DailyDose

 5.62కోట్ల విలువైన వజ్రాలు చోరీ-నేర వార్తలు

 5.62కోట్ల విలువైన వజ్రాలు చోరీ-నేర వార్తలు

* 5.62కోట్ల విలువైన వజ్రాలు చోరీ

ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని జేబీ అండ్ బ్రదర్స్ డైమండ్ స్టోర్లో సుమారు రూ.5.62కోట్ల విలువైన వజ్రాలు చోరీకి గురయ్యాయి. సుమారు 6 నెలల వ్యవధిలో ఈ వజ్రాలు మాయమైనట్లు సదరు స్టోర్ డైరెక్టర్ సంజయ్ షా బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే, సంస్థ ఉద్యోగులు ప్రశాంత్ షా, విశాల్ షా కలిసి ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

కలెక్టర్ ఇంట్లో చోరీ

బదిలీపై మరోచోటికి వెళ్లేందుకు సామాన్లు సర్దుకున్న కలెక్టర్ ఇంట్లో చోరీ జరిగింది. ఎన్నికల వేళ బదిలీ అయి అసలే టెన్షన్ లో ఉన్న కరీంనగర్ కలెక్టర్ గోపీ ఇంట్లో దొంగలు పడ్డారు. ల్యాప్ టాప్ తో పాటు కలెక్టర్ కు చెందిన పలు డాక్యుమెంట్లను దొంగలు ఎత్తుకెళ్లినట్లు సీసీ టీపీ ఫుటేజ్ లో బయటపడింది. ఎన్నికల సంఘం తీసుకున్న చర్యల్లో భాగంగా కరీంనగర్ కలెక్టర్ గోపీ బదిలీ అయిన విషయం తెలిసిందే.  బుధవారం ఆయన హైదరాబాద్ లో రిపోర్ట్ చేయాలి. దీని కోసం తన సామాన్లన్నింటిని రెడీ చేసుకుని ఆయన హాయిగా బెడ్ రూమ్ లో నిద్రపోతున్నారు. అర్ధరాత్రి టైమ్ లో దొంగలు  వెనుకవైపు గోడ నుంచి కలెక్టర్ బంగ్లా లోపలికి ఎంటర్ అయ్యారు. ఇంట్లో ముందు రూమ్ లో ఉంచిన కలెక్టర్  ల్యాప్ టాప్ తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఉన్న బ్యాగు, మరికొన్ని వస్తువులు దొంగిలించారు. దొంగలే వస్తువులు చోరీ చేసినట్టు సీసీ టీవీలో రికార్ట్ అయింది. ఇరవై నాలుగు  గంటలు పోలీసు పహారాలో ఉండే కలెక్టర్ బంగ్లాలో దొంగలు పడడం సంచలనంగా మారింది. చోరీపై కలెక్టర్ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  చేస్తున్నారు.

హ్యాకింగ్‌ వివాదంపై భాజపా విమర్శలు

 దేశవ్యాప్తంగా విపక్ష నేతల ఐఫోన్లకు హ్యాక్‌ అలర్ట్‌ మెసేజ్‌లు రావడం కలకలం సృష్టించింది. దీనిపై కాంగ్రెస్‌(Congress) చేస్తోన్న విమర్శలకు భాజపా(BJP) కౌంటర్ ఇచ్చింది. హస్తం పార్టీకి గతం గుర్తులేదా..? అంటూ ప్రశ్నించింది.తమ యాపిల్‌ ఫోన్లను హ్యాక్‌ చేసేందుకు ప్రభుత్వ ప్రాయోజిత వ్యక్తుల ద్వారా ప్రయత్నం జరిగిందని మంగళవారం పలువురు విపక్ష నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం స్పందిస్తూ.. ‘పలువురు విపక్ష నేతలకు అలర్ట్ మెసేజ్‌లు రావడం విస్మరించలేనిది. విపక్ష నేతలకు మాత్రమే ఎందుకు ఈ సందేశాలు వచ్చాయి..? విపక్ష నేతల ఫోన్లపై ఎవరు ఆసక్తి చూపుతారు. పెగాసస్ మిస్టరీ తర్వాత ప్రస్తుతం వేళ్లన్నీ ప్రభుత్వం వైపే చూపిస్తున్నాయి’ అని విమర్శించారు. దీనిపై భాజపా ఐటీ సెల్‌ చీఫ్ గట్టి బదులిచ్చారు. అప్పటి ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ తన కార్యాలయంలో బగ్‌ను చొప్పించారనే అనుమానాన్ని వ్యక్తం చేశారంటూ గతాన్ని గుర్తుచేశారు.2008 నుంచి 2012 మధ్య కాంగ్రెస్ హయాంలో చిదంబరం కేంద్ర హోం మంత్రిగా విధులు నిర్వర్తించారు. 2009 నుంచి 2012 మధ్య ప్రణబ్‌ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా సేవలు అందించారు. ఈ క్రమంలో 2011లో జాతీయ మీడియాలో ప్రచురితమైన కథనాన్ని ప్రస్తావిస్తూ..‘ప్రణబ్‌ ముఖర్జీ తన కార్యాలయంలో బగ్‌ను చొప్పించారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. దానిపై విచారణ జరిపించాలని కోరారు’ అని మాలవీయ ట్వీట్ చేశారు. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై సొంత మంత్రే ఆరోపణలు చేశారనే ఉద్దేశంతో ఈ విషయాన్ని మాలవీయ గుర్తుచేశారు. ప్రణబ్‌ ముఖర్జీ తర్వాత కాలంలో భారత రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. 

పెళ్లి పీఠలెక్కిన ఇన్స్టాగ్రామ్ ప్రేమ

సోషల్ మీడియా వచ్చాక ప్రేమ వ్యవహారాలు పెరుగుతున్నాయి. పేస్ బుక్ లో పరిచయం, ఇన్స్టాగ్రామ్ లో ప్రేమ, వాట్సప్ లో అభిప్రాయాలను పంచుకుంటూ ఒకరినినొకరు అర్ధమే చేసుకోవడం.. ఆపై అర్ధాంతరంగా పెళ్లి చేసుకోవడం.. ప్రస్తుతం ట్రెండ్ గా మారింది. అయితే ఈ ట్రెండ్ కొందరికి మంచి లైఫ్ ని ఇస్తే ఎందరికో చేదు అనుభవాలని రుచిచూపించి జీవితాన్ని నాశనం చేస్తుంది. సోషల్ మీడియా ప్రేమ కథలు.. ఆ కథలు విషాద సంచికలో చేరిన ఘటనలు గతంలో కోకొల్లలు.. అలాంటి ఘటనే తాజాగా మరోసారి వెలుగు చూసింది. ఇంస్టాగ్రామ్ లో ప్రేమ పెళ్లి పీఠలెక్కిన అతి కొద్ది కాలం లోనే ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.ఈ ఘటన కర్నూలులో వెలుగు చూసింది. వివరాల లోకి వెళ్తే.. సత్యసాయి జిల్లా నెలకోట తండాకు చెందిన షణ్ముఖ నాయక్ (21) అనే యువకుడికి గుంతకల్లు మండలం లోని వెంకటాంపల్లి కి చెందిన రమణమ్మతో ఇంస్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడినది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో ఇద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. కాగా రెండు నెలలుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో షణ్ముఖ నాయక్ (21) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీనితో రమణమ్మనే షణ్ముఖ నాయక్ ని హత్యా చేసిందని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా రమణమ్మ కర్నూలులో బీఎస్సీ నర్సింగ్ చేస్తున్నది.

ఉలిక్కిపడ్డ మణిపూర్‌

జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడికి ఇప్పుడిప్పుడే తిరిగి కోలుకుంటున్న మణిపూర్‌ మరోసారి ఉలిక్కిపడింది. మయనార్మ్‌తో సరిహద్దులకు సమీపంలోని మోరే ప్రాంతంలో చొరబాటుదారులు ఘాతుకానికి పాల్పడ్డారు. హెలిప్యాడ్ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న పోలీసు అధికారి ఆనంద్‌‌పై కాల్పులకు తెగబడ్డారు.ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. పోలీసు అధికారిని చొరబాటుదారులు కాల్చిచంపడంపై సీఎం దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నిందితులను శిక్షిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రివర్గంతో అత్యవసర సమావేశం నిర్వహించిన సీఎం.. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద వరల్డ్ కుకీ- జో ఇంటలెక్చువల్ కౌన్సిల్ సంస్థను చట్టవ్యతిరేక సంస్థగా కేబినెట్ ప్రతిపాదించింది.

పోలీస్‌ను కొట్టి అరెస్టైన వ్యక్తులు

 పోలీస్‌ను కొట్టినందుకు అరెస్టైన వ్యక్తుల్లో ఇద్దరు గన్స్‌ లాక్కొని ముగ్గురు పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో ఆ ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. (Men Shoot Policemen) ప్రతిగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సోమవారం ఒక చిన్నారిని బస్సు ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో స్థానికులు ఆగ్రహంతో రగిలిపోయారు. రోడ్డుపై ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్‌ జామ్‌ నివారించేందుకు ప్రయత్నించగా స్థానికులు పోలీసులపై తిరగబడ్డారు. ఒక పోలీస్‌ అధికారిని కొందరు కొట్టారు. దీంతో మిగతా పోలీసులు అక్కడి నుంచి పారిపోయారు.కాగా, పోలీస్‌ను బహిరంగంగా కొట్టిన గుంపులోని ఐదుగురు వ్యక్తులను అనంతరం అరెస్ట్‌ చేశారు. వారిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు పోలీసుల నుంచి గన్స్‌ లాక్కొని కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. వెంటనే అలెర్ట్‌ అయిన మిగతా పోలీసులు ఆ ఇద్దరు వ్యక్తుల కాళ్లపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కాల్పుల్లో గాయపడిన ఎస్‌ఐ సురేంద్ర, కానిస్టేబుళ్లు అంకిత్ సింగ్, మిథున్‌తో పాటు ఇద్దరు వ్యక్తులను ఆసుపత్రిలో అడ్మిట్‌ చేసి చికిత్స అందిస్తున్నారు. పోలీసులపై కాల్పులు జరిపిన ఆ ఇద్దరు వ్యక్తులపై అదనంగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, పోలీస్‌ను కొట్టడం, కాల్పుల్లో గాయపడిన పోలీసులు, వ్యక్తులు ఆసుప్రతిలో అడ్మిట్‌ అయిన వీడియో క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

*  వివాహిత దారుణ హత్య

పెనుగొండ శివారు అడ్డపుంత బోదే వద్ద వివాహిత హత్యకు గురైంది. హత్యచేసి పంటబోదేలో పాడేసి హంతుకులు పరారయ్యారు. వివరాల్లోకి వెళితే మంగళవారం ఉదయం అడ్డపుంతలో గుత్తుల చిన సత్యనారాయణ కౌలు చేస్తున్న పంట బోదేలో ఓ మహిళ మృతదేహం ఉందని గమనించిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. 25 ఏళ్లు వయస్సు ఉంటుందని భావించిన మహిళ శవం బోర్లా పడి పంటబోదేలో తేలుతూ ఉండడంతో సంచలనంగా మారింది.మహిళ వీపుపైనా, ఎడమ భుజంపైనా, చాతిపైన పదునైన ఆయుధంతో పొడిచిన గాయాలు ఉన్నాయి. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ కె.రవిమనోహరచారి, సీఐ జీవీవీ నాగేశ్వరరావు, ఎస్సై ఎస్‌ఎన్‌వీవీ రమేష్‌ పరిశీలించి, వీఆర్వో ప్రసాద్‌ ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని మహిళ మృతదేహంగా కేసు నమోదు చేశారు. ఎస్పీ యు.రవిప్రకాష్‌ హుటాహుటిన పెనుగొండ చేరుకుని సంఘటన ప్రాంతాన్ని సందర్శించి వివరాలు సేకరించారు.అయితే సాయంత్రానికి మృతురాలు చివటం నందినిగా గుర్తించారు. పోలీసుల అదుపులో ఆమె భర్త చివటం రాంప్రసాద్‌ ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం. దొంగరావిపాలెంకు చెందిన పితాని నందినిను చివటం రాంప్రసాద్‌ 2019లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్యపై అనుమానంతోనే హత్య చేసి ఉండొచ్చు అని అనుమానిస్తున్నారు.   వీరికి 18 నెలలు కుమారుడు సైతం ఉన్నాడు. చివటం రాంప్రసాద్‌ హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. పోలీసులు కేసు విచారణ జరుపుతున్నామని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

*  ఆగి ఉన్న ఇసుక లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

ఆగి ఉన్న ఇసుక లారీని వెనుక నుంచి బస్సు ఢీకొన్న ఘటన బుధవారం నారాయణాఖేడ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని సమీపంలోని డీఎస్పీ ఆఫీస్ వద్ద ఆగి ఉన్న ఇసుక లారీని వెనుక నుంచి దుబ్బాక డిపో బస్సు ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న 30 మందిలో పదిమందికి గాయాలయ్యాయి.దీంతో సంఘటన స్థలానికి డీఎస్పీ వెంకటరెడ్డి, సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై విద్యా చరణ్ రెడ్డి లు చేరుకుని గాయపడ్డ వారిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. లారీని బస్సును జేసీబీ సాయంతో పక్కకు తొలగించి రహదారిని క్లియర్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తనయుడు రోషన్ రెడ్డి పరామర్శించారు.