వాతావరణ మార్పులపై గుంటూరుకు చెందిన ఎన్.వి.శరత్‌చంద్ర చేసిన పరిశోధనకు ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ విశ్వవిద్యాలయం పోస్ట్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ స్కాలర్‌షిప్‌ను, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ స్కాలర్‌షిప్‌లను అందజేసింది. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న, తక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లో హీట్ హెల్త్ యాక్షన్ ప్లాన్ పరిశీలించడానికి, విపరీతమైన వేడి మానవులను ఎలా ప్రభావితం చేస్తోందో పరిశీలించడానికి ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ విశ్వవిద్యాలయంలో డాక్టర్ షానన్ రూథర్‌ఫోర్డ్, డాక్టర్ హోక్, డాక్టర్ ఎడ్ మోర్గాన్‌లు పరిశోధన చేస్తున్నారు.
వారి పర్యవేక్షణలో శరత్‌చంద్ర తన పరిశోధన పత్రాలను సమర్పించారు. గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ నాగార్జునకొండ వెంకట సుందరాచారి, డాక్టర్ జ్యోతి ల తనయుడు ఎన్.వి.శరత్‌చంద్ర రూర్కెలాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బయోటెక్నాలజీలో బీటెక్ చదివాడు. అనంతరం రాజకీయ శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ, హైదరాబాద్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో వాతావరణ మార్పులో ఎంటెక్ మాస్టర్ డిగ్రీ చదివాడు. వాతావరణ మార్పుకు సంబంధించి అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో పరిశోధకుడిగా పనిచేశాడు. విపరీతమైన వేడి, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మానవ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని శరత్‌చంద్ర తెలిపాడు.
అందరం కలిసి ఈ సమస్యను పరిష్కరించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రెండు ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియన్ పరిశోధన అవార్డులను అందుకున్న శరత్‌చంద్రకు గుంటూరుకు చెందిన పలువురు వైద్యులు అభినందనలు తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –