ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా అభ్యర్థులు ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. గ్రేటర్‌లో ఒక్కో నియోజకవర్గంలో కనీసం 2.5 లక్షల నుంచి 8 లక్షల వరకు ఓటర్లు ఉంటారు. అన్ని కాలనీలు, బస్తీలు తిరుగుతూ ఓటర్లను కలవడం అయ్యే పనికాదు. బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్‌లు ఎన్ని పెట్టినా ఎన్నికల నాటికి ఇంకా తిరగని ప్రాంతాలు మిగిలే ఉంటాయి. పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఓటు కీలకమే. ఇప్పటికే భారాస రాష్ట్ర నేతలను, కాంగ్రెస్, భాజపా జాతీయ స్థాయి నాయకులను రంగంలోకి దించి ప్రచారం చేయిస్తున్నాయి. దీంతోపాటు సాంకేతిక దన్నుతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. నేరుగా అభ్యర్థులు ఫోన్లకు వాయిస్ మెసేజ్ రూపంలో కాల్స్‌చేసి తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. తాము గెలిస్తే ఏం చేస్తామో చెబుతున్నారు. వివిధ పథకాల లబ్ధిదారులుగా ఉంటున్న వారికి కూడా ఈ తరహా కాల్స్ చేసి ఓట్లు వేయాలని కోరుతున్నారు. దాంతోపాటు ఏరోజుకారోజు కార్నర్ మీటింగ్‌లు జరిగే ప్రాంతాల గురించి ఫోన్‌లో చెబుతూ హాజరు కావాలని కోరుతున్నారు. అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఈ తరహా ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఏఐ టూల్ తయారు చేసి
ప్రపంచ వ్యాప్తంగా ఉర్రూతలూగిస్తున్న కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ)ను కొందరు ఎన్నికల ప్రచారంలో తెరపైకి తెస్తున్నారు. జూబ్లీహిల్స్ నుంచి ఓ స్వతంత్ర అభ్యర్థి తన ప్రచారంలో ఈ ఏఐ సాంకేతికతను వినియోగిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఏఐ టూల్‌ను తయారు చేసి ఆ ప్రాంతంలోని ఓటర్ల వాట్సాప్ నంబర్లకు పంపుతున్నారు. అది ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే…అభ్యర్థి పూర్తి వివరాలు ఓటర్లకు అందుబాటులో ఉంటాయి. అక్కడే చాటింగ్ ద్వారా అభ్యర్థికి పలు ప్రశ్నలు వేసే అవకాశం ఉంది. మిషన్ లెర్నింగ్‌తో ముందే కొన్ని కామన్ ప్రశ్నలకు జవాబులు రూపకల్పన చేసి అందులో ఉంచారు. సమాజానికి ఏదో చేయాలనే ఉద్దేశంతో కొందరు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇష్ట పడుతుంటారు. అయితే రాజకీయ నేపథ్యం, డబ్బు లేకపోవడంతో వెనుకడుగు వేస్తుంటారు. ఇలాంటి సాంకేతికతతో అతి తక్కువ వ్యయంతో ప్రచారం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏఐ ద్వారా ఒక్కో ఓటర్‌కు సమాచారం పంపడానికి 80 పైసలు కంటే ఎక్కువ కాదు. భవిష్యత్తులో అభ్యర్థులు ప్రచార వ్యయం తగ్గించుకోవడానికి.. ఇదో ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –