WorldWonders

కాలారామ్ మందిర్…నాసిక్

కాలారామ్ మందిర్…నాసిక్

జగదానందకారకుడైన రాముడిది దివ్యమోహన రూపం. ఏ గుడిలో అయినా ఆయన విగ్రహం ఎంతో అందంగానే కనిపిస్తుంది.

నాసిక్‌లోని పంచవటి ప్రాంతంలోని కాలారామ్‌ ఆలయంలో సీతాలక్ష్మణ సమేతంగా కొలువైన రామచంద్రుడు నల్లని శిలతో దర్శనమిస్తాడు. అందుకే ఇక్కడి రాముణ్ణి కాలారామ్‌గా కొలుస్తారు. సీతారాములు తమ పద్నాలుగేళ్ల వనవాసంలో భాగంగా రెండున్నర సంవత్సరాలపాటు గోదావరీ తీరంలోని నాసిక్‌ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్న అగస్త్యముని ఆశ్రమంలో నివసించారనీ ఆ సమయంలో సీతారామలక్ష్మణులు ఐదు చెట్లను నాటారనీ అదే నేటి పంచవటి అనీ చెబుతారు.
మహారాష్ట్రాని పరిపాలించే రాజు పీష్వారంగారావు కలలో ఒకరోజు శ్రీరాముడు కనిపించి తానూ వనవాస కాలంలో నివసించిన ప్రాంతంలో ఒక ఆలయాన్ని నిర్మించమని చెప్పగా, ఆ రాజు ఇక్కడ కాలరామ మందిరాన్ని నిర్మించారు.

పూర్తిగా నల్లరాతితో ఉండే ఈ ఆలయంలో సిమెంట్ వంటివి ఉపయోగించకుండా కేవలం బెల్లం నీరు పోసి వాటిని అతికించారట.

ఈ ఆలయాన్ని నిర్మించడానికి దాదాపుగా 12 సంవత్సరాల సమయం పట్టగా ఆ కాలంలోనే అంటే సుమారు 200 సంవత్సరాల క్రితమే 23 లక్షల ఖర్చు అయిందని చెబుతారు.

ప్రధాన ద్వారం దగ్గర ఉన్న హనుమ కూడా ఇక్కడ కృష్ణవర్ణంలోనే కనిపిస్తాడు.
ఇక్కడ ఉన్న పురాతన వృక్షం కింద దత్తాత్రేయుడు సంచరించాడనేందుకు ఆయన పాదాల గుర్తులు ఉంటాయి.

ఈ ఆలయంలో ఉన్న మరో విశేషం ఏంటంటే, ఉదయం సూర్య కిరణాలు ఆలయంలో తూర్పు దిక్కున ఉన్న ద్వారం నుండి ఆంజనేయస్వామి ఆలయం నుండి రామమందిరం లో ఉన్న సీతారామలక్ష్మణులపై పడుతుంటాయి.ఇలా ఉదయం సూర్యకిరణాలు సీతారామలక్ష్మణులపై పడే విధంగా చేసిన అప్పటి వాస్తు నిర్మాణం అద్భుతమని చెప్పవచ్చు.

ఈవిధంగా శ్రీరాముడు వనవాస కాలంలో నివసించిన, కాలరాముడిగా నలుపు రంగులో దర్శనం ఇస్తున్న, అద్భుత వాస్తు శిల్పకళ ఉన్న ఈ పవిత్ర పుణ్యక్షేత్రానికి ఎప్పుడు భక్తులు అధిక సంఖ్యలో వస్తూ సీతారామలక్ష్మణులను, ఆంజనేయస్వామిని దర్శనం చేసుకుంటారు.

శ్రీ రామ జయ రామ జయ జయ రామ