WorldWonders

గుజరాత్ నుండి తమిళనాడు 2346కిమీ హీరోహోండాపై…

Tamilnadu Man Stopped By Police For Coming From Gujarat

ఓ కుమారుడు తన తల్లి కోసం 2,346 కిలోమీటర్ల మేర బైక్‌ ప్రయాణం చేశాడు. కానీ తల్లి వద్దకు వెళ్లేందుకు తమిళనాడు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. గుజరాత్‌ నుంచి తమిళనాడు వరకు మండుటెండలో తల్లి కోసం ప్రయాణించినప్పటికీ.. నిరాశే ఎదురైంది. తమిళనాడులోని శిర్కాజీకి చెందిన చంద్రమోహన్‌(43).. అహ్మదాబాద్‌లో సివిల్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా పనులు నిలిచిపోవడంతో.. అక్కడ ఒంటరిగా ఉంటున్నాడు. ఉదయం, రాత్రి ఎన్జీవోలు ఇచ్చే ఆహారంతో సరిపెట్టుకుంటున్నాడు. చంద్రమోహన్‌ తల్లి, భార్యాపిల్లలు మాత్రం తమిళనాడులో ఉంటున్నారు. గ్లకోమా కారణంగా తల్లి కంటి చూపు కోల్పోయింది. ఈ మధ్యే ఆమె అనారోగ్యానికి గురైంది. దీంతో తల్లిని చూడాలని చంద్రమోహన్‌ అహ్మదాబాద్‌ నుంచి తమిళనాడుకు తన హీరో హోండా బైక్‌పై బయల్దేరాడు. ఈ ప్రయాణానికి అహ్మదాబాద్‌ అధికారుల నుంచి అనుమతి పత్రం పొందాడు చంద్రమోహన్‌.

ఏప్రిల్‌ 22న ప్రారంభమైన చంద్రమోహన్‌ ప్రయాణం.. మహారాష్ట్ర, కర్ణాటక మీదుగా సాగింది. ఈ జర్నీలో ప్రతి గంటకు ఐదు నిమిషాల పాటు విశ్రాంతి తీసుకుని మళ్లీ ప్రయాణాన్ని ప్రారంభించాడు చంద్రమోహన్‌. రోజుకు పదిహేను గంటల పాటు బైక్‌ను నడిపాడు. 42 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ హెల్మెట్‌, సన్‌ గ్లాసెస్‌, షూ ధరించడం వల్ల పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. అలసట వచ్చినప్పుడు, రాత్రి సమయాల్లో పెట్రోల్‌ బంకుల్లో విశ్రాంతి తీసుకున్నాడు. ఇక అహ్మదాబాద్‌లో బయల్దేరే ముందే తన బ్యాగు నిండా బిస్కెట్‌ ప్యాకెట్లు, సరిపడ వాటర్‌ బాటిల్స్‌ సమకూర్చున్నాడు. మొత్తానికి ఏప్రిల్‌ 25న రాత్రి 8:30 గంటలకు వాట్రాప్‌ గ్రామంలోని తన భార్య నివాసానికి చంద్రమోహన్‌ చేరుకున్నాడు. తన భార్య, ఇద్దరు పిల్లలను చూసేసరికి చంద్రమోహన్‌ సంతోషపడ్డాడు. అలసట మాయమైపోయింది. తండ్రిని చూసిన పిల్లలు ఆనందభాష్పాలు రాల్చారు. ఇక తన భార్యాపిల్లలను తీసుకొని తల్లి నివాసముంటున్న శిర్కాజీ గ్రామానికి వెళ్లేందుకు చంద్రమోహన్‌ బయల్దేరాడు. చంద్రమోహన్‌ గుజరాత్‌ నుంచి వచ్చాడని తెలుసుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు ఆయనను అడ్డుకున్నారు. శిర్కాజీ వెళ్లేందుకు పోలీసులు ఆయనకు అనుమతి ఇవ్వలేదు. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాతే శిర్కాజీకి వెళ్లాలని పోలీసులు చంద్రమోహన్‌కు సూచించారు. దీంతో చంద్రమోహన్‌ తీవ్ర నిరాశకు గురయ్యాడు.