రానున్న శాసనసభ ఎన్నికల్లో జనగామ భారాస టికెట్ కోసం స్థానికేతరులైన ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తమ ప్రయత్నాలు మానుకోవాలని ఆప్కో మాజీ ఛైర్మన్ మండల శ్రీరాములు డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారితో కలిసి జనగామలో ఆదివారం ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ.. ఇద్దరు ఎమ్మెల్సీలకూ ఇంకా పదవీకాలం ఉందని, ఎమ్మెల్యే కావాలనుంటే వారి సొంత నియోజకవర్గాల్లో ప్రయత్నించుకోవాలని పేర్కొన్నారు. అనంతరం బీసీ వర్గానికి చెందిన తనకే జనగామ టికెట్ కేటాయించాలని వేడుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి శ్రీరాములు సాష్టాంగ నమస్కారం చేశారు.