NRI-NRT

వారే నా లక్ష్యం. అదే నా ఆశయం – తానా కార్యదర్శి కొల్లా అశోక్

Interview with TANA 2023-25 Secretary Kolla Ashok Babu

అమెరికాకు వెల్లువలా వస్తున్న ప్రవాస తెలుగు విద్యార్థులతో పాటు పర్యాటకులుగా తమవారిని చూసేందుకు వస్తున్న తల్లిదండ్రులకు తానాను దగ్గర చేయడం తన ముందు ఉన్న ప్రధాన కర్తవ్యాల్లో ఒకటని 2023-25కు గానూ తానాకు కార్యదర్శిగా నియమితులైన ప్రకాశం జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రుడు కొల్లా అశోక్‌బాబు తెలిపారు. 2009లో తానా ప్రవాస విద్యార్థుల కమిటీ అధ్యక్షుడిగా సంస్థలో తన పయనం ప్రారంభించిన ఆయన గడిచిన 14ఏళ్లలో తానాలో పలు కీలక పదవులను సమర్థవంతంగా నిర్వహించారు. ఆంటీ, అంకుల్, అన్నా, అక్కా అంటు అందరినీ కలుపుకుపోయే అశోక్ తానా కార్యదర్శిగా చేపట్టాలనుకుంటున్న కార్యక్రమాలను TNIకు ఇచ్చిన ముఖాముఖిలో వెల్లడించారు. ఆ వివరాలు మీ కోసం…

* లక్ష్యం
ప్రకాశం జిల్లా కొల్లావారిపాలెం గ్రామంలో జన్మించి ఓ సాధారణ రైతు కుటుంబం నుండి అమెరికాకు విద్యార్థిగా వచ్చిన తనకు, తానాతో అనుబంధం ఏర్పడటానికి కూడా విద్యార్థులకు సేవ చేసే మార్గంలోనే కావడం ఆనందకరమని అన్నారు. 2009లో వచ్చిన ఆ అవకాశమే తనను ఈరోజు కార్యదర్శిగా నిలబెట్టిందని వెల్లడించారు. అమెరికాకు వచ్చే తెలుగు విద్యార్థులు తానా సభ్యత్వ నమోదు రుసుము $250 కడితే వారికి తాము చదువుకుని ఉద్యోగవకాశం దొరికేవరకు ఆరోగ్య బీమా కల్పించడం తన లక్ష్యమన్నారు. తద్వారా తానా సభ్యత్వం బలోపేతం కావడంతో పాటు విద్యార్థులకు తానాను దగ్గర చేయవచ్చునని, ఇది బహు విధాల ప్రయోజనకారి అని వివరించారు. అమెరికాలో తానా సభ్యులుగా ఉన్న ప్రవాసులకు సభ్యత్వ ప్రాయోజనాల క్రింద రాయితీ కల్పనకు కూడా కృషి చేస్తానని అన్నారు.

* ఆశయం
తానా జీవిత కాల సభ్యులకు వెబ్‌సైట్‌లో ఓ లాగిన్ వ్యవస్థ నెలకొల్పి తెలుగు రాష్ట్రాల నుండి అమెరికాలో పర్యటించేందుకు వచ్చే ప్రవాస తల్లిదండ్రుల వివరాలను నమోదు చేసి వారికి కూడా ఒక దఫాలో 6నెలలు ఆరోగ్య బీమా కల్పించే సదుపాయాన్ని చేపట్టాలనేది తన ఆశయమని అశోక్ వెల్లడించారు. ఇండియా నుండి వచ్చే తల్లిదండ్రులకు మౌలిక వైద్య అవసరాలు ఈ బీమా రూపేణా అందుబాటులోకి తీసుకుని రావడం తన దీర్ఘకాల ఆశయమని వివరించారు.

* అనుబంధం
అమెరికా-కెనడాల్లో నివసిస్తున్న లక్షలాది మంది ప్రవాస తెలుగువారికి ఆయా ప్రాంతాల్లో స్థానికంగా ఉన్న తెలుగు సంఘాలు ఎంతో సేవ చేస్తున్నాయని హర్షించిన అశోక్, అదే స్థానిక తెలుగు సంస్థలతో తానాకు అనుబంధాన్ని పెంపొందించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. స్థానిక తానా సభ్యులతో సమన్వయం, తెలుగు సంస్కృతి-సాంప్రదాయాలకు పట్టం కట్టే కార్యక్రమాలకు ప్రాయోజకత్వం వహించడం, తానా ఆపత్కాల బంధువు టీంస్క్వేర్ కార్యకర్తల సంఖ్య పెంచడం వంటివాటిపై దృష్టి సారిస్తానని తెలిపారు.

* పరిణయం
అమెరికాలో తానాలో గడిచిన 46ఏళ్లలో 36వేల మంది సభ్యులుగా ఉంటే గత రెండేళ్లలోనే ఈ సంఖ్య మరో 36వేలకు పెరిగి 72వేలకు జేరింది. తద్వారా అమెరికాలో వివాహ వయస్సుకు వచ్చిన ప్రవాస తెలుగు కుటుంబాలకు చెందిన యువతీ యువకుల సంఖ్య కూడా పెరిగిందన్న అశోక్, తమ కుటుంబ సాంప్రదాయంతో సరితూగే సంబంధాల కోసం తల్లిదండ్రులు పడుతున్న అవస్థలను కూడా గుర్తించానన్నారు. అందుకే తానా మ్యాట్రిమోనీ సేవలను కూడా బలోపేతం చేయాలని, ఇరు కుటుంబాలకు తానా ఒక ఆరోగ్యకరమైన వేదికగా ఉండేలా తన హయాంలో చర్యలు తీసుకుంటానని తెలిపారు.

* సమాహారం
“మార్పే గెలుపు – మార్పే తూరుపు” లక్ష్యంతో ఎన్నికల బరిలో దిగి విజయఢంకా మోగించిన తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు కార్యవర్గంలో కీలక పదవి కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన అశోక్ తనకు, తన లక్ష్యసాధనకు కార్యవర్గం, బోర్డు, ఫౌండేషన్, సభ్యుల నుండి పూర్తి సహకారం లభిస్తుందని ఆశిస్తున్నారు. సభ్యుల హక్కులను పరిరక్షించేందుకు కూడా తాను కృషి చేస్తానని పేర్కొన్న ఆయన ఏకత్వ భావజాలం కలిగిన మనుషులు సమాహారంగా కలిసి నడిస్తే సాధించలేనిది ఏదీ ఉండదని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు.

For more info: Visit AshokKolla.org