* కొత్త మార్గదర్శకాలను జారీ చేసిన యూట్యూబ్
క్రియేటర్లకు ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ భారీ షాకిచ్చింది. చాట్‌జీపీటీ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఏఐ వినియోగం రోజురోజుకి పెరిగిపోతుంది. అయితే, దీన్ని ఆసరాగా చేసుకుంటున్న పలువురు వీడియో క్రియేటర్లు ఏఐ సాయంతో వీడియోలు చేస్తున్నారు. డబ్బులు సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఇదే అంశంపై యూట్యూబ్ కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది. ఏఐ యాప్స్‌తో చేసే కంటెంట్‌కు యూట్యూబ్‌లో చోటు లేదని స్పష్టం చేసింది. వీడియోల నుంచి ఏఐ ఇమేజెస్ వరకు యూట్యూబ్ వీడియోల్లో వినియోగించడానికి వీలు లేదని తెలిపింది. ఇందుకోసం కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్లు తెలిపింది. ఒకవేళ ఏఐ ఫోటోలు, వీడియోల్ని వినియోగిస్తే సదరు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు తప్పని సరిగా ఈ కంటెంట్ ఏఐతో చేసినట్లు తెలపాలి. లేదంటే ఆయా వీడియోలను తొలగించనున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా యూట్యూబ్ బ్లాగ్‌లో మార్గదర్శకాలపై సమాచారం ఇచ్చింది. యూజర్లు కంటెంట్ వీక్షిస్తున్న సందర్భంలో ఈ కంటెంట్‌ను ఏఐ సహాయంతో సృష్టించినట్లు చెబుతుందని పేర్కొంది.డిస్క్రిప్షన్‌లో ఏఐ లేబుల్‌కు ఆప్షన్ ఉంటుందని పేర్కొంది. కొత్త మార్గదర్శకాలను పాటించని కంటెంట్ క్రియేటర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కంటెంట్‌ను తొలగించడంతో పాటు ఆయా ఛానెల్స్‌కు సంబంధించి మానిటైజేషన్ నిలిపివేయనున్నట్లు స్పష్టం చేసింది.
* పెరిగిన సరుకుల ఎగుమతులు
ఈ ఏడాది అక్టోబర్‌లో మనదేశ సరుకుల ఎగుమతులు 6.21 శాతం పెరిగి 33.57 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వాణిజ్య లోటు రికార్డు స్థాయిలో 31.46 బిలియన్ డాలర్లను తాకింది. బంగారం దిగుమతుల పెరగడం వల్ల గత నెలలో దిగుమతుల విలువ 12.3 శాతం పెరిగి 65.03 బిలియన్లకు చేరుకుంది. గోల్డ్ ఇన్‌బౌండ్ ఎగుమతులు 95.5 శాతం పెరిగి 7.23 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ నెలలో చమురు దిగుమతులు కూడా 8 శాతం పెరిగి 17.66 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో వస్తువుల వాణిజ్య లోటు 26.31 బిలియన్ డాలర్లుగా ఉంది. అక్టోబరులో వాణిజ్య లోటు (దిగుమతులు, ఎగుమతుల మధ్య తేడా) పెరగడానికి దిగుమతులు ఎక్కువ కావడమేనని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సత్య శ్రీనివాస్ అన్నారు.ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–-అక్టోబర్ కాలంలో ఎగుమతులు 7 శాతం తగ్గి 244.89 బిలియన్ డాలర్లకు చేరుకోగా, దిగుమతులు 8.95 శాతం తగ్గి 391.96 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ ఏడు నెలల కాలంలో వాణిజ్య లోటు 147.07 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో 167.14 బిలియన్ డాలర్లుగా ఉంది.
* డిస్నీ+ హాట్‌స్టార్ సరికొత్త రికార్డ్
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+ Hotstar) సరికొత్త రికార్డును నమోదు చేసింది. ముంబయిలోని వాంఖడే మైదానంలో జరిగిన భారత్- న్యూజిలాండ్ మధ్య సెమీస్ మ్యాచ్ రికార్డు స్థాయిలో వ్యూయర్‌షిప్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌ను ఓ దశలో 5.3 కోట్ల మంది వీక్షించారు. తొలుత భారత్ ఇన్నింగ్స్‌ను 5.1 కోట్ల మంది చూడగా.. న్యూజిలాండ్ లక్ష్య ఛేదనను అత్యధికంగా 5.3 కోట్ల మంది లైవ్‌లో వీక్షించారు.ఐపీఎల్ విషయంలో జియో సినిమా అనుసరించిన వ్యహాన్నే డిస్నీ+ హాట్‌స్టార్ ఈ సారి అందిపుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రపంచకప్ మ్యాచ్‌లను ఉచితంగా ప్రసారం చేస్తోంది. దీంతో జియో సినిమా పేరిట ఉన్న రికార్డులను తిరగరాస్తోంది. ఐపీఎల్ చరిత్రలో చెన్నై, గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను 3.2 కోట్ల మంది లైవ్‌లో వీక్షించడం ఇప్పటి వరకు భారత్‌లో డిజిటల్ వేదికగా ఉన్న అత్యధిక వ్యూయర్‌షిప్ రికార్డ్. ఆ రికార్డును డిస్నీ+ హాట్‌స్టార్ అధిగమించింది. ప్రపంచకప్‌లో అక్టోబర్ 22న ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌ను 3.5 కోట్ల మంది వీక్షణతో ఆ రికార్డును దాటేసింది. సెమీస్‌లో డిస్నీ+ హాట్‌స్టార్ తన రికార్డును తానే బద్దలుకొడుతూ సరికొత్త గణాంకాలు నమోదు చేసింది.2019లో ప్రపంచకప్‌లోనూ భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌ను డిస్నీ+హాట్‌స్టార్‌లో అత్యధికంగా 2.5 కోట్ల మంది లైవ్‌లో వీక్షించారు. ఉచిత ప్రసారాలకు తోడు డేటా సేవింగ్, మ్యాక్స్ వ్యూ ఆప్షన్‌ను తీసుకురావడం ఈసారి డిస్నీ+ హాట్‌స్టార్‌కు కలిసొచ్చింది. ఇక సెమీస్‌లోనే ఇలా ఉంటే.. ఫైనల్ మ్యాచ్ ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. ఇప్పటికే భారత్ సగర్వంగా ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లలో ఒక దానితో భారత్ తలపడనుంది. ఫైనల్‌కు ఈ రెండింట్లో ఏ జట్టు వచ్చినా సరికొత్త వ్యూయర్‌షిప్ రికార్డు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది. నవంబర్ 19న ఆదివారం అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
* 25 వేల కోట్లు ఏమవుతాయ్?
సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ మంగళవారం రాత్రి మరణించడంతో, ఆయన కంపెనీ నిధులపై సస్పెన్స్ నెలకొంది. సెబీ ఖాతాలో సహారాకు చెందిన రూ.25వేల కోట్లకుపైగా నిధులు ఉన్నాయి. వీటి చెల్లింపు ఎలా అన్నది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. పోంజీ స్కీమ్‌లతో నిబంధనలను అతిక్రమిం చారని ఆరోపణలు రావడంతో రాయ్ అనేక చట్టపరమైన సమస్యలు ఎదుర్కొన్నారు. సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌పై సెబీ కొరడా ఝుళిపించింది. దాదాపు 3 కోట్ల మంది పెట్టుబడిదారుల నుంచి బాండ్ల రూపంలో సేకరించిన డబ్బును తిరిగి చెల్లించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు కూడా సెబీ ఆదేశాలను సమర్థించింది. 95 శాతం కంటే ఎక్కువ మంది ఇన్వెస్టర్లకు నేరుగా రీఫండ్ చేసినట్లు గ్రూప్ చెబుతూ వచ్చినప్పటికీ, వాళ్లకు తదుపరి రీఫండ్ కోసం సెబీ వద్ద రూ. 24 వేల కోట్లు డిపాజిట్ చేయాలని సహారాను కోరింది. సెబీ ఈ రెండు సహారా గ్రూప్ సంస్థల పెట్టుబడిదారులకు 11 సంవత్సరాలలో రూ.138.07 కోట్లు రీఫండ్ చేసింది. రీఫండ్ల కోసం ప్రత్యేకంగా తెరిచిన బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన మొత్తం రూ.25 వేల కోట్లకు పైగా పెరిగింది. మెజారిటీ బాండ్ హోల్డర్ల నుంచి క్లెయిమ్‌లు రాలేదు. గత ఆర్థిక సంవత్సరంలో సెబీ రీఫండ్ చేసిన మొత్తం కేవలం రూ. 7 లక్షలు పెరిగింది.అయితే సెబీ -సహారా రీఫండ్ ఖాతాలలో బ్యాలెన్స్ ఏడాది కాలంలో రూ.1,087 కోట్లు పెరిగింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి 53,687 ఖాతాల నుంచి సెబీ 19,650 దరఖాస్తులను తీసుకుంది. మొత్తం రూ. 138.07 కోట్లను 17,526 దరఖాస్తుదారులకు చెల్లించారు. మిగిలిన దరఖాస్తులకు సంబంధించి తగిన సమాచారం దొరకడం లేదు. జాతీయ బ్యాంకుల్లో జమ చేసిన మొత్తం దాదాపు రూ. 25,163 కోట్లకు చేరింది. వీటిపై సెబీ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.
* ఆయా ఖాతాల నుంచి 649 కోట్లు రికవరీ
ప్రభుత్వరంగానికి చెందిన యూకో బ్యాంక్ (UCO Bank) ఖాతాదారుల అకౌంట్లలోకి రూ.820 కోట్లు పొరపాటున జమ అయ్యాయి. ఇమిడియేట్ పేమెంట్ సర్వీస్‌లో (IMPS) సాంకేతిక లోపం కారణంగా ఈ పరిణామం చోటుచేసుకుంది. సత్వరమే బ్యాంక్ చర్యలు చేపట్టి.. జమ అయిన ఖాతాలను బ్లాక్‌లో పెట్టింది. ఆయా ఖాతాల నుంచి ₹649 కోట్లు రికవరీ చేసింది. ఇప్పటి వరకు 79 శాతం సొమ్ము వెనక్కి రప్పించినట్లు యూకో బ్యాంక్ గురువారం తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఇంకా 171 కోట్లు మొత్తం వెనక్కి రావాల్సి ఉందని తెలిపింది. అయితే, ఈ పొరపాటు మానవ తప్పిదమా? హ్యాకింగ్ ఏమైనా జరిగిందా? అనే దానిపై బ్యాంక్ స్పష్టతను ఇవ్వలేదు.యూకో బ్యాంక్‌లో జరిగిన ఈ పొరపాటు నవంబర్ 15న బుధవారం వెలుగులోకి వచ్చింది. వేరే బ్యాంకులకు చెందిన వినియోగదారులు చేసిన పేమెంట్ తమ బ్యాంకులకు చెందిన ఖాతాదారుల ఖాతాల్లో జమ అయినట్లు యూకో బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది. నవంబర్ 10-13 తేదీల మధ్య ఐఎంపీఎస్‌లో సాంకేతిక లోపం వల్ల ఈ పొరపాటు జరిగినట్లు బ్యాంక్ వెల్లడించింది. అయితే, తమ బ్యాంకుల ఖాతాల్లోకి జమ అయినప్పటికీ.. వాస్తవంగా ఆయా ఖాతాల నుంచి సొమ్ము తమ బ్యాంకుకు రాలేదని పేర్కొంది. దీంతో సత్వరమే ఐఎంపీఎస్ ఛానెల్‌ను ఆఫ్‌లైన్ చేశామని యూకో బ్యాంక్ తెలిపింది. ఈ వ్యవహారంలో లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల సహాయం కూడా తీసుకుంటున్నామని పేర్కొంది. ఈ నేపథ్యంలో గురువారం యూకో బ్యాంక్ షేర్లు ఎన్‌ఎస్‌ఈలో 1 శాతం నష్టంతో రూ.39.35 వద్ద ట్రేడవుతున్నాయి.
👉 – Please join our whatsapp channel here –