Politics

వైకాపా ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నారు. చంద్రబాబు.

వైకాపా ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నారు. చంద్రబాబు.

జగన్‌ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధం

చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు

ముందస్తుకు తాము సిద్ధంగా లేమని జగన్‌ భావిస్తే అది పగటికలే

మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్యకేసు దేశ చరిత్రలో సస్పెన్స్‌ థ్రిల్లర్‌

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

జగన్‌ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 175 స్థానాల్లో వైసీపీని ఓడించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా తాము సిద్ధమేనని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ముందస్తుకు తాము సిద్ధంగా లేమని జగన్‌ భావిస్తే అది పగటికలే అవుతుందని చెప్పారు. జగన్‌ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన చంద్రబాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. వైసీపీలో నేతలు బానిసల్లా బతుకుతున్నారని పేర్కొన్నారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్యకేసు దేశ చరిత్రలో సస్పెన్స్‌ థ్రిల్లర్‌. ఫిక్షన్‌ కథలు రాసే వారు కూడా ఇలాంటివి రాయలేరు. ఇన్ని ట్విస్టులు ఉన్న కేసు దేశంలో మరొకటి లేదు. ఇలాంటి కేసు పోతే వ్యవస్థల మీద నమ్మకం పోతుంది. జగన్‌.. పెద్ద దోపిడీదారు. ఆయన పేదల ప్రతినిధి కాదని చంద్రబాబు విమర్శించారు.

ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చారన్న చంద్రబాబు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో శాశ్వత చికిత్స చేస్తారని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాలపై సజ్జల ఒకటంటే, మంత్రి బొత్స మరొకటి అంటున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన వైఫల్యం ఉందన్న బొత్స సత్యనారాయణ రాజీనామా చేయొచ్చుగా అని చంద్రబాబు అన్నారు. ఏప్రిల్ ఫూల్ అనే పదం జగన్‌కి సరిగ్గా సరిపోతుందని ఎద్దేవా చేశారు. ప్రజలందర్నీ ఎల్లకాలం ఫూల్స్ చేయొచ్చనే భ్రమలో ఉన్నారని, కానీ, ప్రజలంతా కలిసి ఆయనను ఫూల్ చేసేందుకు సిద్ధమయ్యారన్నారు. పుట్టిందే రాష్ట్ర విధ్వంసం కోసం అన్నట్లుగా జగన్ ఉన్నారని ధ్వజమెత్తారు. ఈ ముఖ్యమంత్రి చెడు ఆలోచనలు అంచనా వేయటం కష్టమేమో కానీ, అతని భవిష్యత్తు ఏంటో ప్రజలంతా అంచనా వేస్తున్నారని చెప్పారు.

గతంలో ఏది మంచి? ఏది చెడు? అనే విశ్లేషణ ఉండేదని, ఇప్పుడు ఎదురుదాడి తప్ప మరొకటిలేదని తెలిపారు. 175 స్థానాల్లో వైసీపీని ఓడించడమే తమ లక్ష్యమన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి ఉన్న 23 మంది సభ్యుల బలంతోనే ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకున్నామని చెప్పారు. తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకెళ్లిన వైసీపీ తిరిగి నిందలు వేయడం విడ్డూరంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఏ ఎమ్మెల్యే వచ్చినా రాజీనామా చేసి రావాలని జగన్‌ అసెంబ్లీలో అనలేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. నీతిమాలిన పనులు చేస్తూ తిరిగి తెలుగుదేశంపై నిందలు వేస్తారా అని నిలదీశారు. ఎమ్మెల్యే కోటాలో తెలుగుదేశానికి రావాల్సిన ఒక సీటు కోసం పోటీ చేయడం అనైతికమనడం బుద్ధిలేని తనం కాక మరేంటని ఆక్షేపించారు.