Politics

నడిరోడ్డుపై సీఎం కారు ఆపిన పోలీసులు..డబ్బు, మద్యం కోసం తనిఖీలు

నడిరోడ్డుపై సీఎం కారు ఆపిన పోలీసులు..డబ్బు, మద్యం కోసం తనిఖీలు

బెంగళూరు: కర్ణాటక పోలీసులు ఏకంగా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వాహనాన్నే తనిఖీ చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టిన పోలీసులు ముఖ్యమంత్రి కారును ఆపి పరిశీలించారు. బెంగళూరు రూరల్​ జిల్లా దొడ్డబల్లాపుర్ ప్రాంతంలోని హోసహుద్య సమీపంలో చెక్ పోస్ట్ వద్ద ఈ తనీఖీలు జరిగాయి. శుక్రవారం ఉదయం జిల్లా ఎస్పీ అధ్వర్యంలో వాహన తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. అదే సమయంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వాహనశ్రేణి అదే మార్గంలో వస్తోంది. దీంతో ముఖ్యమంత్రి కాన్వాయ్​ను ఆపారు పోలీసులు. అనంతరం ఆ వాహనాలు అన్నింటినీ తనిఖీ చేశారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఘాటి సుబ్రహ్మణ్య దేవాలయానికి దర్శనం కోసం వెళ్లినట్లు అధికారులు తెలిపారు. అయితే పోలీసులు చేసిన ఈ పనిపై రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. “త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో అక్రమ నగదు, మద్యం రవాణా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో వీటిని నిలువరించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఈ ప్రాంతంలో మొత్తం ఆరు చెక్​పోస్ట్​లు ఏర్పాటు చేశాం. అందరి వాహనాలు తనిఖీ చేస్తున్నాం. ముఖ్యమంత్రి వాహనాన్ని కూడా తనిఖీ చేశాం. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదని బెంగళూరు రూరల్ ఎస్పీ మల్లికార్జున బాలదండి తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన మేరకు కర్ణాటక శాసనసభ ఎన్నికలకు ఏప్రిల్​ 13న నోటిఫికేషన్​ వెలువడుతుంది. మే 10న పోలింగ్​ జరుగుతుంది. అదే నెల 13న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.