Business

గోల్డ్ బాండ్ల పెట్టుబడిదారులకు శుభవార్త

గోల్డ్ బాండ్ల పెట్టుబడిదారులకు శుభవార్త

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) తీసుకొచ్చిన సావరిన్‌ గోల్డ్‌ బాండ్లలో (Sovereign gold bonds) తొలి విడతలోనే ఇన్వెస్ట్‌ చేసిన వారికి అదిరిపోయే రిటర్న్స్‌ రానున్నాయి. దేశంలో భౌతిక బంగారం కొనుగోళ్లను తగ్గించాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని 2015 నవంబర్‌లో ఆర్‌బీఐ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 8 ఏళ్ల కాలపరిమితితో వస్తున్న ఈ బాండ్ల గడువు ఈ ఏడాది నవంబర్‌ 30తో ముగియనుంది. ప్రస్తుతానికి బాండ్ల మెచ్యూరిటీపై ధరను నిర్ణయించనప్పటికీ.. ప్రస్తుత బంగారం ధర వద్ద లెక్కిస్తే మంచి ప్రతిఫలం లభించే అవకాశం ఉంది.

ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ ఈ గోల్డ్‌ బాండ్లను జారీ చేస్తుంటుంది. ఇందుకోసం సబ్‌స్క్రిప్షన్‌ తేదీలను ప్రకటిస్తుంది. గ్రాము ధర నిర్ణయించేందుకు సబ్‌స్క్రిప్షన్‌ ముందు వారం చివరి మూడు పనిదినాల్లో 999 స్వచ్ఛత కలిగిన బంగారానికి ఇండియా బులియన్‌ అండ్‌ జ్యువెలర్స్‌ అసోసియేషన్‌ లిమిటెడ్‌ నిర్ణయించిన సగటు ధరను పరిగణనలోకి తీసుకుంటుంది. ఇప్పుడు మెచ్యూరిటీ విషయంలోనూ సూత్రం వర్తించనుంది.

2015 నవంబర్‌లో తొలి విడత గోల్డ్‌ బాండ్లను జారీ చేసినప్పుడు గ్రాము ధరను రూ.2684గా నిర్ణయించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేసిన బాండ్ల ఇష్యూ ధరను రూ.5,923గా నిర్ణయించారు. ప్రస్తుతం అంతర్జాతీయ ధరలు అధికంగా ఉన్నాయి. దీపావళి సాధారణంగానే దేశీయంగా బంగారం ధరలు అధికంగా ఉంటాయి. ఆ లెక్కన 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన బంగారం ధర గ్రాము రూ.6వేలు పైనే ఉండనుంది. నవంబర్‌ 30న మెచ్యూర్‌ అయ్యే బాండ్లకు గాను ఆర్‌బీఐ నెలాఖరును ధర నిర్ణయింనుంది. ఆ లెక్కన దాదాపు డబుల్‌ కంటే ఎక్కువే రిటర్న్స్‌ రానున్నాయి.

ప్రతిఫలం ఎంత?….సావరిన్‌ గోల్డ్‌ బాండ్లలో 8 ఏళ్ల క్రితం ఓ లక్ష రూపాయలు ఇన్వెస్ట్‌ చేసి ఉంటే.. ప్రస్తుత అంచనా ప్రకారం రూ.2.20 లక్షలపైనే ప్రతిఫలాన్ని అంచనా వేయొచ్చు. అంటే దాదాపు 120 శాతం ప్రతిఫలం లభిస్తుంది. ఏడాదికి వార్షిక సమ్మిళిత వృద్ధి రేటు (సీఏజీఆర్‌) 10 శాతానికి పైనే గిట్టుబాటు అవుతుంది. దీనికి గోల్డ్‌ బాండ్లపై ఇచ్చే వడ్డీ అదనం. ఏటా 2.50 శాతం నామమాత్రం వడ్డీని బాండ్ల కొనుగోలుపై ఆర్‌బీఐ చెల్లిస్తుంది. అంటే సగటున 12-13 శాతం వృద్ధితో ప్రతిఫలం పొందొచ్చు. ఒకవేళ గోల్డ్‌ బాండ్లలో ఇన్వెస్ట్‌ చేయాలంటే షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులు, పోస్టాఫీలు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, క్లియరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, గుర్తింపు పొందిన స్టాక్‌ ఎక్స్చేంజీల (NSE, BSE) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన తేదీలను ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు ప్రకటిస్తుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z