Dry Kiwi : మనం ఆహారంగా తీసుకునే వివిధ రకాల పండ్లల్లో కివి పండ్లు కూడా ఒకటి. ఇవి మనకు ప్రస్తుత కాలంలో ఎక్కడపడితే అక్కడ విరివిరిగా దొరుకుతున్నాయి. ఈ పండ్లు చాలా రుచిగా ఉంటాయి. కివి పండ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ కివి పండ్లను పూటకు రెండు చొప్పున రెండు పూటలా తినడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. కొవ్వు కణాల్లో కొవ్వును పేరుకుపోకుండా చేసి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో కివి పండ్లు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని థైవాన్ దేశ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో తేలింది.
కివి పండ్లల్లో విటమిన్ సి, విటమిన్ ఇ లు అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేస్తాయి. మనం ఆహారం అధికంగా తీసుకున్నప్పుడు అది కొవ్వుగా మారి కొవ్వు కణాల్లో చేరుతుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్లు కొవ్వు కణాల్లో మార్పును తీసుకు వచ్చి కణాల్లో కొవ్వు పేరుకుపోకుండా చేయడంలో సహాయపడతాయి. దీంతో రక్తంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి, చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్ స్థాయిలు తగ్గుతున్నాయి. వీటిని రోజుకు నాలుగు చొప్పున 7 నుండి 8 వారాల పాటు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.