రక్షణ రంగంలో అభివృద్ధి చెందుతున్న భారత దేశం వియత్నాంకు యుద్ధ నౌకను కానుకగా ఇచ్చింది. భారత నౌకాదళానికి 32 ఏళ్లుగా సేవలందించిన ‘ఐఎన్‌ఎస్ కృపాణ్’ యుద్ధనౌకను వియత్నాంకి ఇండియా బహుమతిగా అందజేసింది. వియత్నాం పర్యటనలో ఉన్న భారత నౌకాదళం అధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ ఈ యుద్ధనౌకను ‘వియత్నాం పీపుల్స్ నేవీ’కి అప్పగించారు. సేవలందిస్తున్న ఓ యుద్ధనౌకను భారత్ తన మిత్రదేశానికి బహుమతిగా ఇవ్వడం, దేశీయంగా నిర్మించి, ఆయుధాలతో పూర్తి యుద్ధ సన్నద్ధంగా ఉన్న నౌకను భారత్ ఇలా ఒక మిత్ర దేశానికి నజరానాగా ఇవ్వడం ఇదే మొదటిసారి. వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇది నిదర్శనంగా నిలుస్తుందని భారత నౌకాదళం వెల్లడించింది. స్నేహపూర్వక దేశాలకు సాయం చేయడంతోపాటు వారి రక్షణ సామర్థ్యాలను మెరుగుపరిచే విషయంలో భారత్ నిబద్ధతను ఇది చాటుతుందని నౌకాదళం తెలిపింది. దక్షిణ చైనా సముద్రమంతా తనదేనంటూ గిల్లికజ్జాలకు పాల్పడుతున్న చైనా దూకుడును అడ్డుకునేలా భారత్, వియత్నాంలు చేయీచేయీ కలుపుతున్నాయనడానికి తాజా పరిణామం నిదర్శనం.
పక్కలో బళ్లెంలా మారిన చైనా దూకుడును తగ్గించడానికి అందివచ్చిన అవకాశాలను భారత్ వినియోగించుకుంటున్నది. తనతో స్నేహపూర్వంగా ఉండే దేశాలకు సహాయం చేస్తూ వస్తున్నది. ఇందులో భాగంగా చైనా పొరుగు దేశమైన వియత్నాంకు యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ కృపాణ్‌ను అందించింది. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి గుర్తుగా 32 ఏండ్లుగా ఇండియన్ నేవీకి సేవలందిస్తున్న ఈ యుద్ధ నౌకను కానుకగా ఇచ్చింది. దక్షిణ చైనా సముద్రమంతా తనదేనంటూ ఆధిపత్యం ప్రదర్శిస్తూ డ్రాగన్‌ను కట్టడిచేసేలా వియత్నాంకు భారత్ సహాయం చేసినట్లయింది.
దేశీయంగా రూపొందించిన ఐఎన్‌ఎస్ కృపాణ్‌ను 1991లో ప్రారంభించారు. 90 మీటర్ల పొడవు, 10.45 మీటర్ల వెడల్పు, 1450 టన్నుల బరువున్న ఈ ఖుక్రీ క్లాస్ క్షిపణి యుద్ధనౌకలో సుమారు 12 మంది అధికారులు, వంద మంది నావికులు పనిచేస్తారు. దీనికి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉన్నది. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి నిదర్శనంగా ఐఎన్‌ఎస్ కృపాణ్ యుద్ధనౌకను బహుమతిగా ఇచ్చినట్టు తెలుస్తోంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యంపై ఇరు దేశాల్లో నెలకొన్న ఆందోళనల్ని దృష్టిలో ఉంచుకొని తీర ప్రాంతంలో గస్తీని బలోపేతం చేయడం దీని ఉద్దేశమంటున్నారు. భారత్ జీ20 సదస్సు ప్రధాన థీమ్ అయిన వసుధైక కుటుంబం (ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్)లో భాగంగానే ఈ కానుక ఇచ్చినట్టు తెలిపారు. ఐఎన్‌ఎస్ కృపాణ్ గస్తీతో దక్షిణ చైనా జలాల్లో అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా అన్ని దేశాలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐఎన్‌ఎస్ కృపాణ్ జూన్ 28న విశాఖపట్నం నుంచి బయల్దేరి జూలై 8 నాటికి వియత్నాం చేరింది.