Politics

ఖమ్మంలో కేసీఆర్ పై అమిత్ షా ఫైర్

ఖమ్మంలో కేసీఆర్ పై అమిత్ షా ఫైర్

కేసీఆర్ సర్కార్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా  చెప్పారు.ఖమ్మంలో  ఆదివారంనాడు నిర్వహించిన రైతు గోస- బీజేపీ భరోసా సభలో  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.

కేసీఆర్ సర్కార్ ను గద్దె దింపాలా వద్దా బీజేపీ సర్కార్ కావాలా వద్దా అని  అమిత్ షా ఖమ్మం ప్రజలను ప్రశ్నించారు. తిరుపతి  వెంకటేశ్వరుడిని స్మరించుకొని ప్రసంగం ప్రారంభిస్తానని అమిత్ షా చెప్పారు.స్థంభాద్రి లక్ష్మీ నరసింహుని సర్మించుకుని ప్రసంగించనున్నట్టుగా తెలిపారు.

ఎంఐఎం చేతిలో స్టీరింగ్ ఉన్న కారు పార్టీ మనకు కావాలా అని ఆయన ప్రశ్నించారు. ఎంఐఎం చీఫ్ ఓవైసీ పక్కన కూర్చుని  తెలంగాణ విమోచన వీరులను  కేసీఆర్  అవమానిస్తున్నారని  అమిత్ షా ఆరోపించారు. తెలంగాణ అమరుల కలలను కేసీఆర్ కల్లలు చేశారన్నారు. సోనియా కుటుంబం కోసం కాంగ్రెస్ పార్టీ, కల్వకుంట్ల కుటుంబం కోసం  బీఆర్ఎస్ పనిచేస్తుందని  అమిత్ షా విమర్శించారు.

కేసీఆర్ పాలనకు  నూకలు చెల్లాయని ఆయన విశ్వాసం వ్యక్తం  చేశారు. హైద్రాబాద్ విముక్తికి  75 ఏళ్లు నిండాయన్నారు. తెలంగాణలో త్వరలో కమలం వికసిస్తుందని  అమత్ షా ధీమాను వ్యక్తం చేశారు.భద్రాచలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన విషయాన్ని  అమిత్ షా గుర్తు చేశారు.శ్రీరామనవమికి పట్టు వస్త్రాలు సమర్పించే  సంప్రదాయాన్ని కేసీఆర్ విస్మరించారన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత కేసీఆర్ కారు  భద్రాచలం వెళ్తుంది.. కానీ  ఆలయం వరకు వెళ్లదని ఆయన ఎద్దేవా చేశారు.కేసీఆర్ … గుర్తు పెట్టుకోండి ఇక మీ కారు భద్రాచలం  వెళ్లాల్సిన అవసరం లేదన్నారు.త్వరలోనే బీజేపీ సీఎం భద్రాచలం వెళ్లి  స్వామివారికి పట్టు వస్త్రాలు  సమర్పిస్తారని ఆయన  విశ్వాసం వ్యక్తం చేశారు.