Politics

6గంటల్లో అయిపోనున్న తెదేపా మహానాడు

TDP Mahanadu 2020 To End In 6Hours

‘మహానాడు’ను ఈసారి ఆన్‌లైన్‌లో నిర్వహించాలని నిర్ణయించిన తెలుగుదేశం పార్టీ.. మొత్తం కార్యక్రమాన్ని ఆరు గంటల్లో పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ జయంతి కలసి వచ్చేలా ఏటా మూడు రోజులపాటు మహానాడు ఒక వేడుకలా నిర్వహించడం ఆనవాయితీ. గతేడాది ఎన్నికల వల్ల జరగలేదు. ఈసారి లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో.. జూమ్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో మహానాడు నిర్వహించాలని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ఈ నెల 27, 28 తేదీల్లో ఇది ఉంటుంది. మొదటిరోజు మూడు గంటలు, రెండోరోజు మూడు గంటలు కార్యక్రమాలుండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. 27న ఉదయం గంటన్నర, సాయంత్రం గంటన్నర కార్యక్రమం ఉంటుంది. ఉదయం అధ్యక్షుడు, ముఖ్యనేతల ప్రసంగాల అనంతరం తీర్మానాలు ప్రవేశపెడతారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా 28న ఆయనకు నివాళులర్పించి, కార్యక్రమం కొనసాగిస్తారు. తుది షెడ్యూలును గురువారం ఖరారు చేయనున్నారు. మహానాడులో సుమారు 14 వేల మంది పాల్గొంటారని పార్టీ వర్గాల అంచనా. తెలంగాణ నుంచి 1,500 మంది ఉంటారు. తెదేపా ఎన్‌ఆర్‌ఐ విభాగం ప్రతినిధులూ ఇతర దేశాల నుంచి పాల్గొంటారు.