Politics

రానున్న ఎన్నికల్లో సింగరేణిలో గులాబీ జెండా ఎగరవేయాలి: కవిత

రానున్న ఎన్నికల్లో సింగరేణిలో గులాబీ జెండా ఎగరవేయాలి: కవిత

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతంలో గులాబీ జెండా ఎగరాలని భారాస ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు. ఆ ప్రాంతాల్లో ఉన్న అన్ని ఎమ్మెల్యే స్థానాలను గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని కోరారు. సింగరేణిని ప్రైవేటీకరించే పరిస్థితి నుంచి కేసీఆర్ తప్పించారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆమెను సింగరేణి సంస్థకు చెందిన పాఠశాలల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది కలిశారు. తమ సమస్యలను పరిష్కారించాలంటూ ఆమెకు వినతిపత్రం అందజేశారు.తెలంగాణ రాకముందు వారసత్వ ఉద్యోగాల అంశం తీవ్రమైన సమస్యగా ఉండేదని ఈ సందర్భంగా కవిత తెలిపారు. అప్పట్లో కేవలం 4000 ఉద్యోగాలు మాత్రమే ఇస్తే తెలంగాణ ఏర్పడిన తర్వాత 20 వేల ఉద్యోగాలు కల్పించామన్నారు. మానవతా దృక్పథంతో ఆలోచించి సీఎం కేసీఆర్ వారసత్వం ఉద్యోగాలను కల్పించారన్నారు. సింగరేణి సంస్థలోని పాఠశాలల టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలను కూడా ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. తాను కూడా చొరవ తీసుకొని సీఎం కేసీఆర్‌తో చర్చిస్తానన్నారు. అవసరమైతే సీఎంతో సింగరేణి కార్మిక నాయకుల సమావేశం ఏర్పాటు చేయించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పారు.