Devotional

23 నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షలు ప్రారంభం

23 నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షలు ప్రారంభం

భక్తుల కొంగు బంగారమైన బెజవాడ దుర్గమ్మ మీద భక్తితో లక్షలాది మంది భక్తులు చేపట్టే భవానీ దీక్షలు ఈ ఏడాది నవంబర్ 23నుంచి ప్రారంభం కానున్నాయి. భవానీ మండల దీక్షల ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్న ఆలయ అధికారులు ప్రకటించారు.కనకదుర్గమ్మపై భక్తితో చేపట్టే దీక్షలను నవంబర్ 23నుంచి 27వరకు స్వీకరించవచ్చని తెలిపారు. అమ్మవారిపై భక్తితో దసరా సమయంలో భక్తులు భవానీ దీక్షలు చేపట్టే వారు. 2007లో భవానీ దీక్షల విరమణ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై తొక్కిసలాట జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత మండల దీక్షలను విడిగా నిర్వహిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఆంధ్రా, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల నుంచి లక్షలాది మంది భక్తులు ఏటా అమ్మవారి దీక్షలు ధరిస్తుంటారు. ఏటేటా దీక్షలు స్వీకరించే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో భవానీ దీక్షలకు ఇంద్రకీలాద్రిపై పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తు్నారు.నవంబర్‌ 23న అమ్మవారి మూలవిరాట్‌కు పూజలు నిర్వహించి పగడాల మాలాధారణ చేస్తారని, అనంతరం ప్రధాన ఆలయం నుంచి ఉత్సవమూర్తిని మహా మండపం ఆరో అంతస్తుకు ఊరేగింపుగా తీసుకువచ్చి అఖండ జ్యోతి ప్రజ్వలనతో దీక్ష స్వీకరణ మహోత్సవం ప్రారంభమవుతుందని వివరించారు.

అర్ధమండల దీక్షలు డిసెంబర్‌ 13-17 వరకు స్వీకరించవచ్చని ఈవో తెలిపారు. 26న అమ్మవారి కలశజ్యోతి మహోత్సవం సత్యనారాయణపురంలోని శివరామకృష్ణ క్షేత్రం నుంచి ప్రారంభమవుతుంది. జనవరి 3-7 వరకు దీక్ష విరమణలు కొనసాగుతాయని తెలిపారు.

14 నుంచి కార్తీక మాసోత్సవాలు
ఇంద్రకీలాద్రిపై ఈ నెల 14 నుంచి డిసెంబర్‌ 12 వరకు కార్తీక మాసోత్సవాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజు సాయంత్రం మల్లేశ్వర స్వామి, నటరాజ స్వామి వారి ఆలయాల వద్ద ఆకాశదీపాన్ని వెలిగించనున్నారు. 26న కోటి దీపోత్సవం, జ్వాలాతోరణం, 27న కార్తీక పౌర్ణమి గిరి ప్రదక్షణ, బిల్వార్చన చేపడతారు. 15న దుర్గమ్మను గాజులతో అలంకరిస్తారు. 16న సరస్వతి యాగాన్ని, 17న నాగుల చవితి నిర్వహిస్తారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z