Politics

రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతల హౌస్ అరెస్ట్

రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతల హౌస్ అరెస్ట్

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu arrest) అరెస్టు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడ నిర్బంధంలో ఉంచుతున్నారు. పలువురు కీలక నేతలను అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని ఇళ్లలోనే హౌస్‌ అరెస్ట్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు పార్టీ నాయకుల ఇళ్ల వద్ద భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. కుప్పం ఇన్‌ఛార్జి మునిరత్నంను సీఐ శ్రీధర్‌, ఎస్‌ఐ శివకుమార్‌ను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అలాగే కుప్పం పట్టణంలో బంద్‌ వాతావరణం తలపిస్తోంది. విశాఖ డాక్టర్ కాలనీలోని తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఇంటి వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గోండు శంకర్‌ను అరెస్ట్ చేసి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని వెన్నెలపాలెం నివాసంలో అరెస్టు చేసి అచ్యుతాపురం పోలీస్ స్టేషన్‌కు పంపారు. విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ఇంటి వద్ద పోలీసులు మోహరించి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండానే అదుపులోకి తీసుకున్నారు. ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్ కుమార్‌నూ పోలీసులు నిన్న రాత్రి నుంచే విశాఖలో గృహ నిర్బంధం చేశారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, పరిటాల శ్రీరామ్‌ను సైతం అదుపులోకి తీసుకొని అనంతపురం మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.