ఘన చరిత్ర కలిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని అధ్యాపకుల కొరత వేధిస్తోంది. యూనివర్సిటీ పరిధిలో 12 వందల 60 మంది అధ్యాపకులు ఉండాలి..కానీ ఇక్కడ ఉంది 4వందల 70 రెగ్యులర్ అధ్యాపకులు మాత్రమే ఉన్నారు.అంతే కాకుండా డిమాండ్ ఉన్న సబ్జెక్టుల పరిస్ధితి కూడ అంతే.దీంతో ఆయా విభాగాల్లో విద్యార్దులు అడ్మిషన్లు తీసుకోవడం లేదు.దీంతో ఆ కోర్సులు రద్దయ్యో ప్రమాదం ఉంది.ఇప్పటికే కొన్ని కోర్సులు రద్దు కావడం జరిగింది.అధ్యాపకులను భర్తీ చేయకపోతే 2020 కల్లా అన్ని కోర్సులు రద్దయ్యే ప్రమాదమూ లేకపోలేదు.యూనివర్సిటీ కాలేజీల్లో అతిపెద్దదైన ఆర్ట్స్ కళాశాలలో ఆర్ట్స్, సోషల్ సైన్స్ విభాగాలలో 26 ఎంఏ కోర్సులు ఉన్నాయి. ఇంగ్లిష్, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ కోర్సులు మినహా ఇతర 23 కోర్సులలో అధ్యాపకుల కొరత ఏర్పడింది. నిబంధనల ప్రకారం ప్రతి విభాగంలో 6 నుండి 8 మంది అధ్యాపకులు ఉండాలి. అందులో ముగ్గురు ప్రొఫెసర్లు తప్పనిసరి. కానీ మూడు విభాగాలు మినహా మిగతావాటిలో అవసరమైన సంఖ్యలో అధ్యాపకులు లేరు. దీంతో విద్యార్థులు ఆయా కోర్సులలో చేరడం లేదు.అంతే కాకుండా విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతోంది. సంస్కృతం, పర్షియన్, మరాఠి, కన్నడ, ఉర్దూ, పురావస్తు శాఖలలో కేవలం ఒకే అధ్యాపకుడు ఉన్నారు. తమిళ్, జర్మన్, ఫ్రెంచ్, రష్యన్ విభాగాల్లో అధ్యాపకులు లేకపోవడంతో పీజీ కోర్సులను రద్దు చేశారు. చరిత్ర, తెలుగు, హిందీ, అరబిక్, సైకాలజీ, ఫిలాసఫీ, లైబ్రరీ సైన్స్ తదితర విభాగాల్లో ఒకరి నుంచి ముగ్గురు మాత్రమే అధ్యాపకులు పని చేస్తున్నారు.ఆర్ట్స్ కాలేజీలో అనేక విభాగాల తరగతి గదులు, కార్యాలయాలు, అధ్యాపకుల గదులు, సెమినార్ లైబ్రరీలు, ఇతర మౌలిక వసతులు వృథాగా ఉంటున్నాయి. ఇంగ్లిష్, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, చరిత్ర, జర్నలిజం, సైకాలజీ విభాగాలు మినహా ఇతర 20 విభాగాల తరగతి గదులు, ఇతర గదులు ఎవరూ లేక బోసిపోతున్నాయి. ఆర్ట్స్ కాలేజీలోని కోట్లాది రూపాయల విలువైన మౌలిక వసతులను ఇతర అవసరాలకు కూడా ఉపయోగించడం లేదు. ఓయూలో అధ్యాపకుల కొరత కారణంగా పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రతి ఏటా విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. సంస్కృతం, పర్షియన్, మరాఠి, కన్నడ, ఉర్దూ, పురావస్తు శాఖ, ఇస్లామిక్ స్టడీస్, లింగ్విస్టిక్స్ తదితర కోర్సుల్లో విద్యార్థులు చేరడం లేదు. గతంలో ఇతర భాషా కోర్సులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విద్యార్థుల ఆర్థిక సహాయం లభించేది. ఇప్పుడా అవకాశం లేకపోవడంతో ఇతర రాష్ట్రాల భాషా కోర్సుల్లో ఎవరూ చేరడం లేదు.
ఓయూలో అధ్యాపకుల కొరత
Related tags :