హిందూ, రోమన్, గ్రీకు దేవతలందరి చేతులలో ఆయుధాలుంటాయి. ఈ మతాలలో సనానత ధర్మము ప్రాచీనమైనది. సనానతన ధర్మములో అనేకమంది దేవతలున్నారు. దేవీ లేదా దేవుడు ఒక ప్రత్యేక కార్యము కొరకు ఉద్భవించినవారే. వారి చివరి లక్ష్యం దుష్టశిక్షణ శిష్టరక్షణ మాత్రమే. మంచివారి రక్షణకు దేవతలు అభయ వరద ముద్రలలో వుంటారు.దుష్టరక్షణకు మాత్రము అనేక బాహువులు అంటే చేతులు కలిగి వాటిలో భిన్నరూపాలైన ఆయుధాలు ధరించి వుంటారు. (1) ఆయుధాలు శక్తికి (Power /strength), ఆర్తుల రక్షణకు చిహ్నాలు. ఆయుధధారణ అనేది ఈ విశ్వంలో చరాచర రూపంలో వున్న చెడును నిర్మూలించి ధర్మాన్ని స్థాపించటానికి గుర్తు. (2) అజ్ఞానాన్ని అంధకారాన్ని, అహన్ని నిర్మూలించి ఈ విశ్వాన్ని దుష్టత్వం నుండి కాపాడటానికి దేవతలు ఏదో ఒక ఆయుధాన్ని ధరిస్తారు. (3) అజ్ఞానాన్ని రూపుమాపేదేదనైనా ఆయుధమే.అవిద్య అనే అజ్ఞానాన్ని పారద్రోలటానికి సరస్వతిదేవి పుస్తకాన్ని ధరించి వుంటుంది. (4) పతనమైపోతున్న సామాజిక ధార్మిక నైతిక విలువలను కాపాడి ధర్మప్రతిష్ఠాపనకే ఈ ఆయుధాలని హిందూధర్మం తెలియచేస్తోంది. (3)దుష్టరక్షణకు దేవీదేవతల బాహువులలోనే కాదు వారి అమ్ములపొదిలో కూడా ఆయుధాలుంటాయి. ఉదా॥ రామరావణ యుద్ధంలో బ్రాహ్మస్త్రం, బ్రహ్మదండం, ఆగ్నేయాస్త్రం, పినాకం, నాగాస్త్రం, వారుణాస్త్రం, దివ్యవిమానం, గద, చింతామణి వంటి ఆయుధాలు వుపయోగించడం జరిగింది. బ్రహ్మదండాన్ని శ్రీరాముడు మారీచుడిపై ప్రయోగించాడు, పాశుపతాస్త్రాన్ని ఇంద్రజిత్తుపైన, వారుణాస్త్రాన్ని సముద్రుడిపైన శ్రీరాముడు సంధించాడు. నాగాస్త్రాన్ని లక్ష్మణుడిపైన, హనుమను బంధించడానికి బ్రహ్మస్త్రాన్ని ఇంద్రజిత్తు ప్రయోగించాడు. ఇంకా ఆంజనేయుడి వద్ద సకల శుభాలు విజయాలు అందించగల చింతామణి,గద వుండేవి. హిందూధర్మములో దుష్టశిక్షణకే ఆవిర్భవించిన దేవత కాళి. కాళికాదేవి మహాకాళి,దక్షిణకాళి, భద్రకాళి, శ్యామకాళి, చిన్మయ, కాపాలిని, ఘోరకాళి, రక్షకాళి,కమలకాళి, మాతంగి, భైరవి వంటి రుపాలలో దర్శనమిస్తుంది. జానపదులు పూజిస్తున్న చౌడమ్మ, పెద్దమ్మ, కొల్లాపురమ్మ, చొప్పలమ్మ మొదలైన రూపాలు కూడా కాళిక అంశాలే. మహాకాళి లేదా కాళికామాత చేతులలో (1) ఖడ్గము (2) త్రిశూలము (3) శూలము (ఈటె) (4) ధనుస్సు (5) బాణము (6) కవచము (7) ముండమాల (పుర్రెలహారం) (8) కత్తి (9) గద (10) డమరం (11) నాగ (12) కమండలం (13) గంట (14) శంఖం (15) అర్ధచంద్రాకార కొడవలి (16) అగ్ని మొదలైన ఆయుధాలు ధరించి వుంటుంది.