Business

సుమారు 13 వేల కోట్లతో భారత్‌లో మరో పెట్టుబడి

సుమారు 13 వేల కోట్లతో భారత్‌లో మరో పెట్టుబడి

ఐఫోన్ల కాంట్రాక్ట్‌ తయారీ సంస్థ, తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం ఫాక్స్‌కాన్‌ భారత్‌లో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించడంపై దృష్టి పెడుతోంది. ఈ క్రమంలో తాజాగా మరో 1.6 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 13 వేల కోట్లు) ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు తైవాన్‌లోని స్టాక్‌ ఎక్స్చేంజీలకు సంస్థ తెలియజేసింది. భారత్‌లోని తమ అనుబంధ సంస్థ హోన్‌ హాయ్‌ టెక్నాలజీ ఇండియా మెగా డెవలప్‌మెంట్‌ ద్వారా పెట్టుబడులు పెట్టనున్నట్లు పేర్కొంది.

చైనాకు మాత్రమే పరిమితం కాకుండా కార్యకలాపాలను ఇతర దేశాలకు కూడా మళ్లించే వ్యూహంలో భాగంగా (చైనా ప్లస్‌ వన్‌) కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా–చైనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటం తరచుగా సమస్యలకు దారి తీస్తున్న నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. ఫాక్స్‌కాన్‌ ఇప్పటికే భారత్‌లో దాదాపు 8 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేసింది. భారత మార్కెట్లో అవకాశాల రీత్యా ఇక్కడ తమ పెట్టుబడులను గతేడాదితో పోలిస్తే మరింతగా పెంచుకునే అవకాశం ఉందని కంపెనీ చైర్మన్‌ యంగ్‌ లియు ఇటీవలే తెలిపారు.

ఐఫోన్ల తయారీలో టాప్‌..
అమెరికా టెక్‌ దిగ్గజం యాపిల్‌కు అత్యధికంగా ఐఫోన్‌లను సరఫరా చేసే కాంట్రాక్ట్‌ తయారీ సంస్థల్లో ఫాక్స్‌కాన్‌ది అగ్రస్థానం. భారత్‌లోనూ పోటీ సంస్థలైన టాటా, పెగాట్రాన్‌కు మించి ఉత్పత్తి చేస్తోంది. ఫాక్స్‌కాన్‌ ఆదాయంలో దాదాపు సగభాగం ఐఫోన్ల తయారీ ద్వారానే ఉంటోంది. కంపెనీకి భారత్‌లో 40,000 మంది పైగా వర్కర్లు ఉన్నారు. ఇక్కడ మొత్తం 30 ఫ్యాక్టరీలు ఉండగా, ఏటా దాదాపు 10 బిలియన్‌ డాలర్ల ఆదాయం వస్తోంది. 2022లో ఫాక్స్‌కాన్‌ ఆదాయం 216 బిలియన్‌ డాలర్లు కాగా అందులో భారత విభాగం వాటా 4.6%గా నమోదైంది. అంతక్రితం ఏడాది 2021లో ఇది 2%గా ఉండేది.

తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఎల్రక్టానిక్‌ పరికరాల తయారీ కోసం మరో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ఫాక్స్‌కాన్‌ యోచిస్తోంది. అటు కర్ణాటకలో రూ. 8,800 కోట్లతో ఐఫోన్‌ విడిభాగాల యూనిట్‌ నెలకొల్పే యోచన కూడా ఉంది. ఇందుకు తుమకూరులోని జపాన్‌ ఇండస్ట్రియల్‌ టౌన్‌షిప్‌లో స్థలాన్ని కూడా అధికారులు పరిశీలించినట్లు సమాచారం. కొత్తగా ప్రతిపాదించిన 1.6 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి ప్రణాళికల్లోనే ఈ ఇన్వెస్ట్‌మెంట్‌ కూడా భాగంగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీతో కొత్తగా 14,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగవచ్చని అంచనా. ఇందులో ఫోన్‌ స్క్రీన్‌లు, వెలుపలి కవరింగ్‌లు తయారు చేసే అవకాశం ఉంది.

సెమీకండక్టర్లపైనా దృష్టి..
భారత్‌లో తొలి సెమీకండక్టర్‌ ఫ్యాబ్రికేషన్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ఫాక్స్‌కాన్‌ సైతం పోటీపడుతోంది. ఇందుకోసం ముందుగా వేదాంత సంస్థతో జట్టు కట్టినప్పటికీ, తర్వాత ఆ జాయింట్‌ వెంచర్‌ నుంచి పక్కకు తప్పుకుంది. భారతీయ భాగస్వామి అవసరం లేకుండా సొంతంగానే ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. ఇందుకు సంబంధించి తమ ఫ్యాబ్‌ యూనిట్‌ ప్లాన్‌కి ఆమోదం పొందేందుకు ప్రభుత్వంతో చర్చలు కూడా జరుపుతున్నట్లు కంపెనీ గతంలో తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z