Politics

దసపల్లా భూములపై పోరు

దసపల్లా భూములపై పోరు

నిషేధిత జాబితా(22ఏ) నుంచి బయటపడిన దసపల్లా భూములపై వైకాపాలో ఆధిపత్య పోరు మొదలైంది. విశాఖ నగరం మధ్యనున్న విలువైన ఈ భూముల వ్యవహారంలో వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిల మధ్య అంతర్యుద్ధం నడుస్తోంది. ఆ భూములు రాణి కమలాదేవికి చెందినవని, ఆమె వారసుల నుంచి కొనుగోలు చేశామంటూ ఇప్పటికే దక్కించుకున్న ఓ వర్గానికి విజయసాయి సహకరిస్తుంటే… తాజాగా ఆ భూముల్లో రాణి సాహిబా ఆఫ్‌ వాద్వాన్‌ వారసుల పేరుతో బోర్డులు వెలిశాయి. వీరికి వైవీ మద్దతుగా నిలిచారు. దీంతో ఈ పంచాయితీ కాస్త ఇటీవల తాడేపల్లి ప్యాలెస్‌కు చేరింది. ఎన్నో వివాదాల మధ్య దసపల్లా భూముల్లో 15 ఎకరాలను ఇటీవల ఓ వర్గం దక్కించుకుంది. వాటి విలువ దాదాపు రూ.2వేల కోట్లుంటుంది. ఇందులో కొంత భూమిపై రాణి కమలాదేవి వారసుల తరఫు నుంచి తనకూ హక్కు ఉందంటూ ఓ వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే.. ఈ వ్యక్తి నకిలీ డాక్యుమెంట్లతో భూమి కోసం యత్నిస్తున్నారంటూ రాణి కమలాదేవి పేరుతో ఈ ఏడాది కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు రాణి కమలాదేవి చేయలేదని, ఆమె సంతకం ఫోర్జరీ చేసినట్లుగా గుర్తించారు. ఎంపీ విజయసాయిరెడ్డి మద్దతిస్తున్న వర్గంలోని కీలక వ్యక్తే సంతకం ఫోర్జరీ చేసినట్లు నిర్ధారించారు. దీంతో ఫోర్జరీ సంతకం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకొని, దసపల్లా భూముల్లోని తన స్థలాన్ని అప్పగించాలని వైవీ వర్గానికి చెందిన వ్యక్తి ఇటీవల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.