ఏపీ పాలిటిక్స్ లో ఫ్లెక్సీ వార్ హీట్ పుట్టిస్తూనే ఉంది. అధికార పక్షం వర్సెస్ విపక్షాలుగా కొనసాగుతున్న ఈ వార్ రచ్చ రచ్చకు దారి తీస్తోంది. ‘పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధం’ అనే క్యాప్షన్ తో టీడీపీ నేత చంద్రబాబు నాయుడును పల్లకిలో మోస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్న చిత్రాలతో ఉన్న ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇది దుమారానికి దారి తీస్తోంది.
అయితే దీన్ని ఎంపీ అదాల ప్రభాకర్ రెడ్డి అనుచరులు ఏర్పాటు చేశారు. ఇక దీనిపై గరం గరం అయిన జనసేన నాయకులు … నెల్లూరు సిటీలోని జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర ‘పాపం పసివాడు’ పేరుతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దాని కింద ‘450 కోట్ల రూపాయల అవినీతి ఇసుక గ్రావెల్ రూపంలో అక్రమ సంపాదన,పేదల భూములను లాక్కోవడం’ వంటివి సబ్ టైటిల్స్ పెట్టారు.
అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా నియోజక వర్గాల్లో ఇలాంటి ఫ్లెక్సీలనే ఏర్పాటు చేశారు వైసీపీ నేతలు.. వీటికి కౌంటర్ గా టీడీపీ, జనసేన నేతలు ఫ్లెక్సీలు పెడుతున్నారు. కాగా, నెల్లూరులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బాలాజీ నగర్ పోలీసులు తొలగించడానికి ప్రయత్నించారు. దీంతో జనసేన పార్టీ నేతలు అడ్డుకొని వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే లేని అభ్యంతరం.. ఇప్పుడు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.
ముందుగా వైసీపీ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించి.. తరువాత వీటి జోలికి రావాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు జనసైనికులు. మరో వైపు విశాఖ పట్నంలో వైసీపీ, జనసేన మధ్య ఈ వార్ మరీ ముదిరిపోయింది. వైపీసీ ఫ్లెక్సీలకు ధీటుగా జనసేన నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
‘రాక్షస పాలన అంతం.. ప్రజా పాలన ఆరంభమంటూ’ జనసేన నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జగన్ ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో వివేకా మొండెం ఉండేలా ఫ్లెక్సీలు పెట్టారు. జగన్ షర్ట్ పై 6093 నెంబర్, వైసీపీ నేతలతో కూడిన జగన్ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే సిరిపురం వీఐపీ రోడ్ లో పక్క పక్కనే ఇరు వర్గాల ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం రాజకీయ రగడకు దారి తీస్తోంది. ఇక ఈ ఫ్లెక్సీలతో పోలీసులకు తంటాలు తప్పడం లేదు.