DailyDose

నేను ఏది చేసినా రైతుల కోసమే-తాజావార్తలు

PM Modi Speaks On Agriculture Reforms And His Administration

* వ్యవసాయ రంగంలో కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి స్పష్టంచేశారు. ముఖ్యంగా, 86శాతం ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రైతుల, కార్మికుల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వాలు, వారి వాగ్దానాలను గాలికి వదిలేశాయని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి రైతులకు, కులీలకు అబద్దాలు చెబుతూనే ఉన్నారని.. తాజా సంస్కరణలపై ఇప్పుడు కూడా రైతులను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పంటలకు కనీస మద్దతు ధర పెంచడంలో రికార్డు సృష్టించామని అన్నారు. భాజపా నాయకులతో జరిగిన వర్చువల్‌ సమావేశంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

* ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల తెలంగాణ శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తాసుఖేందర్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు సంతాపం తెలిపారు. ఎస్పీబీ మృతి విచారకరమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆలపించిన వేల పాటల ద్వారా ప్రజల మనసుల్లో ఆయన సుస్థిరంగా నిలిచారని కొనియాడారు. బాలు మృతి సినీ ప్రపంచానికి, సంగీత అభిమానులకు తీరని లోటని చెప్పారు.

* రాష్ట్రంలోని జలవనరుల ప్రాజెక్టులకు సంబంధించి తమదారి అడ్డదారి అన్నట్టు వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శించారు. పోలవరంలో ఎలాంటి అవినీతి లేదని కేంద్ర జలవనరుల శాఖ న్యాయస్థానానికి ఇచ్చిన నివేదికలే తమ పారదర్శకతకు నిదర్శనమన్నారు. శుక్రవారం దేవినేని మీడియాతో మాట్లాడుతూ.. 70శాతం పైగా పోలవరం ప్రాజెక్టు పనులను తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేసిందని చెప్పారు. గత 16 నెలల్లో వైకాపా ప్రభుత్వం ఎంత మేర పనులు చేపట్టిందో సీఎం జగన్‌ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టుపై దిల్లీ పెద్దలను కలిశామని చెప్పిన సీఎం, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ దానిపై స్పష్టమైన ప్రకటన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పోలవరం అంచనా వ్యయం రూ.47వేల కోట్లపైచిలుకు అంటూ సొంత మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఉమా ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 16నెలలు గడుస్తున్నా తమ అసమర్థత, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఇంకా తెదేపాపై నిందలు వేస్తున్నారని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగిల్‌ టెండర్‌ కోసం రివర్స్‌ టెండర్‌ డ్రామా ఆడి ప్రజల జీవితాలతో ఆటలాడుతున్నారని దేవినేని ధ్వజమెత్తారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. దాదాపు రూ.40 వేల కోట్లను సొంత వారికి కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగా జలవనరుల నియమనిబంధనల్ని పక్కనపెట్టి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని దేవినేని ఆరోపించారు.

* ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న సమస్యలు, రాజధాని అమరావతి అంశంపై పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రస్తావించినట్లు తెదేపా లోక్‌సభాపక్ష నేత గల్లా జయదేవ్‌ తెలిపారు. రాష్ట్రానికి మూడు రాజధానులు చట్ట ప్రకారం సాధ్యం కాదన్నారు. ఈ విషయాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తినట్లు చెప్పారు. పార్లమెంట్‌ సమావేశాలు ముగిసిన సందర్భంగా తెదేపా ఎంపీలు దిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గల్లా జయదేవ్‌ మాట్లాడారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లాను కలిసి అమరావతి విషయాన్ని ప్రస్తావించగా.. ఆయన తమ అభిప్రాయాలతో ఏకీభవించినట్లు తెలిపారు. కరోనా వైరస్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న సమయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుని పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు బాగా నిర్వహించారన్నారు. సభ్యులకు కరోనా సోకుతున్న నేపథ్యంలో పది రోజులకే సమావేశాలకు ముగింపు పలకాల్సివచ్చింది. జీఎస్టీ, పోలవరం నిధులు సహా రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై సభలో ప్రస్తావించినట్లు గల్లా జయదేవ్‌ వివరించారు. ఇంగ్లీష్‌ మీడియం విద్యపై నిర్మాణాత్మక సూచనలు చేశామన్నారు. ఏపీలో దేవాలయాలు, దళితులపై దాడుల గురించి సభలో మాట్లాడామన్నారు. 23 బిల్లులపై తాము చర్చలో పాల్గొని అభిప్రాయాలను చెప్పామన్నారు. ఆర్థిక వ్యవహారాల్లో కీలక సలహాలు ఇచ్చామని.. ఉద్యోగాలు దెబ్బతినకుండా ఉండేందుకు పలు సూచనలు చేసినట్లు జయదేవ్‌ తెలిపారు.

* గాన గంధర్వుడు, ప్రఖ్యాత సినీ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరణం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుంబంధాన్ని గుర్తు చేసుకుంటూ ట్విటర్‌లో భావోద్వేగ సందేశాన్ని ఉంచారు. బాలు ఆస్పత్రిలో ఉన్న రోజుల్లో ఆయన ఆరోగ్యంపై వాకబు చేసిన విషయాన్ని వెల్లడిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కోలుకుంటున్నారని తెలిసి సంతోషిస్తున్న తరుణంలోనే ఇలా జరగడం తీవ్ర బాధను కలిగించిందన్నారు. ఒకే ఊరివాడైనందున చిన్నప్పటి నుంచి ఉన్న పరిచయాన్ని ప్రస్తావిస్తూ.. ఆయన చేసిన కృషిని గుర్తుచేశారు.

* ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి పట్ల రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వేల పాటలు పాడిన మధుర గాయకుడి మరణం మాటలకందని మహా విషాదమని అన్నారు. ప్రపంచ సంగీతానికే బాలు స్వరం ఓ వరమని అభివర్ణించారు.‘బాలు ఇక లేరంటేనే బాధగా దిగులుగా ఉంది. మనసు మెలిపెట్టినట్టు ఉంది. ఆయన గంధర్వ గాయకుడే కాదు.. నాకు అత్యంత ఆత్మీయుడు. గుండెలకు హత్తుకుని ప్రేమగా పలకరించే తమ్ముడు. తెలుగు జాతికేకాదు ప్రపంచ సంగీతానికే ఆయన స్వరం ఓ వరం’ అని చెప్పారు.

* గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి భారత చిత్ర పరిశ్రమకు తీరని లోటని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఇకలేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని సోషల్‌మీడియాలో పోస్ట్‌లు చేశారు. కె. రాఘవేంద్రరావు, ఎ.ఆర్‌. రెహమాన్‌, అక్షయ్‌ కుమార్‌, మహేశ్‌బాబు, ఎన్టీఆర్‌, రవితేజ, నాని, తమన్‌, మంచు లక్ష్మి, దుల్కర్‌ సల్మాన్‌ తదితరులు సంతాపం తెలిసిన వారిలో ఉన్నారు.

* హేమంత్‌ కుమార్‌ హత్య కేసుకు సంబంధించి సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అవంతి మేనమామ యుగంధర్‌ రెడ్డి, హేమంత్‌ హత్య కోసం పది లక్షల రూపాయల సుఫారీతో ఇద్దరు వ్యక్తులను రంగంలోకి దించినట్లు పోలీసుల విచారణలో తేలింది. యుగంధర్‌ రెడ్డి చందానగర్‌కు చెందిన ఆ ఇద్దరు కిరాయి హంతకులతో కలిసి హేమంత్‌ హత్యకు ప్లాన్‌ రచించాడు. మధ్యాహ్నం 3:30 గంటలకు గచ్చిబౌలి ఎన్జీవో కాలనీలో హేమంత్‌ను బలవంతంగా కిడ్నాప్ చేసి కారులో వేసుకెళ్లిపోయాడు. గోపన్ పల్లికి వెళ్లాక, ఆ కారులో నుంచి దింపి మరో కారులో ఎక్కించారు నిందితులు. తాడుతో చేతులు, కాళ్లు కట్టి కారు వెనక సీట్లో పడేసి చిత్రహింసలు పెట్టారు.

* సంగీత దిగ్గజం ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతిపట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. శుక్రవారం ట్విటర్‌ వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ‘‘ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరన్నవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. 16 భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాన’’ని పేర్కొన్నారు.

* సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని భారత్‌, చైనాకు స్పష్టం చేసింది. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) కవ్వింపులకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. వాస్తవాధీన రేఖను దాటి భారత స్థావరాల వైపు చొచ్చుకువచ్చే ప్రయత్నం చేస్తే గట్టిగా సమాధానం ఇస్తామని పేర్కొంది. ఒప్పందాలు అతిక్రమించి ముందుకు వచ్చినట్లయితే ఆత్మరక్షణకై కాల్పులకు దిగేందుకు తమ సైనికులు వెనుకాడబోరని హెచ్చరికలు జారీ చేసిందని ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. గల్వాన్‌ లోయలో ఘర్షణలు చోటుచేసుకున్న నాటి నుంచి భారత్‌- చైనా సరిహద్దుల్లో ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు దఫాల చర్చల అనంతరం బలగాల ఉపసంహరణకు అంగీకారం కుదిరింది. అయితే డ్రాగన్‌ ఆర్మీ మాత్రం కొన్ని ప్రదేశాల్లో దుందుడుగానే వ్యవహరిస్తోంది.

* తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌)పై కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి వేసిన షిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనధికారిక లే అవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు ఇటీవల ప్రభుత్వం ఈ ఎల్‌ఆర్‌ఎస్‌ విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం తీసుకున్న ఎల్‌ఆర్‌ఎస్‌ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోమటి రెడ్డి అత్యున్నత హైకోర్టును ఆశ్రయించారు. కాగా ఎంపీ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారించగా..ఈ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.