Politics

రేవంత్ రెడ్డి కామెంట్స్ కు బీఆర్ఎస్ కౌంటర్-తాజా వార్తలు

రేవంత్ రెడ్డి కామెంట్స్ కు బీఆర్ఎస్ కౌంటర్-తాజా వార్తలు

* రేవంత్ రెడ్డి కామెంట్స్ కు బీఆర్ఎస్ కౌంటర్

నువ్వు ఓ బుడ్డరాఖాన్‌ అంటూ రేవంత్ రెడ్డికి BRS కౌంటర్ ఇచ్చింది. బిఆర్ఎస్, బిజెపి నేతల ఇళ్లపై ఐటి రైడ్స్ ఎందుకు జరగడం లేదన్న రేవంత్ రెడ్డి కామెంట్స్ కు బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. ‘రేటెంత రెడ్డి నువ్వేమో స్వీట్లు అమ్ముకోవడంలో బిజీ ఆయే. కొత్త ప్రభాకర్ రెడ్డి, వద్దిరాజు, నామ, గంగుల, మల్లారెడ్డి, మర్రి, పైళ్ల, మాగంటి ఇళ్లపై దాడులు జరిగాయి. అన్ని ప్రతిపక్ష పార్టీల లాగే బిఆర్ఎస్ కూడా బీజేపీ వేధింపులకు గురవుతోంది. నీలాంటి బుడ్డర్ ఖాన్ మాటల్ని ప్రజలు నమ్మరు’ అని బిఆర్ఎస్ ట్వీట్ చేసింది.ఇది ఇలా ఉండగా… ఐటీ దాడులపై రేవంత్ రెడ్డి స్పందించారు. నేడు పొంగులేటి, నిన్న తుమ్మల, అంతకు ముందు పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్ల పై ఐటీ దాడులు దేనికి సంకేతం!? బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదు!? అని ఆగ్రహించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని స్పష్టమైన సమాచారం రావడంతో మోడీ – కేడీ బెంబేలెత్తుతున్నారు. ఆ సునామీని ఆపడానికి చేస్తోన్న కుతంత్రం ఇదని ఆగ్రహించారు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను. నవంబర్ 30న కాంగ్రెస్ సునామీలో కమలం, కారు గల్లంతవడం ఖాయం అని తెలిపారు.

* నామినేషన్ దాఖలు చేసిన భట్టి విక్రమార్క

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇవాళ తన నామినేషన్ దాఖలు చేశారు. అయితే, నామినేషన్ వేయడానికి మధిర రిటర్నింగ్ కార్యాలయానికి భారీ ఎత్తున పార్టీ కార్యకర్తుల, అభిమానులతో కలిసి ఆయన వెళ్లి నామినేషన్ వేశారు. మధుర నియోజకవర్గానికి నాలుగోసారి భట్టి విక్రమార్క పోటీ పడుతున్నారు. ఆయన ఇప్పటికి మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు.. ఇక, నాలుగోసారి గెలిచేందుకు తన నామినేషన్ ను భట్టి విక్రమార్క దాఖలు చేశారు. ఈ సందర్బంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పాలేరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులను ఆయన ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు అంటూ మండిపడ్డారు. బీజేపీ- బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయి అని విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో నామినేషన్ కు వెళుతున్న వేళ ఇలా ఐటీ దాడుల పేరుతో బెదిరింపులకు దిగడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదు అని హెచ్చరించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అని భట్టి విక్రమార్క తెలిపారు.

* హైదరాబాద్- విజయవాడ హైవేలో ట్రాఫిక్ జామ్

హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ వెళ్లే హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. హ‌య‌త్‌న‌గ‌ర్ స‌మీపంలోని అబ్దుల్లాపూర్‌మెట్ వ‌ద్ద 5 కిలోమీట‌ర్ల మేర వాహ‌నాలు నిలిచిపోయాయి. ర‌హ‌దారి విస్త‌ర‌ణ ప‌నుల‌ కార‌ణంగా వాహ‌నాలు నెమ్మ‌దిగా ముందుకు క‌దులుతున్నాయి. మరోవైపు ఎన్నికల ప్రచారాలు సైతం ఉండడంతో ట్రాఫిక్‌జామ్ ఏర్ప‌డింది. దీంతో ఇటు హైద‌రాబాద్‌, అటు విజ‌య‌వాడ వెళ్లే వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియ‌ర్ చేసేందుకు చ‌ర్య‌లు తీసుకున్నారు.

* అంబులెన్స్‌లో వచ్చి నామినేషన్‌ వేసిన ప్రభాకర్‌రెడ్డి

మెదక్‌ ఎంపీ, దుబ్బాక భారాస అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల ప్రచారంలో ఉండగా ఓ యువకుడి చేతిలో కత్తిపోటుకు గురైన ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. దీంతో గత 10 రోజులుగా హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో ప్రభాకర్‌రెడ్డి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లో వచ్చి నామినేషన్‌ దాఖలు చేశారు. దుబ్బాకలోని అంబులెన్స్‌ దిగిన తర్వాత వీల్‌చైర్‌లో రిటర్నింగ్‌ కార్యాలయానికి వచ్చి నామినేషన్‌ పత్రాలను ఆర్వో గరిమ అగర్వాల్‌కు సమర్పించారు.

* మారువేషంలో జనం మధ్యలో తిరగాడిన సీఎం

సీఎం తన నివాసం నుంచి బయటకు వస్తున్నారంటే చాలు పోలీసులు పటిష్ట భద్రత చర్యలు చేపడతారు. సీఎం తిరగాడే ప్రాంతాన్నంతా తమ ఆధీనంలోకి దూసుకుంటారు. భారీ కాన్వాయ్‌, చుట్టూ భారీ భద్రత మధ్య సీఎం తన పర్యటను కొనసాగిస్తుంటారు. అయితే, హర్యానా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ (Manohar Lal Khattar) మాత్రం ఎలాంటి భద్రతా లేకుండా మారువేషంలో జనం మధ్యలోకి వెళ్లారు. ఎవరూ గుర్తు పట్టకుండా ముఖానికి మాస్క్‌ ధరించి కాసేపు ప్రజల మధ్యలోనే తిరిగారు.హర్యానాలోని పంచకులలో సెక్టార్‌-5 (Panchkula Sector-5)లో ఉన్న ఓ గ్రౌండ్‌లో జరిగిన ఒక మేళాలో సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పాల్గొన్నారు. మంగళవారం సాయంత్రం ఒక సాధారణ వ్యక్తిలా కొద్దిసేపు ప్రజల మధ్యలో ఆ మేళా (Haryana Fair)లో తిరిగారు. ఎవరూ గుర్తు పట్టకుండా ముఖానికి తువ్వాల చుట్టుకుని, క్యాప్‌ పెట్టుకుని ఆ ప్రాంతమంతా కలియతిరిగారు. ఆ సమయంలో సీఎం పక్కన ఎలాంటి భద్రతా లేదు. మేళాలో ఫుడ్‌స్టాల్‌ వద్ద తినుబండారాలను కొనుగోలు చేసి తిన్నారు. ఆ తర్వాత రద్దీగా ఉండే ఆ ప్రాంతం మొత్తం తిరిగి చూశారు. అక్కడ ఉన్న స్థానికులు ఆయన పక్కనే నిలబడి, అటూ ఇటూ తిరుగుతున్నా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌ను గుర్తుపట్టలేదు. అయితే, సీఎం ఎందుకు అలా మారువేషంలో జనం మధ్యలోకి వెళ్లారన్నది మాత్రం తెలియరాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

* ఎంపీలు ఎమ్మెల్యేలపై కేసుల విచారణకు ప్రత్యేక బెంచ్‌లను ఏర్పాటు

ప్రజా ప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణలను వేగంగా పూర్తి చేసేందుకు కచ్చితమైన మార్గదర్శకాలు జారీ చేయడం క్లిష్టమైన ప్రక్రియని సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్‌ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర విచారణ కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన లేదా ప్రధాన న్యాయమూర్తి నియమించిన ధర్మాసనం ప్రత్యేక బెంచ్‌లను ఏర్పాటు చేయాలని.. క్రిమినల్‌ కేసుల సత్వర విచారణకు అవసరమైన పర్యవేక్షణ కోరుతూ సుమోటో కేసులు నమోదు చేయాలని హైకోర్టులను సుప్రీం కోర్టు ఆదేశించింది. ట్రయల్‌ కోర్టులు అత్యవసరమైతే తప్ప ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసుల విచారణలు వాయిదా వేయకూడని ఆదేశాల్లో పేర్కొంది. కేసుల వివరాలను జిల్లా, ప్రత్యేక న్యాయస్థానాల నుంచి సేకరించి హైకోర్టు వెబ్‌సైట్‌లో ప్రత్యేక ట్యాబ్‌ ఏర్పాటు చేసి అందులో పొందుపరచాలని హైకోర్టులకు సూచించింది. ఇందుకు అవసరమై మౌలిక సదుపాయాలు, సాంకేతికతను జిల్లా న్యాయస్థానాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది.

* ఎల్లుండి నుంచి సుప్రీం కోర్టుకు దీపావళి సెలవులు

సుప్రీం కోర్టుకు దీపావళి సెలవులు వచ్చేశాయి. ఎల్లుండి నుంచి సుప్రీం కోర్టుకు దీపావళి సెలవులు ఉండనున్నాయి. ఏకంగా పది రోజుల పాటూ సుప్రీంకోర్టుకు దీపావళి సెలవులు ఉండనున్నాయి. అయితే.. నేడు సుప్రీంలో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు విచారణ జరుగనుంది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.కోర్టు నెంబర్ 6 లో 11వ నెంబర్ గా చంద్రబాబు కేసు లిస్ట్ అయ్యింది. ఈ పిటిషన్ ను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసరం విచారించనుంది. మరోవైపు స్కిల్ కేసులో 17Aపై తీర్పు పెండింగ్ లో ఉంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన జడ్జిమెంట్ వెలువడే అవకాశం ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి తరుణంలోనే.. ఎల్లుండి నుంచి సుప్రీం కోర్టుకు దీపావళి సెలవులు ఉండనున్నాయి. ఇవాళ చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఆర్డర్ రాకపోతే.. ఇక దీపావళి సెలవుల తర్వాతే అంటున్నారు న్యాయ నిపుణులు.

* సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ నామినేషన్ దాఖలు

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రాజ‌న్న సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నారు. ఇక, ఇవాళ ఆయన త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి అందించారు. సిరిసిల్ల నుంచి మంత్రి కేటీఆర్ ఐదోసారి బ‌రిలో దిగుతున్నారు. నామినేష‌న్ దాఖ‌లు కంటే ముందు కేటీఆర్ ప్రగతి భవన్ లో ప్రత్యేక పూజలు చేశారు. కాసేపట్లో ఆర్మూర్‌లో నిర్వహించే రోడ్ షోలో కేటీఆర్ పాల్గొంటారు. ఇక, సాయంత్రం వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొననున్నారు. ఇక, మంత్రి కేటీఆర్ 2006 నుంచి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ వెన్నంటి ఉన్నారు. తొలిసారి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ క్యాండిడేట్ గా కేటీఆర్ పోటీ చేశారు. తన సమీప ప్రత్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై 171 ఓట్ల మెజార్టీతో ఆయన గెలిచారు. ఇక, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తన ఎమ్మెల్యే పదవికి కేటీఆర్ రాజీనామా చేసి తిరిగి 2010 ఉప ఎన్నికల్లో బరిలో నిలిచడంతో పాటు సమీప ప్రత్యర్ధి కేకే మహేందర్‌ రెడ్డిపై మరోసారి 68 వేల 219 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2014 జనరల్‌ ఎన్నికల్లో 53 వేల 4 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తిరిగి 2018 ఎన్నికల్లో సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై 89 వేల 9 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచి మంత్రి కేటీఆర్ రికార్డు సృష్టించారు.

* గజ్వేల్‌లో నామినేషన్ దాఖలు చేసిన కేసీఆర్

బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ గజ్వేల్‌లో నామినేషన్ దాఖలు చేశారు. గజ్వేల్ సమీకృత భవనంలో సీఎం కేసీఆర్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం అక్కడున్న ప్రజలకు సీఎం అభివాదం చేశారు. ప్రచార రథంపై హెలిప్యాడ్ చుట్టూ తిరుగుతూ ప్రజలకు సీఎం కేసీఆర్ అభివాదం చేశారు. ఇక, కామారెడ్డిలో సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 2 గంటలకు నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ అనంతరం కామారెడ్డిలో బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్లు సమర్పిస్తున్నారు.

* త‌మిళ‌నాడులో భారీ వ‌ర్షాలు

ఈశాన్య రుతుప‌వ‌నాల ప్ర‌భావం త‌మిళ‌నాడుపై ప‌డింది. త‌మిళ‌నాడు వ్యాప్తంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. కోయంబ‌త్తూరు, తిరుపూర్, మ‌ధురై, థేనీ, దినిదిగుల్ జిల్లాల్లో కుండ‌పోత వాన ప‌డుతోంది. నీల్‌గిరి జిల్లాలోని ఐదు తాలుకాల‌ను వ‌ర్షం ముంచెత్తింది. ఈ క్ర‌మంలో ఈ జిల్లాల్లోని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల‌కు అధికారులు సెల‌వులు ప్ర‌క‌టించారు.రాబోయే 24 గంట‌ల్లో త‌మిళ‌నాడు, కేర‌ళ వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని, ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ అధికారులు హెచ్చ‌రించారు. గ‌త కొద్ది రోజుల నుంచి కేర‌ళ వ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్న సంగ‌తి తెలిసిందే. బుధ‌వారం క‌న్నూరు జిల్లాలో 7 సెం.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z