NRI-NRT

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. నిధుల సేకరణపై దృష్టి పెట్టిన బైడెన్, 150 మంది దాతలకు సన్మానం

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. నిధుల సేకరణపై దృష్టి పెట్టిన బైడెన్, 150 మంది దాతలకు సన్మానం

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలలో తాను పోటీ చేస్తున్నట్లు బైడెన్( Biden ) ప్రకటించిన సంగతి తెలిసిందే.దీంతో అగ్రరాజ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి.

పోటీ చేస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా ప్రచారానికి, నిధుల సేకరణకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు బైడెన్.దీనిలో భాగంగా శుక్రవారం సాయంత్రం డెమొక్రాటిక్ పార్టికీ చెందిన 150 మంది అగ్రశ్రేణి దాతలకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు జో బైడెన్, కమలా హారిస్( Kamala Harris ).ఎన్నికల ప్రచారం నిమిత్తం వీరిద్దరూ దాదాపు 1 బిలియన్ డాలర్లకు పైగా నిధులను సేకరించాల్సి వుంది.రాబోయే 18 నెలల్లో బైడెన్ ప్రచారానికి నిధులు సమకూర్చడానికి ఇది వ్యూహాత్మక సెషన్‌గా అమెరికన్ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అతిథులకు విందుతో పాటు అగ్రశ్రేణి బైడెన్ సలహాదారులు, అతని క్యాంపెయిన్ కో చైర్‌లు 2024 ఎన్నికలకు నిధులు ఎలా సమకూర్చాలనే వ్యూహంపై శనివారం అవగాహన కల్పించనున్నారు.2024 నవంబర్‌లో ఎలా గెలుపొందాలనే దానిపై తాము దృష్టి సారించినట్లు బైడెన్ క్యాంపెయిన్ కో చైర్ జెఫ్రీ కాట్‌జెన్‌బర్గ్( Co Chair Jeffrey Katzenberg ) పేర్కొన్నారు.డెమొక్రాట్ పార్టీలో విజయవంతమైన నిధుల సమీకరణకర్తలుగా గుర్తింపు తెచ్చుకున్న మేరీలాండ్‌ గవర్నర్ వెస్ మూర్, న్యూజెర్నీ గవర్నర్ ఫిల్ మర్ఫీ, కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్‌లు వాషింగ్టన్‌‌లోని స్వాంకీ సాలమండర్‌ హోటల్‌కు హాజరవుతారని సమాచారం.

అధ్యక్షుడు బైడెన్ తన అభ్యర్ధిత్వాన్ని అధికారికంగా ప్రకటించిన తర్వాత ఇదే ఆయన తొలి వ్యక్తిగత ప్రచార కార్యక్రమం .అయితే గురువారం రాత్రి బైడెన్ తన వైట్‌హౌస్ నివాసం నుంచి కిందిస్థాయి మద్ధతుదారులతో వర్చువల్‌గా మాట్లాడారు.ఈ సందర్భంగా నిధుల సేకరణకు సంబంధించి తన మద్ధతుదారులకు ఈమెయిల్స్ పంపారు .2022 మధ్యంతర ఎన్నికల సమయంలో కిందిస్థాయి దాతల నిధులు డెమొక్రాటిక్ నిధుల సేకరణలో 60 శాతానికి పైగా వున్నాయి.ఇకపోతే.

బైడెన్ వయసు గురించి రిపబ్లిక్ పార్టీ నేత నిక్కీ హేలీ చేసిన వ్యాఖ్యలు అమెరికాలో కలకలం రేపుతున్నాయి.ఆయనకు ఓటేస్తే కమలా హ్యారీస్‌పై ఆధారపడినట్లేనని ఆమె వ్యాఖ్యానించారు.ప్రస్తుతం బైడెన్ వయసు 81 సంవత్సరాలని.2024 అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి గెలిస్తే పదవీ కాలం ముగిసే నాటికి ఆయన వయసు 86 సంవత్సరాలని.అందువల్ల పూర్తికాలం బైడెన్ అధ్యక్షుడిగా కొనసాగుతారని తాను అనుకోవడం లేదని నిక్కీ హేలీ అభిప్రాయపడ్డారు.