ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమ్‌ఇండియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఆసీస్‌పై 99 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు వన్డేల సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. అనంతరం ఆసీస్ ఇన్నింగ్స్‌లో 9 ఓవర్ల ఆట పూర్తయిన తర్వాత మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో ఆటను 33 ఓవర్లకు కుదించి 317 పరుగులు లక్ష్యంగా నిర్దేశించారు. ఈ లక్ష్యఛేదనలో ఆసీస్ 28.2 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటైంది.
భారత బౌలర్ల ధాటికి 140 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి కంగారుల జట్టు.. 150లోపే చాపచుట్టేసేలా కనిపించింది. కానీ, బౌలింగ్ ఆల్‌రౌండర్ సీన్ అబాట్ (54; 36 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) అనుహ్యంగా చెలరేగాడు. టాపార్డర్‌లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (53; 39 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకంతో మెరవగా.. లబుషేన్ (27) పరుగులు చేశాడు. భారత బౌలర్లలో జడేజా 3, అశ్విన్ 3, ప్రసిద్ధ్ కృష్ణ 2, షమి ఒకటి చొప్పున వికెట్ పడగొట్టారు.
రుతురాజ్ గైక్వాడ్ (8) మినహా మిగతా బ్యాటర్లందరూ రాణించడంతో వన్డేల్లో ఆసీస్‌పై భారత్ అత్యధిక స్కోరును సాధించింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (104; 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), వన్‌డౌన్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (105; 90 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకాలతో విరుచుకుపడ్డారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (52; 38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్ (72*; 37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) వరుసగా రెండో మ్యాచ్‌లో అర్ధ శతకాలు సాధించారు. ఇషాన్ కిషన్ (31; 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా దూకుడుగా ఆడాడు. రెండో వికెట్‌కు గిల్, శ్రేయస్ 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కామెరూన్ గ్రీన్ వేసిన 44 ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్ వరుసగా నాలుగు సిక్సర్లు బాదడం విశేషం. ఆసీస్ బౌలర్లలో కామెరూన్ గ్రీన్ 2, ఆడమ్ జంపా, సీన్ అబాట్, హేజిల్‌వుడ్ ఒక్కో వికెట్ తీశారు.