NRI-NRT

NRIVA వితరణ. భద్రాచలం ఆలయానికి 12 సువర్ణ వాహనాలు బహుకరణ.

NRIVA వితరణ. భద్రాచలం ఆలయానికి 12 సువర్ణ వాహనాలు బహుకరణ.

● రామాలయానికి ఎన్‌ఆర్‌ఐ వాసవీ అసోసియేషన్‌ వితరణ ● రూ.75 లక్షల వ్యయంతో తమిళనాడులో తయారీ ● 2, 3వ తేదీల్లో వాహనాల ప్రతిష్ఠ మహోత్సవం ● 4న తిరువీధి, సార్వభౌమ వాహన సేవలు

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఖజానాకు నూతన సువర్ణ ద్వాదశ వాహనాలు చేరాయి. ఈ వాహనాల తయారీకి ప్రవాసాంద్ర ఆర్యవైశ్య అసోసియేషన్‌ రూ.75 లక్షల ఆర్థిక సాయం అందించింది. దీంతో దేవస్థాన వైదిక కమిటీ సలహాలు, సూచనల మేరకు తమిళనాడులోని కుంభకోణంలో నిష్ణాతులైన కళాకారులచే వాహనాలను తయారు చేయించారు. ఇందులో సార్వభౌమ, హనుమంత, కల్పవృక్ష, సింహాసన, హంస, సింహ, గజ, అశ్వ, చంద్రప్రభ, సూర్యప్రభ, గరుడ, శేష వాహనాలు ఉన్నాయి. శ్రీ రామదాసు కాలంలో తయారు చేయించిన వాహనాలతోనే ఇప్పటివరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత రామచంద్రస్వామి వారికి వాహన సేవలు అందుతున్నాయి. తిరువీధి సేవలతో పాటు ప్రధాన ఉత్సవాలైన శ్రీరామనవమి, ముక్కోటి ఏకాదశి వేడుకల్లో స్వామివార్ల వాహనసేవలు ఉంటాయి. ఈ క్రమంలో నూతనంగా తయారు చేయించిన సువర్ణ ద్వాదశ వాహనాలతో ఇక నుంచి స్వామి, అమ్మవార్ల తిరువీధి సేవలు కొనసాగనున్నాయి.

రేపటి నుంచి ప్రతిష్ఠ..

సువర్ణ ద్వాదశ దివ్య వాహన ప్రతిష్ఠా మహోత్సవాలను వైభవంగా నిర్వహించాలని ఎన్‌ఆర్‌ఐ వాసవి అసోసియేషన్‌, దేవస్థానం వారు నిర్ణయించారు. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో గురువారం అంకురార్పణ, శుక్రవారం ఉదయం 7.29 గంటలకు సువర్ణ ద్వాదశ దివ్య వాహన ప్రతిష్ఠ, సాయంత్రం 4.30 గంటలకు నూతన 12 సువర్ణ వాహనాలతో స్వామివారికి తిరువీధి సేవ నిర్వహిస్తారు. 4వ తేదీ శనివారం సాయంత్రం 6.30 గంటలకు సార్వభౌమ వాహన సేవలను జరపాలని నిర్ణయించారు.

ఆహ్వాన పత్రాల ఆవిష్కరణ..

రూ. 75 లక్షల విరాళాలతో శ్రీరామచంద్ర స్వామికి తయారు చేయించిన నూతన సువర్ణ ద్వాదశ దివ్య వాహన ప్రతిష్ఠా మహోత్సవాలను విజయవంతం చేయాలని ఉత్సవ కమిటీ బాధ్యులు కోరారు. జీయర్‌ మఠంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రాలను ఆవిష్కరించారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. భక్తి ప్రవత్తులతో ఎన్‌ఆర్‌ఐ ఆర్యవైశ్యులు సమర్పించిన ఈ వాహనా లను స్వామి వారికి అంకితం చేసే కార్యక్రమంలో భక్తులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరా రు. సమావేశంలో డాక్టర్‌ ఎస్‌.ఎల్‌. కాంతారావు, దుర్గాప్రసాద్‌, రామారావు, చారుగుళ్ల శ్రీనివాస్‌, జి. వెంకటాచార్యులు, కృష్ణయ్య, వై.సూర్యనారాయణ, అల్లం నాగేశ్వరరావు, పొడిచేటి సీతారామానుజా చార్యులు, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

ద్వాదశ వాహనాలకు ఘన స్వాగతం..

కాగా తమిళనాడు నుంచి ఈ వాహనాలు లారీలో మంగళవారం సాయంత్రం భద్రాచలం చేరుకున్నాయి. వీటికి బ్రిడ్జి సెంటర్‌లో ఉత్సవ కమిటీ సభ్యులు హారతితో స్వాగతం పలికారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్లారు.