DailyDose

అప్రమత్తమైన కాంగ్రెస్‌ అధిష్ఠానం-తాజా వార్తలు

అప్రమత్తమైన కాంగ్రెస్‌ అధిష్ఠానం-తాజా వార్తలు

కేఏ పాల్ సీఈవో వికాస్ రాజ్‌పై సంచలన ఆరోపణలు

ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సీఈవో వికాస్ రాజ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సీఈవో వికాస్ రాజ్ పెద్ద డ్రామా నడుపుతున్నారన్నారు. అవినీతి చక్రవర్తిగా సీఈవో మారుతున్నారని ఫైర్ అయ్యారు. వికాస్ రాజ్‌పై చీఫ్ జస్టీస్‌కు కంప్లైంట్ చేశామన్నారు. కేసీఆర్ కేబినెట్ మీటింగ్ ఎలా పెడతారని మండిపడ్డారు. కేసీఆర్ దగ్గర ఉన్న డబ్బుతో వికాస్ రాజ్‌ను కొనేశారా..? అన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దగ్గర డబ్బులు ఎందుకు సీజ్ చేయలేదన్నారు. హైదరాబాద్ ప్రజలు తన మాట విన్నారని.. నూటికి 40 శాతం మాత్రమే ఓటేశారన్నారు. కాంగ్రెస్ కు 58-63 సీట్లు వస్తున్నాయన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులతో కేసీఆర్, కేటీఆర్ మాట్లాడుతున్నారని.. వారిని ప్రలోభాలకు గురి చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

అప్రమత్తమైన కాంగ్రెస్‌ అధిష్ఠానం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ దృష్ట్యా రాష్ట్రంలో రాజకీయం హీటెక్కింది. ఓవైపు ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజారిటీ వస్తుందని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ.. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పార్టీ అధిష్ఠానం రాష్ట్ర నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. కౌంటింగ్‌కు ముందు అభ్యర్థులు ఎవరూ చేజారకూడదని, ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఉండేందుకు అధిష్ఠానం చర్యలకు ఉపక్రమించింది. పార్టీ అభ్యర్థులందరినీ హైదరాబాద్‌ రప్పించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నగరంలోని హోటల్‌ తాజ్‌ కృష్ణలో అభ్యర్థులకు ఏఐసీసీ ప్రతినిధులు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు జరగనున్న 49 కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక పరిశీలకులను ఏఐసీసీ నియమించింది. ఎన్నికల ఏజెంట్‌కు ఎమ్మెల్యే ధ్రువపత్రం ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ను కలిసి కోరారు. అయితే అలాంటి వెసులుబాటు ఏదీ లేదని వికాస్‌ రాజ్‌ వారికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

*  ప్రగతి భవన్‌కు కొత్త రంగులు

తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పోల్స్ రావడంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు కొంత ఆందోళనలో ఉన్నారు. దీంతో పార్టీ కేడర్‌ రేపు ఎన్నికల ఫలితాలు వెల్లడి అయ్యే వరకు భయం, భయంగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నామనే సంకేతాలు గులాబీ బాస్ కేసీఆర్ ఇస్తున్నట్లు ప్రగతి భవన్, అసెంబ్లీకి కొత్త రంగులు వేస్తున్నారని సమాచారం. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో గులాబీ శ్రేణులు మూడోసారి కూడా కేసీఆర్ వస్తారనే దానికి కొత్త రంగులే సంకేతం అని కామెంట్స్ చేస్తున్నారు.మరోవైపు రేపు ఎన్నికల ఫలితాల వేలా ఎందుకీ హడావుడి అని మరి కొంతమంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ శ్రేణులు మాత్రం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అప్పగించడానికి కేసీఆర్ వాటిని సిద్ధం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఏ పార్టీ గెలుస్తుందో అని ఫలితాల ప్రకటన రాకముందే ప్రగతి భవన్, అసెంబ్లీకి కొత్త రంగులు వేయడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. కాగా, ఎన్నికల ఫలితాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు 49 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది.

తెలంగాణలో కాంగ్రెస్‌ సునాయాసంగా వస్తోందని డీకే ధీమా

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ సునాయాసంగా అధికారంలోకి వస్తోందని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(DK Shivakumar) ధీమా వ్యక్తం చేశారు.  తెలంగాణ ఎన్నికల(Telangana Assembly Elections 2023) ఫలితాలపై ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్(Congress) అభ్యర్థులను ట్రాప్‌ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు. ఆయన స్వయంగా సంప్రదించినట్లు మా పార్టీ అభ్యర్థులు చెప్పారు. గెలిచిన వారిని క్యాంపులకు తరలించే అవసరం రాదు’’ అని డీకే తెలిపారు. మరోవైపు 119 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం 49 కేంద్రాలను కేంద్ర ఎన్నికల సంఘం ఎంపిక చేసింది. 113 నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు 14 టేబుళ్ల ద్వారా జరుగనుంది.  500లకు పైగా పోలింగ్‌ కేంద్రాలున్న 6 నియోజకవర్గాల్లో 28 టేబుళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది.

* ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో పెన్షనర్ల హక్కుల కోసం రాజకీయ పార్టీ పెట్టి పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని విశ్రాంత ఐఏఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. రాజ్యాంగం అమలు చేసే వ్యక్తులు సరైన వాళ్లు అయితే అందరి హక్కులకు రక్షణ ఉంటుందన్నారు. వ్యవస్థలు సక్రమంగా నడిచినప్పుడు వ్యక్తుల స్వాతంత్ర్యం కాపాడబడుతుందన్నారు. పెన్షనర్ల హక్కులను ప్రస్తుత ప్రభుత్వం కాలరాస్తుందని, విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో రాజకీయ పార్టీ పెట్టి తమ హక్కుల కోసం పోరాడాల్సి వస్తోందని ఆంధ్రప్రదేశ్‌ పెన్షనర్స్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బరాయన్‌ అన్నారు.సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారన్నారు. సకాలంలో పెన్షన్లు అందక విశ్రాంత ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ హక్కుల కోసం పోరాడేందుకు ఆంధ్రప్రదేశ్‌ పెన్షనర్స్‌ పార్టీ ఏర్పాటు చేశామని, రాబోయే ఎన్నికల్లో అన్ని అర్బన్‌ ప్రాంతాల్లో పెన్షనర్స్‌ పార్టీ పోటీలో ఉంటుందన్నారు. పెన్షనర్ల హక్కుల కోసం, యువత భవిష్యత్తు కోసం తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.

*  దేశంలో కొత్తగా 88 కరోనా కేసులు

గతంలో కరోనా వైరస్‌ విజృంభణతో దేశం  అతలాకుతలమైపోయింది. లక్షల మంది మృత్యువాత పడ్డారు. వ్యాక్సినేషన్ తర్వాత కొంత ఉపశమనం లభించింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే ఈ మహమ్మారి  ఇంకా మన మధ్య నుంచి పోలేదు. భారత్‌లో కొత్తగా 88 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే 396 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకూ కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,33,300. కరోనా సోకిన వారి సంఖ్య 4,50,02,103. మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 4,44,68,407కు పెరిగింది. దేశంలో కరోనా నుండి కోలుకున్నవారి శాతం 98.81 కాగా, మరణాల రేటు 1.19 శాతం. దేశంలో ఇప్పటివరకు మొత్తం 220.67 కోట్లకు పైగా కోవిడ్ -19 వ్యాక్సిన్‌లు అందించారు. కాగా సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (ఐజీఎంసీ)లో కరోనా పాజిటివ్‌తో ఒక మహిళ మృతి చెందింది.

*  సచివాలయంలో ఎండిపోయిన ‘మహాగని’ మొక్క

గత ఎన్నికల సందర్భంగా రాజశ్యామల యాగాన్ని నిర్వహించి ఫలితాలు పొందిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఈసారి ఎన్నికలప్పుడూ అదే యాగాన్ని ఎర్రవల్లిలోని తన సొంత ఫామ్ ‌హౌజ్‌లో నిర్వహించారు. గత నెల 1 నుంచి మూడు రోజుల పాటు జరిగిన ఈ యాగంలో పాల్గొంటూనే ప్రజా ఆశీర్వాద సభలకు సైతం హాజరయ్యారు. ఆ తర్వాత తన విశ్వాసానికి అనుగుణంగా ‘మహాగని’ మొక్కను అడవి నుంచి తీసుకొచ్చి కొత్త సచివాలయం ప్రాంగణంలో నాటించారు. ప్రతీరోజు దాని సంరక్షణ కోసం అటవీ, ఉద్యానవన శాఖల అధికారులు చొరవ తీసుకున్నారు. ఏపుగా పెరిగేందుకు వీలుగా అవసరమైన ఆర్గానిక్ ఎరువులతో పాటు పురుగు పట్టకుండా మందుల్ని సైతం వాడారు.ఆ మొక్కకు ఔషధ విలువల సంగతి ఎలా ఉన్నా ఆధ్యాత్మికంగా శుభం జరుగుతుందని భావించిన కేసీఆర్ దీన్ని సచివాలయంలో నాటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ మొక్క ఆశించిన స్థాయిలో పెరగలేదు. నేల స్వభావమో మరే కారణమో అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది బతకలేదు. ప్రచారం ముగుస్తున్న సమయంలో అది బతికే అవకాశం లేదని తేలిపోయింది. ఇక బతికే ఛాన్స్ లేదని అర్థమైంది. ఏదో అపశకునమేననే అభిప్రాయం వ్యక్తమైంది. ఆ ఎఫెక్టు పోలింగ్ రోజున కనిపించిందనే కామెంట్లూ వినిపించాయి. మొక్క ఎండిపోవడం ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రావనే అపశకునానికి సంకేతమన్న మాటలూ వచ్చాయి.ఆ నమ్మకాలకు బలం చేకూరే తరహాలో పలు సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్ అంచనాలూ వెలువడ్డాయి. అటు యాగం ద్వారా, ఇటు మొక్క నాటడం ద్వారానూ ఫలితాలు రాకపోవచ్చనే స్పష్టత ఏర్పడింది. హరితహారం స్కీమ్‌లో భాగంగా నాటిన సంపెంగ లాంటి మొక్కలు ఏపుగానే పెరిగినా ‘మహాగని’ విషయంలో మాత్రం ప్రతికూల ఫలితాలు రావడం తొలి అపశకునం అని గులాబీ నేతల భావన. కరీబియన్ దీవుల్లో ఏపుగా పెరిగే ఈ మొక్కలను కలప అవసరాల కోసం కేరళలో పెంచాలని చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. కానీ సచివాలయంలో మాత్రం అది ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు.

 త్రిష నుంచి ఊహించని రెస్పాన్స్‌!

స్టార్‌ హీరోయిన్‌ త్రిష పై నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి సోషల్‌ మీడియాలో రచ్చ జరుగుతూనే ఉంది. ఈ వ్యవహారంలో మన్సూర్‌ అలీఖాన్‌ వ్యాఖ్యలను పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. మహిళా కమిషన్‌.. మన్సూర్‌పై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి సమన్లు జారీ చేశారు. మన్సూర్‌ పోలీసుల ఎదుట విచారణకు హాజరై వివరణ ఇచ్చారు.ఈ కేసు విషయంలో ముందస్తు బెయిల్‌ కోసం మద్రాసు హైకోర్టును సైతం ఆశ్రయించారు. అయితే అక్కడ నటుడికి చుక్కెదురైంది. దీంతో మన్సూర్‌ త్రిషకు క్షమాపణ చెప్పారు. ఆ తర్వాత మాత్రం తన మాటలను వక్రీకరించారంటూ తానెవరికీ సారీ చెప్పలేదని బుకాయించాడు. అంతేకాదు త్రిషతో పాటు ఆమె మద్దతుగా నిలబడ్డ కుష్బూ, టాలీవుడ్‌ చిరంజీవిపై పరువు నష్టం దావా వేస్తానని మాట్లాడారు. ఈ వ్యవహారం పక్కన పెడితే పోలీసులు మన్సూర్‌ అలీఖాన్‌ విషయంలో త్రిషను విచారించడానికి ఆమెకు లేఖ రాశారు. అందుకు త్రిష స్పందిస్తూ శుక్రవారంనాడు పోలీసులకు తిరిగి లేఖ రాశారు. అందులో మన్సూర్‌ అలీ ఖాన్‌ తనకు క్షమాపణ చెప్పారని ఆయనపై చర్యలు తీసుకోవద్దని పేర్కొన్నారు. మరి ఈ వ్యవహారం మున్ముందు ఎటు మలుపులు తిరుగుతుందో చూడాలి!

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z