NRI-NRT

అమెరికా, కెనడాలలో 200కు పైగా స్క్రీన్‌లలో ‘‘ ది కేరళ స్టోరీ’’..

అమెరికా, కెనడాలలో 200కు పైగా స్క్రీన్‌లలో ‘‘ ది కేరళ స్టోరీ’’..

ఇటీవలికాలంలో సినిమాలు దేశ రాజకీయాలను అత్యంత తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.ఆయా సినిమాలకు మద్ధతిచ్చే వర్గాల్లో రాజకీయ పార్టీలు కూడా చేరిపోతున్నాయి.
అంతేకాదు.అవసరమైతే తమ స్వలాభం కోసం వాడుకుంటున్నాయి .గతేడాది వచ్చిన ‘‘ ది కశ్మీర్ ఫైల్స్’’ చిత్రం ఎంతటి కలకలం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం.చివరికి బీజేపీ , బీజేపీయేతర వర్గాల మధ్య వార్‌గా మారింది.ఈ గొడవ సద్దుమణిగిందో లేదో.ఇప్పుడు తాజాగా ‘‘ ది కేరళ స్టోరీ’’ అంటూ మరో సినిమా వార్తల్లో నిలిచింది.

కేరళలో లవ్ జిహాద్ పేరిట హిందూ, క్రిస్టియన్ యువతులను మతం మార్చి వారిని ఉగ్రవాదులుగా మారుస్తున్నారన్నదే సినిమా ఇతివృత్తం.అయితే ట్రైలర్, టీజర్ విడుదలైన నాటి నుంచి రచ్చ మొదలైంది.ది కేరళ స్టోరీని అడ్డుకోవాలని కొందరు వ్యక్తులు, సంస్థలు, వర్గాలు తీవ్రంగా ప్రయత్నించాయి.అంతేకాదు.చివరికి కోర్టులను సైతం ఆశ్రయించాయి.
అయినప్పటికీ సినిమా థియేటర్‌లలోకి ఎంట్రీ ఇచ్చింది.అంతేకాదు.

కొన్ని రాష్ట్రాలు బ్యాన్ చేసినా, మరికొన్ని చోట్ల అనేక ఆంక్షలు విధించినా ప్రేక్షకులు మాత్రం ది కేరళ స్టోరీకి బ్రహ్మరథం పడుతున్నారు.దీంతో చిత్ర నిర్మాతలకు కలెక్షన్ల పంట పండుతోంది.ఇప్పటి వరకు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.94 కోట్ల వరకు సొంతం చేసుకుని వడివడిగా రూ.100 కోట్ల వైపుగా పరుగులు తీస్తోంది.

కాగా.ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన అమెరికా, కెనడాలలో 200కు పైగా స్క్రీన్‌లలో ది కేరళ స్టోరీ విడుదలైంది.ఈ సందర్భంగా దర్శకుడు సుదీప్తో సేన్ వర్చువల్‌గా జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.

కేరళలో ఏళ్లుగా వున్న సమస్యను దేశం తిరస్కరించిందన్నారు.ప్రపంచవ్యాప్తంగా వున్న ప్రజలను చేరుకోవడానికి, అవగాహన కల్పించే ఒక ఉద్యమమే ‘‘ ది కేరళ స్టోరీ’’ అని సుదీప్తో సేన్ స్పష్టం చేశారు.నిర్మాత విపుల్ షా మాట్లాడుతూ.ఈ సినిమా సబ్జెక్ట్‌ను జనాలకు తెలియకుండా దాచిపెట్టారని, కానీ తాము మాత్రం ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగేలా ఈ చిత్రాన్ని రూపొందించామన్నారు.మరి అమెరికా, కెనడాలలో వున్న ఎన్ఆర్ఐలు, భారతీయులు ఈ సినిమాకు ఎలాంటి రిజల్ట్ ఇస్తారో వేచి చూడాలి.