DailyDose

జగన్ రాయలసీమ పర్యటన ఖరారు- తాజా వార్తలు

జగన్ రాయలసీమ పర్యటన – తాజా వార్తలు

జగన్ రాయలసీమ పర్యటన

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాల పర్యటన ఖరారైంది. నంద్యాలలో అవుకు రెండవ టన్నెల్‌ను సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం అక్కడ నుంచి వైఎస్ఆర్ కడప జిల్లా వెళ్లనున్నారు. కడప పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాలలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారని సీఎంవో తెలిపింది. ఈ మేరకు షెడ్యూల్ సైతం ఖారు చేసింది. ఈనెల 30న ఉదయం 10 గంటలకు సీఎం వైఎస జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లి చేరుకుంటారు. అక్కడి నుంచి అవుకు రెండవ టన్నెల్‌ సైట్‌కు చేరుకుని నీటిని విడుదల చేసి రెండవ టన్నెల్‌ను జాతికి అంకితం చేయనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ పరిశీలన అనంతరం పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. అక్కడి నుంచి కడప చేరుకుని పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాలలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లిలోని నివాసనికి చేరుకుంటారని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.

కేసీఆర్‌ పేదలను కొట్టి పెద్దలకు ఇస్తున్నారు

దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి కేసీఆర్‌ మోసం చేశారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ (Eatala Rajender) అన్నారు. గజ్వేల్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఎస్సీ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూమి ఇవ్వకపోగా పేదలకు ఉన్న భూములను లాక్కున్నారని ఆరోపించారు. రూ.10 లక్షల పరిహారం ఇచ్చి.. రూ. కోట్లకు అమ్ముకున్నారని విమర్శించారు.‘‘కొండపాక కలెక్టర్ కార్యాలయం నిమిత్తం 25 ఎకరాల భూమి అవసరమైతే 350 ఎకరాల భూమిని తీసుకొని.. మిగతా భూమిని ప్లాట్లుగా చేసి విక్రయించారు. కేసీఆర్‌ పేదలను కొట్టి పెద్దలకు ఇస్తున్నారు. పేదవాళ్లకు ₹కోట్ల విలువ చేసే భూములు ఉండకూడదనే కేసీఆర్ అలా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేసిన అభివృద్ధిని కూడా కేసీఆర్‌ తన ఖాతాలో వేసుకుంటున్నారు. భారాస కండువా వేసుకోకపోతే.. వారిని తెలంగాణ గడ్డమీద బతకనివ్వం, కేసులు పెడతాం అని బెదిరించే పరిస్థితి ఏర్పడింది’’ అని ఈటల వ్యాఖ్యానించారు.

*  కాంగ్రెస్ అంటేనే కరెంట్.. కరెంట్ అంటే కాంగ్రెస్!

కాంగ్రెస్ వాళ్లు అధికారంలోకి వస్తే కరెంటు రాదంటున్నారని, కాంగ్రెస్ అంటేనే కరెంట్.. కరెంట్ అంటే కాంగ్రెస్.. పిచ్చొడా..? అని కాంగ్రెస్ సీనియర్ నేత, మల్లు భట్టి విక్రమార్క బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు. కరెంటును ముట్టుకున్న కాంగ్రెస్‌ను ముట్టుకున్న కేసీఆర్ మాడి మసైపోతాడని సెటైర్లు వేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మధిర మండలంలో రోడ్ షోలో ఆయన మాట్లాడారు.ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నేనని, ఉచిత కరెంట్ పేటెంట్ కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన పవర్ ప్రాజెక్టుల వల్లనే కరెంటు అందుతున్నదని తెలిపారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీనే రైతు రుణ మాఫీ చేసిందని, రైతులకు మేం చాలా మేలు చేశామని గుర్తుచేశారు. కాంగ్రెస్ హయంలో రైతులకు అందే ఎన్నో సబ్సిడీలు కేసీఆర్ రద్దు చేశారని, రైతులను.. కౌలు రైతులను రైతు కూలీలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

చంద్రబాబు బెయిల్‌ రద్దు కేసు డిసెంబర్‌ 8కి వాయిదా

స్కిల్​ కేసులో చంద్రబాబు బెయిల్​ రద్దు చేయాలని ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ రోజు ( నవంబర్​ 28) సుప్రీంకోర్టు విచారించింది.  ఈ పిటిషన్​ విచారించిన జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మ ధర్మాసనం చంద్రబాబు బెయిల్​కు షరతులు విధించింది. ఎలాంటి షరతులు లేకుండా  హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సవరించింది. చంద్రబాబు ఎలాంటి రాజకీయ సభలు పెట్టకూడదని సుప్రీంకోర్టు తెలిపింది.  ఎలాంటి రాజకీయ సభల్లో పాల్గొనరాదంటూ… . కేసుకు సంబంధించిన విషయాలను బయట మాట్లాడొద్దని చంద్రబాబును ఆదేశించింది.  తదుపరి విచారణ వరకు ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది. చంద్రబాబు బెయిల్‌ షరతులు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. తదుపరి విచారణను డిసెంబర్‌ 8 కు వాయిదా వేసింది. అప్పటిలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కాగా స్కిల్‌ స్కాం కేసులో ఇటీవల బాబుకు ఏపీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది .అయితే హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఏపీ సీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిని విచారించిన సుప్రీంకోర్టు బాబుపై పలు ఆంక్షలు విధించింది.

తెలంగాణ అద్భుత రాష్ట్రంగా మారాలి!

తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తోంది.. అనేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకున్నామని భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. గజ్వేల్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘గజ్వేల్‌ ఒక రోల్ మోడల్‌గా ఎదిగింది. ఇక్కడి నుంచి అవకాశం ఇచ్చి రాష్ట్రానికి సీఎం చేశారు. 24 ఏళ్లుగా తెలంగాణనే ఆశగా, శ్వాసగా బతుకుతున్నా. ప్రభుత్వాన్ని కూలగొట్టాలని.. మన ఎమ్మెల్యేలను కొనాలని ఎంతో ప్రయత్నించారు. అవన్నీ దాటుకొని ఈ పదేళ్లలో ఎంతో సాధించాం. విద్యారంగాన్ని అభివృద్ధి చేసుకున్నాం. తెలంగాణ అద్భుత రాష్ట్రంగా మారాలి. పూర్తిస్థాయి అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. పేదలు లేని తెలంగాణ రూపుదిద్దుకోవాలి’’ అని కేసీఆర్ ఆకాంక్షించారు.

వైన్​షాప్​లు బంద్‌

ఎన్నికల నేపథ్యంలో శంషాబాద్‌ ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని వైన్స్, బార్లు, కల్లు కంపౌండ్‌లను ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి మూసి వేస్తున్నట్లు ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ దేవేందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 30వ తేదీ పోలింగ్‌ ముగిసిన అనంతరం తిరిగి షాపులను తెరుస్తారని అన్నారు. ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయించినా, మద్యం నిలువ చేసినా వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలను ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 236 కేసులు నమోదు చేశామన్నారు. తమ ప్రాంతంలో మద్యం విక్రయించినా, డంప్‌ చేసినా ఫోన్‌ నంబర్‌ 8712658750లో ఫిర్యాదు చేయాలని కోరారు.

* చంద్రబాబు వద్దకు కేసీఆర్

తమ ఓటమి ఖరారు కావడంతో టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు ప్రయత్నిస్తున్నారని సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నా అందుకు చంద్రబాబు అంగీకరించలేదన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బాలపేటలో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఎన్నికల ప్రచారంలో నారాయణ పాల్గొని మాట్లాడారు.చంద్రబాబు అక్రమ అరెస్ట్ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్ తీరు చూశామని, అప్పుడేమో అలా మాట్లాడి ఇప్పుడు బాబు మద్దతు కోసం చూస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వల్లే బీజేపీకి కేసీఆర్ తలొగ్గారని.. అందరికీ సన్ స్ట్రోక్ ఉంటే.. కేసీఆర్‌కు మాత్రం డాటర్ స్ట్రోక్ ఉందంటూ వ్యాఖ్యానించారు. ఖమ్మంలో తులసి మొక్కకు గంజాయి మొక్కకు పోటీ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. పువ్వాడ అజయ్ గంజాయి మొక్క లాంటి వాడని.. తుమ్మల తులసి మొక్కలాంటి వాడని పేర్కొన్నారు. ఈసారి పువ్వాడకు సీపీఐ పార్టీకి చెందిన ఒక్క ఓటు కూడా పడదన్నారు.

* హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఆటో తిరిగిన రాహుల్

కాంగ్రెస్ అగ్రనేత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ప్రజలతో తిరిగారు. ఈ క్రమంలోనే.. 2023, నవంబర్ 28వ తేదీ మంగళవారం ఉదయం.. హైదరాబాద్ లో పారిశుధ్య కార్మికులు, ఆటోవాలాలతో సమావేశం అయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లో భాగంగా.. అందరికీ న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఈ సమావేశం తర్వాత.. అక్కడే ఉన్న ఓ ఆటోలో ప్రయాణించారు రాహుల్ గాంధీ. జూబ్లీహిల్స్ ఏరియాలో కొద్దిసేపు ఆటోలో తిరిగారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆటో డ్రైవర్ గా జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటీ.. ప్రభుత్వం నుంచి ఎలా సహకారం కావాలి అనే విషయాలను.. ఆ ఆటో డ్రైవర్ ను అడిగి తెలుసుకున్నారు.హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఆటో తిరిగిన రాహుల్.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ప్రతి ఆటో డ్రైవర్ కు ఏడాదికి 12 వేల రూపాయల ఆర్థిక సాయం చేయనున్నట్లు హామీ ఇచ్చారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z