WorldWonders

మేల్కోట్టై మేఘనాధేశ్వరుడు…!!

మేల్కోట్టై మేఘనాధేశ్వరుడు…!!

       
🌸చెన్నై వండలూర్ – కేళంబాక్కం మార్గంలో కండిగై అనే వూరు దాటగానే మేల్కోట్టై ఊరు వస్తుంది ఆ ఊరిలో శ్రీ మేఘాంబికా సమేత
శ్రీ మేఘనాధేశ్వరుడు కొలువుదీరి వున్నాడు.

🌸ఇది చెన్నై తాంబరానికి 17 కి.మీ. దూరంలో వున్నది.
ఆలయ గర్భగుడిలో పరమశివుడు మేఘనాదేశ్వరుడిగా పశ్చమాభిముఖంగా దర్శనమిస్తున్నాడు.
పశ్చిమ ముఖ శివలింగ రూప దర్శనం వేయి తూర్పు ముఖలింగాల దర్శనానికి సమానమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుందని అంటారు.

🌸మేఘాంబికా అమ్మవారు పేరుకు తగినట్లుగా భక్తుల మీద కరుణా కటాక్షాలు వర్షిస్తుంది. ఈ దేవిని  భక్తి శ్రధ్ధలతో పూజించినవారికి సకల సౌభాగ్యాలు సిధ్ధిస్తాయని
భక్తుల ధృఢ విశ్వాసం.
దుర్వాస మహర్షి ఒక  యాగం చేస్తున్న సమయాన వరుణుడు తన వినోదంగా ఆ యాగాన్ని భగ్నంచేసి భీభత్సమైన వర్షాలు కురిపించి తన శక్తిని ప్రదర్శించాడు.

🌸దానితో ఆగ్రహావేశాలతో  దుర్వాస మహర్షి వరుణునికి తీవ్ర ఉష్ణతాపం తో బాధపడమని  శపించాడు.
శరీరమంతా భరించలేని ఉష్ణంతో  భాధపడుతున్న వరుణుడు
దుర్వసమహర్షిని ప్రార్ధించి శాపవిమోచనం కోరాడు.
దుర్వాసమహర్షి దయతో శాపవిమోచన మార్గం తెలిపారు. ఆవిధంగా మేఘనాధేశ్వరుని ఆలయానికి వరుణుడు వచ్చి ప్రార్ధించాడు.

🌸తాను అక్కడే నివాసమేర్పర్చుకొని  తన వాహనమైన మకరంతో మకరతీర్ధాన్ని ఏర్పరిచాడు. 
ఆ జలంతో స్వామికి అభిషేక ఆరాధనలు చేసి  ,శాపవిమోచనం పొందాడని స్ధలపురాణ కధ.
మేఘాధిపతియైన వరుణుడు పూజించినందున, ఈ ఆలయ ఈశ్వరునికి మేఘనాధేశ్వరుడనే
పేరు వచ్చింది. ఈ  ఆలయంలో వాసుకి నర్తనుడు  అనే పరమశివుని
అపూర్వ శిలావిగ్రహం ఒకటి దర్శనమిస్తున్నది. 

🌸కృష్ణుని కాళింగనర్తన
రూప విగ్రహాలను అనేక ఆలయాలలో దర్శిస్తాము. కాని యీ పరమశివుని
వాసుకి నర్తన మూర్తి  ఇచట తప్ప ఇతర ఆలయాలలో ఎక్కడా కనపడదు.
వాసుకి సర్పం మీద శివుడు తాండవం చేసే భంగిమలో కనపడే  మూర్తి యిది. దేవతలు, దానవులు  వాసుకిని త్రాడుగా మేరు పర్వతాన్ని కవ్వంగా చేసుకుని క్షీరసాగరమధనం చేసిన కధ మనకి తెలుసు.

🌸తన వలననే దేవతలకి అమృతం లభించినదని   వాసుకి గర్వంతో విర్రవీగాడు. పడగవిప్పి
వాసుకి సర్పం కక్కిన విషం అందరిని భయభ్రాంతులను చేసింది.
అందరూ పరమేశ్వరుని వేడుకున్నారు.
పరమేశ్వరుడు వాసుకి తలమీదకెక్కి ఉగ్ర తాండవం చేశాడు. ఈశ్వరుడి తాండవ వేగానికి తట్టుకోలేక వాసుకి పరమశివుని శరణువేడాడు. మహాదేవుడు వాసుకిని
మన్నించి , తన కంఠాభరణంగా ధరించి
అనుగ్రహించాడు.

🌸ఈ గాధను తెలియచేసే మూర్తి వాసుకి నర్తనమూర్తి. ఈ మూర్తి ని దర్శించి పూజించిన నాగ దోషం, ఈర్ష్యాసూయల నుండి
విముక్తి  కలిగి శుభం పొందుతారని
ఐహీకం. ప్రదోషం రోజులలో  ఈశ్వరునికి 108 శంఖాలతో అభిషేకం జరుగుతుంది. ఈ ఆలయంలో, ముఖ్యంగా, ఆయుర్వృధ్ధికై  మహా మృత్యుంజయ హోమం జరుపుతారు.

🌸మార్కండేయ మహర్షి ప్రధమంగా  జపించి ప్రసాదించిన 16 మూల మంత్రాలు  పలు రూపాలుగా  ఈ యాగంలో సమర్పించడం యీ ఆలయ విశిష్టత. ఈ హోమంలో పాల్గొంటే
పూర్ణయుర్దయం, ఆరోగ్యం, కీర్తి
ప్రతిష్టలు , ఐశ్వర్యం  లభిస్తాయని
భక్తులు ధృఢంగా విశ్వసిస్తారు.