DailyDose

బీసీలకు రాహుల్ క్షమాపణ చెప్పాలి-తాజా వార్తలు

బీసీలకు రాహుల్ క్షమాపణ చెప్పాలి-తాజా వార్తలు

* విశాఖలో ఐసీఐడీ కాంగ్రెస్‌ ప్లీనరీ

విశాఖపట్నం మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక అయ్యింది.. రుషికొండ ఐటీ హిల్స్‌లోని రాడిసన్‌ బ్లూ హోటల్‌లో ఐసీఐడీ కాంగ్రెస్‌ ప్లీనరీ ప్రారంభమైంది.. విశాఖ వేదికగా ఇవాళ్టి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు 25వ ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజ్‌ సదస్సు జరగనుంది.. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్‌తో పాటు రాష్ట్ర మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజనీ, గుడివాడ అమర్నాథ్, దేశవిదేశాలకు చెందిన 1200 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.57 ఏళ్ల తర్వాత భారత్‌లో జరుగుతున్న ఈ సదస్సు విశాఖలో జరుగుతుండడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌, అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సదస్సును ప్రారంభించిన సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. నీటి పారుదల రంగంపై సదస్సు జరగడం శుభపరిణామం అన్నారు.. సదస్సులో పాల్గొన్న దేశ, విదేశీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.. ఆంధ్రప్రదేశ్‌లో తమ ప్రభుత్వం సాగునీటి రంగం, వ్యవసాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వెల్లడించారు. కాగా, 90 దేశాల నుంచి ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు ఈ సదస్సుకు హాజరు కాగా.. నీటి ఎద్దడిని అధిగమించడం, అధిక దిగుబడులే అజెండాగా చర్చలు సాగనున్నాయి..

* బీసీలకు రాహుల్ క్షమాపణ చెప్పాలి

అధికారంలోకి వస్తే ఓబీసీ కులగణన చేపడతామంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వింటే నవ్వొస్తోందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ (Bandi Sanjay) ఎద్దేవా చేశారు. దేశాన్ని 50 ఏళ్లకుపైగా పాలించిన పార్టీ కాంగ్రెస్సే అయినా ఏనాడూ ఓబీసీ కులగణన చేయాలనే ఆలోచన చేయలేదన్నారు. అధికారం కోల్పోయి పార్టీ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని తెలిసి ఓబీసీల జపం చేస్తున్నారని విమర్శించారు.ఇది కాంగ్రెస్ పార్టీ స్వార్ధ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనమన్నారు. తెలంగాణలో 2 శాతం ఓట్లు కూడా రాని భాజపా బీసీని సీఎం ఎట్లా చేస్తుందని రాహుల్ చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఒక ప్రకటనలో సంజయ్‌ మండిపడ్డారు. మొన్న కేసీఆర్ కుమారుడు కేటీఆర్‌, నిన్న రాహుల్ చేసిన వ్యాఖ్యలు.. తెలంగాణలో బీసీని సీఎం కాకుండా చేస్తున్న కుట్రలో భాగంగానే ఉన్నాయని విమర్శించారు. బీసీలకు తక్షణమే రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆ తరువాతే బీసీల ఓట్లు అడగాలన్నారు.

* యశోద హాస్పిటల్‌కి వెళ్లిన హరీష్ రావు

మెదక్ ఎంపీ బిఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి క్షేమచారాలను తెలుసుకునేందుకు యశోద హాస్పిటల్ కి వెళ్లారు మంత్రి హరీష్ రావు. ఎంపీ ఆరోగ్య పరిస్ధితిపై ఆరా తీసిన ఆయన.. క్షేమ సమాచారాలు తెలుసుకొని ప్రభాకర్ రెడ్డిని పరామర్శించి వెళ్లారు.

* మేడిగడ్డపై రాహుల్ గాంధీ సంచలన ట్వీట్

మేడిగడ్డపై రాహుల్ గాంధీ సంచలన ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ కు కాలేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంలా మారిందని రాహుల్ గాంధీ విమర్శించారు. ‘తెలంగాణ సంపద దోపిడికి గురవుతోంది. కేసీఆర్ దోచుకున్న సొమ్మును మహిళల ఖాతాల్లో వేస్తాం. దోరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. BRS, BJP, MIM… మూడు ఒకటే’ అని రాహుల్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ = కేసీఆర్ కుటుంబం ATM.. తెలంగాణలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీని నేను సందర్శించానని ఈ ట్వీట్‌ లో పేర్కొన్నారు రాహుల్‌ గాంధీ. నాసిరకం నిర్మాణం కారణంగా పలు పిల్లర్లు పగుళ్లు ఏర్పడ్డాయని ఫైర్‌ అయ్యారు. తెలంగాణ ప్రజలను దోచుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్.. ఆయన కుటుంబం తమ వ్యక్తిగత ఏటీఎంగా వాడుకుంటున్నారని చెప్పారు రాహుల్‌ గాంధీ. ఈ మేరకు మేడిగడ్డ బ్యారేజిపై దిగిన ఫోటోలను షేర్‌ చేశారు రాహుల్‌ గాంధీ.

* ఈడీ విచారణకు గైర్హాజరైన కేజ్రీవాల్‌

మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. ఈడీ నోటీసులు చట్టవిరుద్ధమని, పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని అన్నారు. బీజేపీ (BJP) ఆదేశాల మేరకే ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకోవడానికే నోటీసులు జారీచేశారని ఆరోపించారు. సమన్లు వెంటనే వెనక్కీ తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధమున్న మనీలాండరింగ్‌ కేసులో కేజ్రీవాల్‌కు అక్టోబర్‌ 30న ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆదేశించింది. అయితే విచారణకు గైర్హాజరైన ఆయన.. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ మేరకు మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు పయణమయ్యారు. పంజాబ్‌ సీఎం భగవంత్‌ సింగ్‌ మాన్‌తో కలిసి మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి రోడ్డుషోలో పాల్గొంటారు.

* తెలంగాణలో పొత్తులపై నారాయణ సెటైర్

తెలంగాణలో పొత్తుల రాజకీయాలు ఆసక్తిగా మారాయి. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్‌తో కలిసున్న వామపక్షాలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జతకట్టేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. కానీ అసెంబ్లీ సెగ్మెంట్ల సీట్ల పంపకాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇంకా తేల్చడం లేదు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి సీట్లు, పొత్తు విషయంలో ఇవాళో, రేపో అన్నట్లుగా వామపక్షాలు అల్టిమేటం జారీ చేశాయి.ఈ సీట్ల వ్యవహారం నడుస్తోన్న క్రమంలోనే ఇవాళ సోషల్ మీడియా వేదికగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కాంగ్రెస్ పొత్తుపై పరోక్షంగా సెటైర్లు వేశారు. నిశ్చితార్ధం అయ్యాక ఇంకో అందమయిన అమ్మాయి గాని అబ్బాయిగాని దొరికితే లాగేసుకుని పోవడం వ్యక్తి జీవితంలో అక్కడక్కడా జరగచ్చేమో మరి వ్యవస్థను కాపాడే తాజా రాజకీయాలలో కుడా జరిగితే ఎలా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ తీరుపై నారాయణ ఈ తరహా విమర్శలు చేయడం గమనార్హం. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై స్పష్టత ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ వెనక్కి తగ్గడంపై నారాయణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

* బెంగుళూరులో జికా వైర‌స్‌

బెంగళూరు సమీపంలో జికా వైరస్ కలకలం రేపింది. చిక్కబళ్లాపూర్ పరిధిలోని ఓ దోమలో జికా వైరస్‌ బయటపడినట్లు వైద్యులు తెలిపారు. దీంతో తెల్కబెట్టా పరిధిలోని ఐదు కిలోమీటర్ల మేర వైద్య ఆరోగ్యశాఖ అలర్డ్ జారీ చేసింది. అనుమానాస్పద జ్వరం కేసులను పరీక్షలకు పంపాలని ఆదేశించారు.రాష్ట్రమంతా కలిపి దాదాపు 100 శాంపిళ్లను పరీక్షలకు పంపాం. చిక్కబళ్లాపూర్‌ నుంచి వచ్చిన ఆరు కేసుల్లో ఒకటి మాత్రమే పాజిటివ్‌గా నమోదైంది.’ అని జిల్లా ఆరోగ్య శాఖా అధికారి డాక్టర్ ఎస్‌ మహేశ్ తెలిపారు. అత్యధిక జ్వరం లక్షణాలు ఉన్న ముగ్గుర్ని పర్యవేక్షణలో ఉంచామని చెప్పారు. ప్రస్తుతం వారు ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు.ఏడెస్ దోమ కాటు ద్వారా జికా వైరస్ వ్యాధి వ్యాపిస్తుంది. ఇది డెంగ్యూ, చికున్‌గున్యా వంటి ఇన్‌ఫెక్షన్లకు కూడా కారణమౌతుంది . 1947లో ఉగాండాలో తొలిసారిగా ఈ వైరస్‌ను గుర్తించారు. గత డిసెంబర్‌లో కర్ణాటకాలోని రాయ్‌చూర్‌ జిల్లాలో ఐదేళ్ల బాలునికి జికా వైరస్ సోకింది. మహారాష్ట్రాలోనూ మరో వ్యక్తి దీని బారిన పడ్డారు.

* బీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు

జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా తొర్రూర్ మండలం, పత్తేపురం గ్రామం కాంగ్రెస్ పార్టీకి చెందిన 3వ వార్డు మెంబర్ కాసారబోయిన మౌనిక, మాజీ వార్డ్ మెంబర్ పూజారి రాజ్ కుమార్, కాసరబోయిన సూరి బాబు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అలాగే గోపాలగిరి గ్రామానికి చెందిన డి.సందీప్ అధ్వర్యంలో 20 మంది, కొడకండ్ల మండలం పాకాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకురాలు గాజుల సుజాత, కొడకండ్ల మండలం చెరువు ముందు తండా గ్రామానికి చెందిన యువకులు తదితరులు పార్టీలో చేరు. వారికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు (Minister Errabelli)గులాబీ కండువాలు కప్పి బీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే దేవరుప్పుల మండలం, రామచంద్రపురం గ్రామానికి చెందిన దోనికెల సోమయ్య, ఉపేంద్ర, ఉడుగుల భాస్కర్, లక్ష్మి, రామక్క తదితరులు బీఆర్‌ఎస్‌లో చేరారు.

* ఇండోనేషియాలో భారీ భూకంపం

ఇండోనేషియాలోని తైమూర్‌లో భారీ భూకంపం వచ్చింది. గురువారం తెల్లవారుజామున 2.34 గంటలకు తైమూర్‌ దీవులకు సమీపంలోని కుపాంగ్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత 6.1గా నమోదైందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. పశ్చివ నుసా టెంగారా ప్రావిన్స్‌ రాజధాని కుపాంగ్‌కు 21 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది. ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే ముప్పు లేదని ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ పేర్కొంది. అర్ధరాత్రి వేల భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలు ప్రాంతాల్లో ఇండ్లు స్వల్పంగా దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. కాగా, 6.6 తీవ్రతతో భూమి కంపించిందని ఇండోనిషియా జియోఫిజిక్స్‌ ఏజెన్సీ తెలిపింది.

* రాహుల్‌కు బీసీలంటే ఎందుకు చిన్నచూపు?

తెలంగాణలో పర్యటిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీసీలకు బీజేపీ ముఖ్యమంత్రి సీటు ప్రతిపాదించడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2 శాతం ఓట్లు కూడా రాని బీజేపీ.. బీసీ అభ్యర్థిని సీఎం ఎలా చేస్తుందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో పెను దుమారం రేపాయి. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఖండించారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు.163 మంది బీసీలను ఎమ్మెల్సీలుగా చేసిన పార్టీ బీజేపీ అని లక్ష్మణ్ స్పష్టం చేశారు. దేశ ప్రజలు మోదీ వైపు చూస్తున్నారని.. రాహుల్‌కు బీసీలంటే ఎందుకు చిన్నచూపు? అని ప్రశ్నించారు. బీసీలకు మాట ఇచ్చి తప్పిన వ్యక్తి కేసీఆర్‌ అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీసీల వ్యతిరేక పార్టీలు అని విమర్శించారు. రెండో జాబితాలో బీసీలకు అధిక స్థానాలు కేటాయిస్తామని వెల్లడించారు. బీజేపీ నుంచి పలువురు నేతలు ఇతర పార్టీల్లో చేరడంపై స్పందిస్తూ.. కొంత మంది పోయినంత మాత్రాన పార్టీకి నష్టం లేదని.. తమ పార్టీలోనూ కాంగ్రెస్ బీఆర్ఎస్ ల నుంచి కీలక నేతలు చేరుతున్నారని లక్ష్మణ్ అన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z