భాష ఏదైనా.. నటనతో మెప్పిస్తూ, అన్నిచోట్లా దూసుకెళ్తోంది రాశీఖన్నా. ప్రస్తుతం విక్రమ్ మాస్సేకి జోడీగా ‘టీఎంఈ’లో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తైంది. ఈ సందర్భంగా చిత్రీకరణ అనుభవం.. దర్శకులు, సహనటులు ప్రోత్సహించిన తీరును వివరిస్తూ సోమవారం తన ఇన్స్టాగ్రామ్లో ఓ ఉద్వేగభరితమైన పోస్టును పెట్టింది రాశి. దర్శకుడు, హీరోలతో కలిసి ఉన్న ఓ ఫొటోను పంచుకుంది. ముక్కలైన హృదయం ఎమోజీని జోడిస్తూ.. ‘నా హృదయానికి ఎంతో దగ్గరైన ‘టీఎంఈ’ చిత్ర షూటింగ్ పూర్తైంది. ఇందులో నాది ఊహకందని, విచిత్రమైన మలుపులుండే ఓ అందమైన పాత్ర. కెమెరా ముందుకొచ్చినప్పుడు, ఆ పాత్రలో లీనమైనప్పుడు నా నరాలు లాగేసేవి. నాలో తుపాన్లు చెలరేగేవి. ఒక్కోసారి మానసికంగా ఆ ప్రభావం నుంచి తేరుకోలేకపోయేదాన్ని. అంత తీక్షణంగా ఉండేదా పాత్ర. ఆ సమయంలో విక్రమ్ నాకు అండగా నిల్చున్నాడు. నటనలో మెలకువలు చెప్పాడు. దర్శకుడైతే ప్రతి దశలో, ప్రతి సన్నివేశంలో నన్ను పాత్రలోకి పరకాయప్రవేశం చేసేలా చూశారు. ఈ ఉద్విగ్నతను మీతో చెప్పుకోకుండా ఉండలేకపోతున్నా. అంతగా సపోర్ట్ చేసిన అందరికీ కృతజ్ఞతలు’ అంటూ రాసుకొచ్చింది.
👉 – Please join our whatsapp channel here –