మణిపూర్‌లో మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మణిపూర్ రాజధాని ఇంఫాల్ తూర్పు జిల్లాలో దుండగులు ఇళ్లకు నిప్పుపెట్టారు.
మణిపూర్‌లో మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మణిపూర్ రాజధాని ఇంఫాల్ తూర్పు జిల్లాలోని న్యూ చెకాన్ ప్రాంతంలో మెయిటీ, కుకీ కమ్యూనిటీలు మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్టుగా చెబుతున్నారు. స్థానిక మార్కెట్‌లో గొడవలు మొదలయ్యాయని సమాచారం. ఈ క్రమంలోనే ఆందోళనకారులు కొన్ని ఇళ్లకు నిప్పుపెట్టినట్టుగా సమాచారం. దీంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ఘటన కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.
ఇద్దరు దుండగులు ఈ చర్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. అయితే అక్కడివారు ఒకరిని పట్టుకోగా.. మరో వ్యక్తి పారిపోయాడు. అయితే పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఆర్మీ సిబ్బంది గుంపును చెదరగొట్టడానికి బలవంతంగా మరియు బాష్పవాయువును ప్రయోగించారు. ఫలితంగా కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం ఆ ప్రాంతంలో సడలించిన కర్ఫ్యూ నిబంధనలను కఠినతరం చేశారు. అంతేకాకుండా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్టుగా సమాచారం.
ఇక, ఈ నెల మొదటివారంలో మెయిటీ కమ్యూనిటీని షెడ్యూల్ తెగలో చేర్చే చర్యలను వ్యతిరేకిస్తూ గిరిజన సంఘాలు ఇటీవల చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. వారం రోజుల పాటు సాగిన హింసాకాండలో 70 మందికి పైగా మరణించారు. కోట్ల విలువైన ఆస్తులు ధ్వంసమయ్యాయి. దీంతో వేలాది మంది ప్రజలు భద్రత కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాల్లో తలదాల్చుకున్నారు.