ScienceAndTech

సిమ్‌ బ్లాక్ అయితే బ్యాంకులో సొమ్ము గోవిందా!

సిమ్‌ బ్లాక్ అయితే బ్యాంకులో సొమ్ము గోవిందా!

హ్యాకర్లు కొత్త తరహా మోసం…ఆదమరిస్తే ఇక పోలీస్ స్టేషన్ నే గతి….మీ ఫోన్‌ సిమ్‌ కార్డు సడెన్‌గా బ్లాక్‌ అయ్యిందా..? ఐతే మీ బ్యాంకు ఖాతాలో సొమ్ము గోవింద.. జరభద్రం…ఇలాంటి హ్యాకర్లు నుండి బయట పడాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

స్మార్ట్‌ ఫోన్‌ చేతిలోకొచ్చాక వ్యక్తిగత సమాచారం సులువుగా ఇతరులు చేతుల్లోకి వెళ్లిపోతోంది.

క్షణాల్లో బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. రోజుకో కొత్త మార్గంలో అమాయకుల ఫోన్ల నుంచి కేటుగాళ్లు నగదు దోచుకుంటున్నారు.

తాజాగా నగరానికి చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి ఫోన్‌ మూడు రోజులుగా పనిచేయడం మానేసింది.

నెట్‌వర్క్‌ సమస్య వచ్చి ఉంటుందని భావించాడు. సమీపంలోని ఏటీఎంలో నగదు విత్‌డ్రా చేసుకోవడానికి వెళ్లితే అకౌంట్‌లో జీరో బ్యాలెన్స్‌ చూసించే సరిగికి ఉలిక్కిపడ్డాడు.

ఏం జరిగిందో తెలుసుకోవడానికి బ్యాంకుకు వెళ్లి ఆరా తీస్తే తన అకౌంట్‌ నుంచి దాదాపు రూ.3 లక్షల నగదు వేరే అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ అయినట్లు బ్యాంకు సిబ్బంది తెలిపింది.

హబ్సిగూడకు చెందిన ఓ రిటైర్డ్‌ ఉద్యోగి ఈ చేదు అనుభవం ఎదురైంది.

మెహిదీపట్నంకి చెందిన మరో వ్యక్తి అకౌంట్ నుంచి రూ.20 వేలు డెబిట్‌ అయినట్లు ఫోన్‌కు సందేశం వచ్చింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపు దఫాలుగా అతని అకౌంట్‌ నుంచి 6 లక్షల రూపాయలు మాయం చేశారు. నేరుగా అతని ఫోన్‌కు కాల్‌ చేసిన సైబర్ నేరగాళ్లు తన ఫోన్‌కు వచ్చిన లింక్‌ క్లిక్‌ చేయవల్సిందిగా కోరారు. అనంతరం బాధితుడి ఫోన్‌కు వచ్చిన ఓటీపీ తెలుసుకొని దశల వారీగా మొత్తం డబ్బు కొట్టేశారు.

ఈ మధ్యకాలంలో ఫోన్‌ సిమ్‌ కార్డులు ఉన్నట్లుండి బ్లాక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. అనేక మంది ఫోన్‌లలో సిమ్‌లు అలాగే ఉంటున్నాయి. అకస్మాత్తుగా సిమ్‌కార్డులు బ్లాక్‌ అవుతున్నాయి. ఏం జరిగిందో గుర్తించేలోపుగానే బ్యాంకు అకౌంట్‌లో డబ్బు గుట్టుచప్పుడుకాకుండా మాయం అవుతోంది. రెండేళ్ల క్రితం ఈ తరహా స్విమ్‌కార్డు క్లోనింగ్‌, సిమ్‌స్వాపింగ్‌లతో సైబర్‌ నేరగాళ్లు వరుస మోసాలకు పాల్పడ్డారు. ఇప్పుడు మళ్లీ అచ్చం అదేమాదిరి ఫోన్‌ సిమ్‌కార్డుల ద్వారా అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు. గ్రేటర్‌లోని 3 కమిషనరేట్ల పరిధిలో వస్తున్న సైబర్‌ ఫిర్యాదుల్లో ఓటీపీ బాధితులే అధికంగా ఉంటున్నారు. ఈ పరిస్థితిక అడ్డుకట్ట వేయాలంటే అవగాహనే సరైన మార్గమని సైబర్‌క్రైమ్‌ పోలీసులు సూచిస్తున్నారు. తద్వారా హ్యాకర్లు, మాయగాళ్లు కలసిచేస్తున్న మోసాలకు పుల్‌స్టాప్‌ పెట్టవచ్చని అంటున్నారు.

అసలు ఫోన్‌ నెంబర్లతో వీళ్లేం చేస్తారంటే..
చేతి తిరిగిన నైజీరియన్‌ హ్యాకర్లు మెయిల్‌ ఐడీలు లక్ష్యంగా ఈ విధమైన మోసాలకు పాల్పడుతున్నారు. సులువైన పాస్‌వర్డ్‌ ఉన్నవాటిని తేలికగా హ్యాక్‌ చేసి వాటి సాయంతో బ్యాంకు ఖాతా, ఫోన్‌ నంబర్లను సేకరిస్తారు. అలా సేకరించిన సమాచారాన్ని రాజస్థాన్‌, ఢిల్లీలోని సైబర్‌ నేరస్థులకు చేరవేస్తారు. ఆయా సెల్‌నంబర్లకు వేర్వేరు సిమ్‌కార్డుల నుంచి 5 సార్లు ఫోన్లు చేస్తారు. వాటి ఆధారంగా సమీపంలోని సర్వీస్‌ప్రొవైడర్‌ ఆఫీస్‌కు వెళ్లి తమ సెల్‌ఫోన్‌ పోయిందని, సిమ్‌కార్డు బ్లాక్‌ చేయమని కోరతారు. సర్వీస్‌ ప్రొవైడర్ల నిబంధనల ప్రకారం చివరిగా ఫోన్‌చేసిన 5 నంబర్లు అడుగుతారు. వాటి ద్వారా అదే నంబర్‌తో కొత్త సిమ్‌లు సేకరిస్తారు. ఇలా సేకరించిన సిమ్‌ కార్డులను ఫోన్‌ వేస్తారు. బ్యాంకు లావాదేవీల సమయంలో ఆ నెంబర్‌కు ఓటీపీలు వస్తాయి. అలా వచ్చిన ఓటీపీతో ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఇలాంటి మోసాలు నిందితులు శని, ఆదివారాల్లో మాత్రమే చేస్తారు. ఈ రెండు రోజులు బ్యాంకులకు సెలవు దినాలు. బాధితులు ఫోన్‌ చేసినా బ్యాంకు సేవలు పొందేందుకు ఆలస్యమవుతుండటమే అందుకు కారణం.

ఈ మోసాల నుంచి బయటపడాలంటే..
గుర్తు తెలియని ఫోన్ల ఉంచి ఐదు ఫోన్‌కాల్స్‌ వస్తే వెంటనే అప్రమత్తం కావాలి. వరుసగా రెండుమూడ్రోజులు సిమ్‌ పనిచేయకపోతే వెంటనే సర్వీస్‌ ప్రొవైడర్‌కు ఫిర్యాదు చేయాలి. బ్యాంకు ఖాతా నుంచి ఆన్‌లైన్‌ సేవలు నిర్వహించకుండా ఆ నంబర్‌ను బ్లాక్‌ చేయాలి. అలాగే బ్యాంకులపేరిట వచ్చే లింకులను క్లిక్‌ చేయకూడదు. ఎవరైనా ఈ తరహాలో మోసపోతే వెంటనే1930 నంబరుకు ఫిర్యాదు చేయాలని సైబర్‌ క్రైం పోలీసులు సూచిస్తున్నారు.