అమెరికా-రష్యాల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఇప్పటికే పలు అంశాలకు సంబంధించి అమెరికా.. రష్యాపై అంక్షలను విధించింది. దీనిపై రష్యా ఘాటుగా స్పందించింది. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. యూఎస్ మాజీ అధ్యక్షులు సహా పలువురు ప్రముఖులపై ఆంక్షలు విధించింది. అమెరికా విధించిన ఆంక్షలకు ప్రతిస్పందనగా రష్యా 500 మంది ప్రముఖ అమెరికన్లపై నిషేధం విధించింది. వారిలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఉన్నారని సమాచారం.
యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం విధించిన రష్యా వ్యతిరేక ఆంక్షలకు ప్రతిస్పందనగా అమెరికా కార్యనిర్వాహక శాఖకు చెందిన పలువురు సీనియర్ సభ్యులతో సహా 500 మంది అమెరికన్లను దేశంలోకి రానివ్వకుండా నిషేధిస్తున్నామంటూ రష్యా ప్రకటించింది. ఈ జాబితాలో ఆ దేశ మాజీ అధ్యక్షులు ఒబామాతో పాటు అమెరికా మాజీ రాయబారి జాన్ హంట్స్ మన్, పలువురు అమెరికా సెనేటర్లు, జాయింట్ చీఫ్స్ తదుపరి చైర్మన్ చార్లెస్ క్యూ బ్రౌన్ జూనియర్ కూడా ఉన్నారు. ప్రముఖ అమెరికన్ లేట్ నైట్ టీవీ షో హోస్ట్ లు జిమ్మీ కిమ్మెల్, కోల్బర్ట్, సేథ్ మేయర్స్ లను కూడా దేశంలోకి ప్రవేశించకుండా రష్యా నిషేధించింది.