Editorials

కాషాయ కలలు నెరవేరేవేనా?

కాషాయ కలలు నెరవేరేవేనా?

దక్షిణాదిపై కమలదళం గురిపెడుతోంది. స్థానిక రాజకీయాలు ఎలా దెబ్బతినిపోయినా.. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం మాత్రమే వారికి ప్రతిసారీ టార్గెట్ గా ఉంటుంది. అందుకే.. తమకు బలం లేని చోట.. ఎలాంటి నైతికత లేని పొత్తులకు, అప్రకటిత స్నేహాలకు కూడా ఆ పార్టీ తెగబడుతూ ఉంటుంది. పార్లమెంటు సీట్ల మీద దృష్టితో ఇప్పుడు దక్షిణాది మీద ఫోకస్ పెంచుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని హైదరాబాదులో నిర్వహించడం ఇలా అనిపించడానికి ఒక కారణం కావొచ్చు. కానీ రాష్ట్రాల వారీగా చూస్తే వారి కలలు నెరవేరేది నిజమేనా అనిపిస్తుంది. కర్ణాటక తప్ప మరెక్కడా అస్తిత్వం లేని ఆ పార్టీ దక్షిణాది వ్యూహాలు ఎలా ఫలిస్తాయా అనిపిస్తుంది. విడివిడిగా చూస్తే..తెలంగాణ.. వారికి ఆశలు రేపుతున్న రాష్ట్రం. దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ తర్వాత.. ముస్లిం జనాభా శాతం అత్యధికంగా ఉండే రాష్ట్రం తెలంగాణ. అదొక్కటే కాదు.. ఒకప్పటి నిజాం దుర్మార్గ పాలన, ఇంకా అనేక ఇతర కారణాల వలన హిందూ-ముస్లిం విద్వేషాగ్నిని ఇక్కడ రెచ్చగొట్టడం చాలా తేలిక. ఆ జ్వాలల్లో ఓటుబ్యాంకును పోలరైజ్ చేయడం చాలా తేలిక. ఆ కారణాల వల్ల తెలంగాణలో అధికారం కోసం ఆ పార్టీ ఆశలు పెట్టుకుంటోంది.

దక్షిణాదిలో ఇతర ప్రాంతాల్లో వారికి కాలు పెట్టడం ఎలా సాధ్యమవుతుంది? ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. ఆ రాష్ట్రానికి బిజెపి చేసిన ద్రోహాన్ని అక్కడి ప్రజలు ఎన్ని శతాబ్దాల వరకైనా మరచిపోరు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసినప్పుడు.. ప్రత్యేకహోదా విషయంలో అయిదు కాదు పదేళ్లు ఉండాలని నినదించిన బిజెపి ప్రజలకు గుర్తుంది. తిరుపతి సభలో ప్రత్యేకహోదాను పదేళ్లు ఇస్తాం అని ప్రకటించిన మోడీ ప్రజలకు గుర్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కేంద్రంలో అధికారంలోకి వచ్చాక.. చేసిన ద్రోహం కూడా గుర్తుంది. హోదా కాదు ప్యాకేజీ అని మాయమాటలు చెప్పి, సాకులు చెప్పి, రాష్ట్రాన్ని ఎటూ కాకుండా అనాధలా వదిలేసిన వైనం ప్రజలకు గుర్తుంది. ఆ రాష్ట్రంలో వారు తలకిందులుగా తపస్సు చేసినా అధికారంలోకి రావడం కల్ల.

తమిళనాడులో.. ఏ జన్మకైనా బిజెపి అస్తిత్వాన్ని కనీసంగా పొందగలిగితే అదే వారికి ధన్యత. అసలే హిందీ భాషను వ్యతిరేకిస్తూ.. సదా జాతీయ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉండే తమిళులు.. హిందీని బలవంతంగా దేశం మీద పులమాలని చూసే పార్టీని సహిస్తారా? ద్రవిడులం మేం వేరు, మీరు వేరు అని నిరసించే తమిళులు బిజెపిని ఆదరిస్తారా? ప్రతి దశలోనూ దక్షిణాది పట్ల వివక్ష చూపుతూ ఉండే ఉత్తరాది పాలకుల వ్యవహారాలను ఎండగడుతూ దక్షిణాది ప్రత్యేక దేశంగా కావాలనే భావనను కూడా కలిగి ఉండే తమిళులు బిజెపిని ఆదరిస్తారా? అలాంటి కలలు బిజెపికి కూడా లేవు.

కేరళ కూడా సరేసరి! భిన్నమతాల సమాహారం అయినా కూడా కేరళ చాలావరకు ప్రశాంతంగా ఉండడం.. బిజెపి ఆశలకు తిలోదకాలిచ్చే వ్యవహారం. మతాల మధ్య ద్వేషాలు ఉన్నప్పుడే వారికి మనుగడ. వారు ఆశించేంత విద్వేషాలు కేరళలో ఉండవు. అక్కడ వామపక్ష భావజాలానికి మన్నన నిలకడగానే ఉంది. ఇక వారు అక్కడ అడుగు మోపలేరు.

ఇలాంటి నేపథ్యంలో.. బిజెపి దక్షిణాది మీద కన్నేసిందనే ప్రచారం ఎంత నిజం? దక్షిణాది బిజెపికి ఎప్పటికీ చేజిక్కదు. వారికి చేతకాని వ్యవహారం! బిజెపి తమ అనుకూలురతో దక్షిణాది మీద కన్నేసినట్టుగా ప్రచారం చేసుకోవాల్సిందే తప్ప.. వాస్తవంలో.. కన్నడసీమ మినహా వారు అడుగుపెట్టగలిగింది కేవలం మత విద్వేషాలకు ఆస్కారం ఇవ్వగల తెలంగాణలో మాత్రమే! -దాసరి కృష్ణ మోహన్ సీనియర్ జర్నలిస్ట్