DailyDose

జైలులో నేరాల కింద పరిగణించబడే అంశాలు

జైలులో నేరాల కింద పరిగణించబడే అంశాలు

నిబంధనలకు విరుద్ధంగా జైల్లో మొబైల్‌ ఫోన్లు వాడుతూ పట్టుబడినవారికి మూడేళ్ల జైలుశిక్ష విధించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. చట్ట విరుద్ధంగా ఖైదీలు, సందర్శకులు, లేదంటే అధికారులు.. ఎవరైనా మొబైల్‌ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు వాడినట్లయితే ఈ శిక్ష విధించాలని పేర్కొంది. నిషేధిత వస్తువులను ఆధీనంలో ఉంచుకున్నా, ఉపయోగించినా, జైల్లోకి ప్రవేశపెట్టే ప్రయత్నం చేసినా, లేదంటే.. ఉన్నవాటిని తొలగించేందుకు సహకరించినా, ఖైదీలకు సరఫరా చేసేందుకు ప్రయత్నించినా శిక్ష విధించాలని ప్రతిపాదించింది. అలాగే ఇతర నేరాలను ప్రోత్సహించిన వారికీ గరిష్ఠంగా మూడేళ్ల శిక్ష, రూ.25వేల జరిమానా విధించాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన నమూనా చట్టాన్ని (మోడల్‌ ప్రిజన్స్‌ అండ్‌ కరెక్షనల్‌ సర్వీసెస్‌ యాక్ట్‌-2023ని) కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు పంపింది. జైలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ పదేపదే నేరాలకు పాల్పడేవారికీ మూడేళ్ల శిక్ష విధించే అవకాశాన్ని ఈ చట్టంలో పొందుపరిచింది. ఖైదీ ఇప్పటికే అనుభవిస్తున్న శిక్షాకాలానికి అదనంగా దీన్ని చేరుస్తారు.

కాలం చెల్లిన చట్టాల స్థానంలో..
అమల్లో ఉన్న 1894, 1900 నాటి చట్టాల బదులు.. మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కొత్త నమూనా చట్టాన్ని రూపొందించినట్లు కేంద్రం పేర్కొంది. దీనిని రాష్ట్రాలు స్వీకరించి అమలుచేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈ నమూనా చట్టంలో మొత్తం 21 అధ్యాయాలున్నాయి. జైళ్లలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, ఖైదీల ప్రవేశం/ బదిలీ, బయటకు పంపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వర్గీకరణ, అత్యంత ప్రమాదకరమైన ఖైదీల నుంచి సమాజాన్ని రక్షించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మహిళా, ట్రాన్స్‌జెండర్‌ ఖైదీల విషయంలో చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాల గురించి వివరించారు.

జైల్లో నేరాల కింద పరిగణించే అంశాలు

నిబంధనలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం

ఇతరులపై దాడిచేయడం, బలప్రయోగం చేయడం

ఉద్దేశపూర్వకంగా నిరంతరం అవమానకరంగా, బెదిరించేలా మాట్లాడటం

అనైతిక, అమర్యాదకరంగా ప్రవర్తించడం

జైల్లో పనిచేయకుండా ఉద్దేశపూర్వకంగా తప్పించుకోవడం

కఠిన కారాగారశిక్ష పడిన ఖైదీలు నిరంతరం తప్పించుకుని తిరగడం

ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, పనిచెడగొట్టడం

జైలు ఆస్తులను ధ్వంసం చేయడం

జైలు రికార్డులు, డాక్యుమెంట్లు, టికెట్లను ధ్వంసం చేయడం

నిషేధిత వస్తువులను అందుకోవడం, దగ్గర ఉంచుకోవడం, బదిలీ చేయడం

తోటి ఖైదీలు, అధికారులకు వ్యతిరేకంగా తప్పుడు ఆరోపణలు చేయడం

తన దృష్టికి వచ్చిన విషయాలపై ఫిర్యాదు చేయడానికి నిరాకరించడం. ముఖ్యంగా జైల్లో జరిగే అగ్నిప్రమాదాలు, కుట్రలు, తప్పించుకోవడానికి జరిగే ప్రయత్నాల గురించి తెలిసీ చెప్పకపోవడం

అనధికారికంగా వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ పరికరాలు, దాని అనుబంధ వస్తువులు దగ్గర ఉంచుకోవడం

అనుమతిలేని చోట్లకు చొరబడటం, తిరగడం

జైలు బయటి వ్యక్తులతో అనధికారికంగా మాట్లాడటం

నిషేధిత వస్తువులను స్మగ్లింగ్‌ చేయడం, లేదంటే అందుకు ప్రయత్నించడం, దగ్గర ఉంచుకోవడం

జైలు అధికారులకు వ్యతిరేకంగా తప్పుడు ఆరోపణలు చేయమని తోటి ఖైదీలను బెదిరించడం

సామూహిక ఆమరణ నిరాహారదీక్షకు ఉసిగొల్పడం, లేదంటే ఇతరత్రా మార్గాల్లో జైలు నిబంధనలు ఉల్లంఘించాల్సిందిగా రెచ్చగొట్టడం
లైంగిక వేధింపులు, స్వలింగ సంపర్కం

జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించడం, అందులో పాలుపంచుకోవడం

పైన పేర్కొన్న నేరాలు చేయడానికి తోడ్పడటం, లేదా అవి చేసేలా ఉసిగొల్పడం

..వీటికి పాల్పడినవారికి తొలుత ఒక హెచ్చరిక జారీచేస్తారు. జైలు అధికారి సంబంధిత ఖైదీకి వ్యక్తిగతంగా హెచ్చరించడంతోపాటు, శిక్షల పుస్తకంలో, అతని జైలుజీవిత చరిత్రలో నమోదుచేస్తారు. ఇలాంటి వారికి క్యాంటీన్‌ సౌకర్యం, ఇతరత్రా వినోద సౌకర్యాలను నెలపాటు ఆపేస్తారు. సంపాదించుకున్న క్షమాభిక్ష కాలాన్ని రద్దుచేస్తారు. నెలరోజులపాటు సందర్శకులను అనుమతించబోరు. నెలరోజులపాటు ప్రత్యేక సెల్‌లో నిర్బంధిస్తారు.

కొత్త శిక్షలు, జరిమానాల గురించి ఖైదీలకు తెలిసేలా ఇంగ్లిష్‌, స్థానిక భాషల్లో జైల్లో బోర్డులు పెట్టాలి.

ఖైదీలను వర్గాలుగా విభజించాలి

ఖైదీలందరినీ ఒకే గాటన కట్టేయకుండా వారిని 1. సివిల్‌ ఖైదీలు 2. క్రిమినల్‌ ఖైదీలు 3. శిక్షపడ్డ ఖైదీలు 4. అండర్‌ ట్రయల్స్‌ 5. నిర్బంధంలోకి తీసుకున్నవారు 6. అలవాటుగా నేరాలు చేసేవారు 7. తరచూ జైలుకొచ్చి వెళ్లేవారు వంటి వివిధ వర్గాలుగా విభజించాలని కేంద్ర ప్రభుత్వం ఈ నమూనా చట్టంలో ప్రతిపాదించింది.

వీరందర్నీ ప్రత్యేక బ్యారక్‌లు, ఎన్‌క్లోజర్లు, సెల్స్‌లో ఉంచాలి. ప్రతికూలత ప్రభావం నుంచి రక్షించడానికి ఈ చర్యలు తీసుకోవాలి. ఈ ఖైదీలను పురుషులు, స్త్రీలు, ట్రాన్స్‌జెండర్స్‌గా వర్గీకరించి ప్రత్యేకంగా ఉంచాలి.

పైన పేర్కొన్న ఖైదీల్లోనూ డ్రగ్స్‌కు అలవాటుపడ్డవారు, మద్యం మత్తులో నేరం చేసినవారు, తొలిసారి నేరం చేసినవారు, విదేశీయులు, 65 ఏళ్లకు పైబడినవారు, ఇన్‌ఫెక్షన్‌, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నవారు, మానసిక ఆరోగ్యంతో సతమతమవుతున్నవారు, మరణశిక్ష పడ్డవారు, ఎక్కువ ప్రమాదం ఉన్నవారు, పిల్లలతో ఉన్న మహిళలు, యువ ఖైదీలను వేర్వేరుగా ఉంచాలి.

అత్యంత ప్రమాదకరమైనవారిని ఆధునిక భద్రత ఉన్న ప్రత్యేక సెల్స్‌లో ఉంచాలి. ఇలాంటి వారి విషయంలో జైలు అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి.

ఎలక్ట్రానిక్‌ ట్రాకింగ్‌ చేయాలి….ఎలక్ట్రానిక్‌ ట్రాకింగ్‌ పరికరాలు ధరించడానికి అంగీకరించిన వారికి సెలవు ఇవ్వొవచ్చు. ఇలాంటి వారిని వారు ధరించిన ఎలక్ట్రానిక్‌ పరికరాల ద్వారా పర్యవేక్షించాలి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారికి వెంటనే సెలవు రద్దు చేయాలి. భవిష్యత్తు సెలవులను కూడా రద్దుచేయాలి.