WorldWonders

పెళ్లి చేసుకుంటామని పిలిచి యువకుడిపై అక్కచెల్లెళ్ల దారుణం!

పెళ్లి చేసుకుంటామని పిలిచి యువకుడిపై అక్కచెల్లెళ్ల దారుణం!

ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకుందాం రమ్మని అనేసరికి యువకుడు సంతోషం పట్టలేకపోయాడు. ఆగమేఘాల మీద ముంబైకి వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత దారుణం చోటుచేసుకుంది.

పెళ్లి పేరుతో విసిగిస్తున్నాడని కక్ష పెంచుకున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఓ యువకుడిపై దారుణానికి ఒడిగట్టారు. పెళ్లి చేసుకుంటామని నమ్మించి తమ ఊరికి రప్పించారు. తర్వాత తమ కుటుంబసభ్యులతో కలిసి అతడిపై దాడికి పాల్పడ్డారు. రెండు కాళ్లు విరగొట్టారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబైలోని అంథేరీ ప్రాంతానికి చెందిన జయశ్రీ బైరాగి అనే 23 ఏళ్ల అమ్మాయికి కొన్ని నెలల క్రితం అహ్మదాబాద్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడితో పెళ్లి కుదిరింది. రెండు కుటుంబాల వాళ్ల అనుమతితో జనవరి నెలలో వీరి పెళ్లి నిశ్చయం అయింది.

అయితే, కొన్ని అనుకోని కారణాల వల్ల జయశ్రీ కుటుంబం ఫిబ్రవరి నెలలో పెళ్లిని క్యాన్సిల్‌ చేసుకుంది. దీంతో జయశ్రీ యువకుడితో మాట్లాడటం మానేసింది. అయితే, యువకుడు మాత్రం ఈ పెళ్లి క్యాన్సిల్‌ చేసుకోవటానికి ఇష్టపడలేదు. తరచుగా జయశ్రీకి ఫోన్లు చేస్తూ ఉన్నాడు. లేచిపోయి పెళ్లి చేసుకుందాం అంటూ ఆమెను ఇబ్బంది పెట్టసాగాడు. జయశ్రీ యువకుడి వేధింపులు తట్టుకోలేకపోయింది. ఎలాగైనా అతడి అడ్డు తొలగించుకోవాలని భావించింది. ఈ విషయాన్ని అక్క రీతూకు చెప్పింది. రీతూ తన భర్త, మరో ముగ్గురితో కలిసి యువకుడ్ని కొట్టడానికి నిశ్చయించుకుంది. ఆ గ్రూపు తమ ప్లాన్‌ ప్రకారం జయశ్రీతో యువకుడికి ఫోన్‌ చేయించారు. జయశ్రీ.. పెళ్లి చేసుకుందాం రమ్మంటూ అతడ్ని ముంబైకి ఆహ్వానించింది.

ప్రేమించిన యువతి పెళ్లి అనే సరికి అతడు ఏమాత్రం ఆలోచించకుండా ముంబైకి వచ్చాడు. జయశ్రీ చెప్పిన చోటుకు వెళ్లాడు. యువకుడు అక్కడికి రాగానే జయశ్రీ, రీతూ, మిగిలిన ముగ్గురు అతడిపై కర్రలతో దాడి చేశారు. విచక్షణా రహితంగా కొట్టారు. దీంతో అతడి రెండు కాళ్లు విరిగిపోయాయి. దాడి తర్వాత నిందితులు అక్కడినుంచి వెళ్లిపోయారు. స్థానికుల సహాయంతో యువకుడు ఆసుపత్రిలో చేరాడు. కొద్దిగా కోలుకున్న తర్వాత తనపై జరిగిన దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.