DailyDose

నవదీప్ ఇంట్లో నార్కోటిక్స్ అధికారుల సోదాలు-నేరవార్తలు

నవదీప్ ఇంట్లో నార్కోటిక్స్ అధికారుల సోదాలు-నేరవార్తలు

* జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రమూకలకు మధ్య ఏడురోజులుగా జరుగుతోన్న ఎన్‌కౌంటర్ కొలిక్కి వచ్చింది. లష్కరే తొయిబా కమాండర్ ఉజైర్‌ ఖాన్‌(Lashkar commander Uzair Khan)ను హతమార్చడంతో ఈ ఎన్‌కౌంటర్‌ ముగిసింది. అతడిని మట్టుపెట్టిన విషయాన్ని ఏడీజీపీ పోలీస్ విజయ్‌ కుమార్ ధ్రువీకరించారు. ఇప్పటికీ గాలింపు కొనసాగుతోందని, ప్రజలు అటువైపుగా వెళ్లొద్దని కోరారు. కాల్పులు ముగిసిన తర్వాత భద్రతా సిబ్బంది రెండు మృతదేహాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ రెండు మృతదేహాల్లో ఒకటి ఉజైర్ ఖాన్‌ది అని తెలిపారు. అనంతనాగ్‌(Anantnag) జిల్లాలోని కొకెర్‌నాగ్‌ ప్రాంతంలో దాక్కున్న ముష్కరులను ఏరివేసేందుకు భద్రతా సిబ్బంది గత మంగళవారం వేట మొదలుపెట్టారు. ఆ మరుసటి రోజు(సెప్టెంబర్‌ 13) ఉదయం ఓ రహస్య ప్రాంతంలో వారు నక్కి ఉన్నట్లు సమాచారం అందింది.

* జీ20 సదస్సు వేదికగా రాజుకొన్న భారత్‌-కెనడా విభేదాలు నేడు మరింత భగ్గుమన్నాయి. గత నెల ఖలిస్థానీ మద్దతుదారులు బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రేలో లక్ష్మీనారాయణ మందిర్‌ను ధ్వంసం చేసి.. ‘‘జూన్‌ 18 హత్యపై కెనడా దర్యాప్తు చేస్తుంది’’ అని పోస్టర్లు అంటించారు. ఇప్పుడు కెనడా ప్రధాని అదే వాదన తెరపైకి తీసుకొచ్చారు. దీని వెనుక భారత్‌ హస్తం ఉందని ట్రూడో తాజాగా అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ హత్యకు సంబంధించి ఓ భారత దౌత్యవేత్తను తమ దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ప్రకటించడంతో ఈ విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. వీటన్నింటి వెనుక ట్రూడో రాజకీయ బలహీనత కూడా ఓ కారణంగా తెలుస్తోంది. ఓ పార్టీ మెప్పు కోసం కెనడా ప్రధాని.. మొదట్నుంచీ ఖలిస్థానీ విషయంలో పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

* దేశ రాజ‌ధాని ఢిల్లీలో కాల్పుల క‌ల‌క‌లం (Firing) చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలోని న్యూ ఉస్మాన్‌పూర్‌లో ఓ షాపులోకి దూసుకొచ్చిన దుండ‌గులు కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌లో ఏ ఒక్క‌రికీ గాయాలు కాక‌పోవ‌డంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్ర‌కారం ముగ్గురు వ్య‌క్తులు బైక్‌పై షాపు వ‌ద్ద‌కు రాగా ఇద్ద‌రు వ్య‌క్తులు షాపులోకి దూసుకొచ్చి మూడు రౌండ్ల కాల్పులు జ‌రిపారు. ఆ స‌మ‌యంలో షాపు తెరిచిఉన్నా ఫ్రంట్ గ్లాస్ డోర్స్‌పైకి దుండ‌గులు కాల్పులు జ‌రిపారు. ఘ‌ట‌నా స్ధ‌లం నుంచి పారిపోయే ముందు వారు గాలిలోకి ఒక రౌండ్ కాల్పులు జ‌రిపారు. ఫైరింగ్‌పై పోలీసు కంట్రోల్ రూంకు స‌మాచారం అందించ‌డంతో ఘ‌ట‌నా స్ధ‌లానికి చేరుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టామ‌ని పోలీసులు తెలిపారు.

* జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండగా ఓ వ్యక్తిని దుండగులు వేట కొవడళ్లతో నరికి చంపారు. ఈ విషాదకర సంఘటన రామగుండం మండలం ఎన్టీపీసీ పట్టణ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. ఎన్టీపీసీ పట్టణం పరిధి 39 డివిజన్ కాజీపల్లికి చెందిన మేకల లింగయ్య అనే వ్యక్తి సోమవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. రాత్రి 9 గంటల సమయంలో మేకల లింగయ్య కాజిపల్లి గ్రామ శివారులో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాకింగ్ చేస్తున్నాడు. ఇదే సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు వెనకాల నుంచి వచ్చి తలపై వేట కొడవళ్లతో దాడి చేసి హతమార్చారు. సమాచారం అందుకున్న గోదావరిఖని ఏసీపీ తూల శ్రీనివాసరావు, రామగుండం సీఐ చంద్రశేఖర్ గౌడ్, ఎన్టీపీసీ ఎస్ఐ జీవన్, ఘటన స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్‌తో దర్యాప్తు చేపట్టారు. భూమి వివాదాలే ఈ హత్యకు దారి తీసినట్టుగా తెలుస్తున్నది. ఈ హత్యపై పోలీసులు ఒకరిద్దరు హంతకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

* హీరో నవదీప్‌ ఇంట్లో నార్కోటిక్స్‌ బ్యూరో (Narcotic Bureau) అధికారులు సోదాలు నిర్వహించారు. మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో (Madapur Drugs Case) నవదీప్‌ 37వ నిందితుడిగా ఉన్నాడు. పోలీసులు సోదాలు చేసే సమయంలో నవదీప్ ఇంట్లో లేరని తెలుస్తున్నది. అయితే తనను అరెస్టు చేయవద్దు అంటూ ఇప్పటికే ఆయన కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇదే కేసులో నిందితుడు రాంచంద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రాంచంద్‌ నుంచి నవదీప్‌ డ్రగ్స్‌ కొన్నట్లు నార్కోటిక్‌ బ్యూరో చెబుతున్నది. దీనికి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. కాగా, ఈ కేసులో నవదీప్ మరోసారి హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నార్కోటిక్ పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేయనున్నారు. హైదరాబాద్‌లో ఇటీవల వెలుగు చూసిన డ్రగ్స్‌ రాకెట్‌ వ్యవహారంలో పలువురు ఫైనాన్షియర్లు పట్టుబడ్డారు. ఆగస్టు 31న మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఫ్రెష్ లివింగ్‌ అపార్ట్‌మెంట్‌లో జరిగిన రేవ్ పార్టీని తెలంగాణ స్టేట్ నార్కోటిక్ బ్యూరో భగ్నం చేసింది. స్థానిక పోలీసులతో కలిసి జరిపిన దాడుల్లో సినీ నిర్మాత వెంకట్‌తో పాటు మరో ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారంతా డ్రగ్స్‌ వినియోగిస్తున్నట్లు గుర్తించారు.