Politics

షర్మిల పాదయాత్రకు షరతులతో అనుమతి

షర్మిల పాదయాత్రకు షరతులతో అనుమతి

YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర పునఃప్రారంభానికి వరంగల్ పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ నెల 28 నుంచి పాదయాత్ర కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా…పిబ్రవరి 2 నుంచి పాదయాత్ర కొనసాగించేందుకు 15 షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. పోలీస్ శాఖ ఇచ్చిన అనుమతి మేరకు రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన పాదయాత్రను పిబ్రవరి 2 నుంచే కొనసాగించాలని అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిర్ణయించారు.పాదయాత్ర ఆగిన చోట అంటే..నర్సంపేట నియోజక వర్గం శంకరమ్మ తాండా నుంచే పాదయాత్ర మొదలు కానుంది.ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరకాల,భూపాలపల్లి,ములుగు,నర్సంపేట నియోజక వర్గాలలో పాదయాత్ర పూర్తి అవ్వగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మిగిలిన 8 నియోజక వర్గంలో పాదయాత్ర కొనసాగనుంది.వర్ధన్నపేట,వరంగల్ ఈస్ట్,వేస్ట్,స్టేషన్ ఘనపూర్, జనగాం,పాలకుర్తి,మహబూబాబాద్ మీదుగా పాలేరు నియోజక వర్గంలో మరోసారి అడుగు పెట్టేలా రూట్ మ్యాప్ సిద్ధం అవుతుంది.ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఇప్పటికే 3512కి.మీ పూర్తి కాగా.. 4 వేల కి.మీ పూర్తి చేసేందుకు 25 రోజుల పాటు పాదయాత్ర సాగనుంది.ముగింపు సభ పాలేరు నియోజక వర్గంలో భారీ ఎత్తున నిర్వహించేందుకు పార్టీ యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తుంది. అయితే ఎవరి పాదయాత్రకు లేని షరతులు తమ పాదయాత్రకు పెట్టడం పై వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి కేసీఅర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ మా పాదయాత్ర కేసీఅర్ పాలనకు అంతిమయాత్ర.అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే కేసీఅర్ కి భయం పట్టుకుంది.పాలన పై ప్రజా వ్యతిరేకత వ్యక్తం అవుతుంటే కేసీఅర్ కు చమటలు పడుతున్నాయి. ప్రశ్నించే గొంతును నొక్కాలని చూస్తున్నారు.అందుకే 15 కండీషన్లు పెట్టారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడమే మా కర్తవ్యం.’ అని వైఎస్ షర్మిల అన్నారు.