Politics

రేవంత్ రెడ్డి బీజేపీలోకి రావాలి’బహిరంగంగా ఆహ్వానించిన మాజీ ఎంపీ…

రేవంత్ రెడ్డి బీజేపీలోకి రావాలి’బహిరంగంగా ఆహ్వానించిన మాజీ ఎంపీ…

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీజేపీలోకి రావాలని మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీడియా ముఖంగా ఆహ్వానించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ను కొట్టే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని ఆయన చెప్పారు. రేవంత్ రెడ్డితో పాటు మిగతా నాయకులు కూడా ఆలోచన చేయాలని సూచించారు. మతానికో కోడ్ ఉండాలని కాంగ్రెస్ అంటోందని, భారత్ జోడో యాత్ర చేపట్టిన వారు కాశ్మీర్‌కు వేరే కోడ్ ఉండాలని అనడంపై విమర్శలు చేశారు. కవిత లిక్కర్ కేసు విచారణను దర్యాప్తు సంస్థలు చేస్తున్నాయని, ఈ విషయంలో పార్టీకి సంబంధం లేదన్నారు. కేసు విచారణ త్వరగా చేయాలని మాత్రమే పార్టీ చెప్పగలదని చెప్పారు.

ఇకపోతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను మర్చాలనేది తమ ప్రధాన డిమాండ్ కాదని ఆయన పేర్కొన్నారు. మార్పు అనగానే రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాలనడం కాదని తెలిపారు. పార్టీలో ఉన్న ఇతర సమస్యలపై అమిత్ షాకు వివరించినట్లు కొండా చెప్పారు. తన మనసులో మాటను ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పానని, అంతేకానీ.. తాను పార్టీ మారడం లేదని విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టంచేశారు. పలు ఛానళ్లు, పత్రికల్లో తాను చేసిన వ్యాఖ్యలను తిప్పి రాశారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని ఆయన అన్నారు. బీజేపీ నేతలను కొనడం అంత ఈజీ కాదని, అందుకే ప్రజలకు బీజేపీపై నమ్మకం ఉందని స్పష్టంచేశారు.