ఉద్యోగం లేనివారికి, అసంఘటిత రంగాల్లోని కార్మికులు, కూలీలకు పెన్షన్ అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే కేవలం రోజూ టీ తాగే ఖర్చుతో నెలకు రూ.5వేల పెన్షన్ పొందే అవకాశం ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటల్ పెన్షన్ యోజనలో చేరాలంటే 40 ఏళ్లలోపు భారతీయ పౌరులై ఉండాలి. బ్యాంకు ఖాతా అవసరం ఉంటుంది. రోజు ఒక కప్పు టీ కంటే తక్కువ పెట్టుబడి పెట్టి ప్రతినెల రూ.5,000 పెన్షన్ పొందే అవకాశం ఉంది. ముందుగా మీరు 18 ఏళ్ల వయసులో ఈ పథకంలో చేరితే కేవలం రోజుకు రూ.7 అంటే నెలకు రూ.210 వెచ్చిస్తే సరిపోతుంది. 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత రూ.5వేలు పెన్షన్ పొందొచ్చు. అదే మీరు కొంత ఆలస్యంగా అంటే మీ ఇరవైఐదో ఏట ఈ పెన్షన్‌ను ప్రారంభిస్తే నెలకు కొంత ఎక్కువగా రూ.367 చెల్లించాలి. అలాగే 30వ ఏటా ఇన్వెస్ట్ చేయాలంటే నెలకు రూ.577 చెల్లించాలి. ఇక చివరిగా ఎవరైనా వ్యక్తి తన 40వ ఏట దీన్ని ప్రారంభించాలంటే అందుకోసం నెలకు రూ.1454 పెట్టుబడిగా పెట్టాలి. దాంతో మీ వయసు 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతినెల పెన్షన్ పొందే వీలుంది. నెలవారీ, మూడు నెలలు, ఆరునెలలు, ఏడాది వారీగా ఈ నగదును చెల్లించే అవకాశం కల్పిస్తున్నారు. ఈ పథకంలో చేరాలంటే దగ్గరలోని బ్యాంకు బ్రాంచికి వెళ్లి వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది.
ఇలా 18 నుంచి 40 ఏళ్ల మధ్య వ్యక్తులు తమ ఆదాయాలకు అనుగుణంగా చిన్న వయసులోనే నెలవారీ ఈ పథకాన్ని ప్రారంభిస్తే తక్కువ ఖర్చుతోనే రూ.5వేలు పెన్షన్ పొందొచ్చు. ఈ పథకాన్ని మోదీ ప్రభుత్వం 2015-16లో ప్రారంభించింది.
👉 – Please join our whatsapp channel here –