కేసీఆర్ (KCR) రాకతో కామారెడ్డి (Kamareddy) పూర్తిగా మారిపోతుందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. పట్టణాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు. కామారెడ్డిలో నిర్వహించిన రోడ్‌షోలో కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌కు లోకల్, నాన్ లోకల్ ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు.
‘‘అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉన్నారు.. ఇక్కడ రాష్ట్రాన్నే తెచ్చిన సీఎం ఉన్నారు. ఆయనకు లోకల్, నాన్‌లోకల్ ఉంటుందా?కేసీఆర్ తెలంగాణ మొత్తానికే లోకల్. కాంగ్రెస్, భాజపా అభ్యర్థుల్లో ఎవరు లోకల్?కేసీఆర్ అమ్మగారి ఊరు ఇక్కడే సమీపంలోని కోనాపూర్. అలాంటప్పుడు ఎవరు లోకల్?’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
‘‘తెలంగాణ మినహా ఏ రాష్ట్రంలోనూ బీడీ కార్మికులకు పింఛన్లు లేవు. భారాస మళ్లీ గెలిస్తే బీడీ కార్మికుల పింఛనుకు కటాఫ్ డేట్ తొలగిస్తాం. రాష్ట్రంలో 4.5లక్షల మంది బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్నాం. మరోసారి అధికారంలోకి వస్తే పింఛన్లను దశలవారీగా రూ.5వేలకు పెంచుతాం. జనవరిలో కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేస్తాం. రేషన్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ రూ.5లక్షల బీమా కల్పిస్తాం. అసైన్డ్ భూములపై యజమానులకు పూర్తి పట్టా హక్కులు ఇస్తాం’’ అని కేటీఆర్ అన్నారు.
👉 – Please join our whatsapp channel here –