NRI-NRT

తెలంగాణకు 1250 కోట్ల పెట్టుబడులు, 3500 మందికి ఉద్యోగాలు..

తెలంగాణకు 1250 కోట్ల పెట్టుబడులు, 3500 మందికి ఉద్యోగాలు..

ఫ్రెంచ్‌-అమెరికన్‌ ఆయిల్‌ గ్యాస్‌ దిగ్గజ కంపెనీకి కీలక కేంద్రంగా హైదరాబాద్‌, రూ.5,400 కోట్ల విలువైన ఎగుమతులు,సాఫ్ట్‌వేర్‌ గ్లోబల్‌ డెలివరీ సెంటర్‌తోపాటు,ప్రెసిషన్‌ ఇంజినీరింగ్‌ కేంద్రం ఏర్పాటు,అల్లియంట్‌ ఇన్సూరెన్స్‌ గ్రూప్‌ విస్తరణ,బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, బీమా రంగాల్లో 9,000 మందికి ఉద్యోగావకాశాలు,మంత్రి కేటీఆర్‌ అమెరికా పర్యటనలోరాష్ర్టానికి పెట్టుబడుల వరద.

సంప్రదాయ, పునరుత్పాదక ఇంధన రంగంలో అంతర్జాతీయంగా పేరొందిన ఫ్రెంచ్‌-అమెరికన్‌ ఆయిల్‌ గ్యాస్‌ దిగ్గజ కంపెనీ ‘టెక్నిప్‌ ఎఫ్‌ఎంసీ’ తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఆ కంపెనీ గ్లోబల్‌ కార్యకలాపాలకు హైదరాబాద్‌ కీలక కేంద్రంగా మారనున్నది. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో ఆ కంపెనీ ఉన్నతాధికారుల బృందం శనివారం సమావేశమైంది. హ్యూస్టన్‌లోని ‘టెక్నిప్‌ ఎఫ్‌ఎంసీ’ క్యాంపస్‌లో కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆండ్రస్‌ డాల్‌, ఇండియా హెడ్‌-మేనేజింగ్‌ డైరెక్టర్‌ హౌసిలా తివారీతోపాటు ఇతర అధికారులు కేటీఆర్‌ను కలిశారు. తమ సాఫ్ట్‌వేర్‌ గ్లోబల్‌ డెలివరీ సెంటర్‌తోపాటు ప్రెసిషన్‌ ఇంజినీరింగ్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌ ఫెసిలిటీని హైదరాబాద్‌లో ప్రారంభించేందుకు ఈ సమావేశంలో కంపెనీ నిర్ణయం తీసుకొన్నది. 3,500 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని వెల్లడించింది.

దీంతోపాటు అంతర్జాతీయ ప్రమాణాలతో మరో మ్యాన్యుఫాక్చరింగ్‌ సెంటర్‌ను కూడా హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఈ కేంద్రంతో రాబోయే 5 ఏండ్లలో మరో వెయ్యి మందికి ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నది. తొలి దశలో రూ.1,250 కోట్లు పెట్టుబడిగా పెడుతున్నామని, హైదరాబాద్‌ కేంద్రంగా రూ.5,400 కోట్ల విలువైన ఎగుమతులను చేయబోతున్నట్టు ప్రకటించింది. కాగా, ఎఫ్‌ఎంసీ టెక్నాలజీస్‌, టెక్నిప్‌ల విలీనంతో ఏర్పడిన ‘టెక్నిప్‌ ఎఫ్‌ఎంసీ’ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాల్లో దాదాపు 30,000 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. విద్యుత్‌ ప్రాజెక్టులు, టెక్నాలజీ, సిస్టం, సర్వీసెస్‌ రంగంలో ఈ కంపెనీకి అంతర్జాతీయంగా మంచి పేరుంది. గ్రీన్‌హౌస్‌ గ్యాస్‌ తొలగింపు, పునరుత్పాదక ఇంధన తయారీ, హైడ్రోజన్‌ ఆధారిత ఇంధన ఉత్పత్తి ఆవిషరణల్లో ముందంజలో ఉంది.

తెలంగాణలో ఉన్న వ్యాపార అనుకూల వాతావరణానికి దిగ్గజ ఇన్సూరెన్స్‌ సంస్థ అల్లియంట్‌ ఫిదా అయింది. అగ్రశ్రేణి గ్లోబల్‌ కన్సల్టింగ్‌, ఫైనాన్షియల్‌ సంస్థ అయిన అల్లియంట్‌ గ్రూప్‌ తెలంగాణలో తన విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. హ్యూస్టన్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌తో అల్లియంట్‌ గ్రూప్‌ సీఈవో ధవల్‌ జాదవ్‌ భేటీ అయ్యారు. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, బీమా సెక్టార్‌లో 9 వేల ఉద్యోగాలను కల్పిస్తామని ధవల్‌ జాదవ్‌ తెలిపారు. బ్యాకింగ్‌, ఫైనాన్స్‌, బీమా రంగాలకు హైదరాబాద్‌ కీలకమని అల్లియంట్‌ ప్రకటనతో మరోసారి రుజువైందని కేటీఆర్‌ తెలిపారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌రంజన్‌, పెట్టుబడులు, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి ఈ విష్ణువర్ధన్‌రెడ్డి, చీఫ్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ అమర్‌నాథ్‌రెడ్డి ఆత్మకూరి, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ విభాగం డైరెక్టర్‌ ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచంలోని తెలుగు ఐటీ సంస్థలకు వేదికగా నిలిచి, రెండు రాష్ట్రాలను అభివృద్ధిపథంలో తీసుకుపోవడమే లక్ష్యంగా ఏర్పాటైన వరల్డ్‌ తెలుగు ఐటీ కౌన్సిల్‌ (డబ్ల్యూటీఐటీసీ) ‘సై సోరర్‌’ను వాషింగ్టన్‌ డీసీలో మంత్రి కేటీఆర్‌ లాంచ్‌ చేశారు. ‘ఫ్లయింగ్‌ హై విత్‌ డబ్ల్యూటీఐటీసీ’ అనే థీమ్‌తో రూపొందించిన ఈ సై సోరర్‌ ద్వారా డబ్ల్యూటీఐటీసీ కార్యకలాపాల గురించి విపులంగా తెలియజేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఐటీ సంస్థలను మాతృభూమి అభివృద్ధిలో భాగం చేయాలని డబ్ల్యూటీఐటీసీ చైర్మన్‌ సందీప్‌ కుమార్‌ మఖ్తలకు మంత్రి కేటీఆర్‌ సూచించారు.