Politics

భాజపాలో.. తెలుగుదేశంకు పెరుగుతున్న మద్దతు..

భాజపాలో.. తెలుగుదేశంకు పెరుగుతున్న మద్దతు..

ఏపీ బీజేపీలో మూడు వర్గాలు ఉంటాయి. ఒకటి ప్రో వైసీపీ .. రెండు ప్రో టీడీపీ, మూడోది నిఖార్సైన బీజేపీ. ఈ నిఖార్సైన బీజేపీ నేతలకు హైకమాండ్ ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వదు. అయితే ప్రో టీడీపీ లేకపోతే.. ప్రో వైసీపీ. ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉంది.. వైసీపీ కాబట్టి ఆ పార్టీ సానుభూతిపరులకు అందలం ఎక్కించారు. ఢిల్లీలో వైసీపీ సపోర్ట్ గా ఉంటుంది కాబట్టి.. ఏపీ వైపు చూడటం లేదు. అయితే ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. దీంతో ప్రో టీడీపీ నేతల వాయిస్ కూడా పెరుగుతోంది. పొత్తులపై చర్చలు జరుగుతున్నాయి. అధికారికంగా జనసేన, బీజేపీ పొత్తులో ఉన్నాయి. కానీ ఎన్నికల్లో కలసి పోటీ చేస్తాయా అన్నదానిపై క్లారిటీ లేదు. ఎందుకంటే ఎప్పుడూ వారు కలిసింది లేదు. అదే సమయంలో జనసేన టీడీపీకి దగ్గరవుతోంది. బీజేపీ ఎటూ కాకుండా పోతోంది. ఒంటరిగా పోటీ చేస్తే.. నామినేషన్ వేసే డిపాజిట్లు కూడా ఖర్చు దండగని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారు. ఆ విషయం గత ఎన్నికల్లో రుజువు అయింది. జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసినా ఏమీ ప్రయోజనం ఉండదని తేలిపోయింది. దీంతో బీజేపీలోని ఓ వర్గం.. టీడీపీతో పొత్తు కోసం ఢిల్లీలో లాబీయింగ్ చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీ తరపున ఎన్నికయ్యి బీజేపీలో చేరిన టీజీ వెంకటేష్ .. ఇదే చెబుతున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. మిత్రులు ఉండరని.. టీడీపీ కూడా దీనికి మినహాయింపు కాదంటున్నారు. టీడీపీతో పొత్తు ఉంటుందనే దిశలోనే ఆయన చెబుతున్నారు. ఆయన బహిరంగంగా చెబుతున్నారు. చాలా మంది బీజేపీలోని టీడీపీ సానుభూతిపరులు మాత్రం పొత్తు ఉంటుందంటున్నారు. టీజీ వెంకటేష్ పార్టీ మారారు కానీ.. ఆయన కుమారుడు మాత్రం టీడీపీలోనే ఉన్నారు. కర్నూలు నుంచి అసెంబ్లీకి పోటీ చేయడానికి టిక్కెట్ కూడా ఖరారు చేసుకున్నారు.