడి ఉండాలి’’ అని అమిత్ షా ట్విటర్‌ వేదికగా పిలుపునిచ్చారు. .

* ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో తేదీలు ఖరారు కానున్నాయి. డిసెంబర్‌ మొదటివారంలో సమావేశాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాల్లో కీలకమైన ఇసుక విధానంతో పాటు మరికొన్ని ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టనుంది. జూన్‌లో ప్రభుత్వం వర్షాకాల సమావేశాలను నిర్వహించింది. .