రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 221 మంది మహిళలు పోటీలో నిలిచారు. వీరిలో భారాస, కాంగ్రెస్, భాజపా-జనసేన, సీపీఎంలు కలిపి 36 మందికి టికెట్లు ఇచ్చాయి. బీఎస్పీ తరఫున మరో 9 మంది బరిలో ఉన్నారు. మిగతా వారంతా స్వతంత్రులే. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని గొంతెత్తిన ప్రధాన పార్టీల్లో.. ఒక్కటి కూడా కనీసం అందులో సగం సీట్లనైనా మహిళలకు కేటాయించలేదు. అత్యధికంగా భాజపా 13 మంది మహిళలకు సీట్లిచ్చింది. ఆ పార్టీతో పొత్తు ఉన్న జనసేన ఒక స్థానంలో మహిళను నిలిపింది. కాంగ్రెస్ పార్టీ 12 మందికి, అధికార భారాస 8 మందికి సీట్లిచ్చింది. ఈ ఎన్నికల్లో మొత్తం అభ్యర్థులు 2,290 మంది కాగా.. వారిలో 2,068 మంది పురుషులు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు.
ప్రధాన అభ్యర్థులకు అనుయాయులే?
స్వతంత్ర అభ్యర్థులుగా ఉన్న మహిళల్లో ఎక్కువ మంది ప్రధాన పార్టీల అభ్యర్థులకు అనుయాయులే. ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్లు, ఓట్ల లెక్కింపు ఏజెంట్లు, వాహనాల వినియోగం తదితర అవసరాల కోసమే ప్రధాన అభ్యర్థులు.. మహిళలను స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో నిలుపుతున్నాయి.
2018 ఎన్నికల్లో 140 మంది మహిళలు పోటీ చేశారు. ఆ ఎన్నికలతో పోలిస్తే ఈ దఫా సుమారు 81 మంది అధికంగా పోటీ చేస్తున్నారు. అప్పట్లో ప్రధాన పార్టీలు 30 మంది మహిళా అభ్యర్థులకు టికెట్లు ఇచ్చాయి.
👉 – Please join our whatsapp channel here –